Share News

ప్రైవేట్‌ సేవలో పంటి డాక్టరు

ABN , Publish Date - May 25 , 2024 | 11:36 PM

ప్రభుత్వ ఆసుపత్రిలో విధులు నిర్వర్తించాల్సిన వైద్యుడు ప్రైవేట్‌ సేవలో తరిస్తున్నాడు.

ప్రైవేట్‌ సేవలో పంటి డాక్టరు
డాక్టరు గదిలో ఖాళీగా కుర్చీలు దర్శనమిస్తున్న దృశ్యం

ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుడి నిర్వాకం

వారంలో మూడు రోజులే విధులకు..

అలా వచ్చి ఇలా వెళ్లిపోవడంపై విమర్శలు

పత్తికొండ టౌన్‌, మే 25: ప్రభుత్వ ఆసుపత్రిలో విధులు నిర్వర్తించాల్సిన వైద్యుడు ప్రైవేట్‌ సేవలో తరిస్తున్నాడు. రూ.లక్షల్లో వచ్చే జీతం చాలదన్నట్లు ఆదాయం కోసం ఏర్పాటు చేసుకున్న సొంత క్లినిక్‌లోనే ఎక్కువ సమయం వెచ్చిస్తున్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే బెదిరింపులకు దిగుతున్నారు. తనకు పై స్థాయి అధికారులు, రాజకీయ పలుకుబడి ఉందన్న ధీమా వ్యక్తం చేస్తుంటాడని పలువురు పేర్కొంటున్నారు. పత్తికొండ ప్రభుత్వ ఆసుపత్రి (హెల్త్‌ కమ్యూనిటీ సెంటర్‌)కి రోజు పెద్ద సంఖ్యలో రోగులు వైద్య సేవల కోసం వస్తుంటారు. ఈ ఆసుపత్రిలో విధులు నిర్వర్తించే ఓ డెంటల్‌ వైద్యుడి పని తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పత్తికొండలో ఉద్యోగం చేస్తూ అనంతపురం జిల్లా గుంతకల్లులో కాపురం ఉంటున్న సదరు వైద్యుడు విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారని రోగులు ఆరోపిస్తున్నారు. వారంలో మూడు రోజులు పత్తికొండ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి మిగతా రోజులన్నీ గుంతకల్లులో ఉన్న సొంత క్లినిక్‌లో ఉంటారని చెబుతున్నారు. క్యాంపుల పేరుతో విధులకు డుమ్మా కొట్టి తన సొంత క్లినిక్‌లో తరిస్తున్నట్టు తెలుస్తోంది. పత్తికొండ ఆసుపత్రికి వచ్చిన రోజు 2 గంటలు కూడా ఉండకుండా మధ్యాహ్నం 12 గంటలకే గుంతకల్లుకు తిరుగు ప్రయాణమవుతున్నాడని వైద్యం కోసం వచ్చేవారు చెబుతున్నారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న సదరు వైద్యునిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ విషయంపై ప్రభుత్వ ఆసుపత్రి మెడికల్‌ ఆఫీసర్‌ కల్పనను ఆంధ్రజ్యోతి వివరణ కోరగా.. ఆ వైద్యుడి వ్యవహారం మొదటి నుంచి తలనొప్పిగా మారిందని అన్నారు. సక్రమంగా విధులకు రావడం లేదని, ఇదేమి అని అడిగితే.. పై అధికారులతో ఫోన్‌ చేయిస్తున్నారని చెప్పారు. పంటి సమస్యలతో వచ్చిన రోగులకు మేమే వైద్యం అందిస్తున్నాం. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని అధికారి వివరణ ఇచ్చారు.

Updated Date - May 25 , 2024 | 11:36 PM