Share News

గొల్లపూడి మార్కెట్‌ ప్రహరీగోడ కూల్చివేత

ABN , Publish Date - Aug 09 , 2024 | 01:27 AM

స్థానిక మహాత్మాగాంధీ హోల్‌సేల్‌ మార్కెట్‌ ప్రహరీగోడను గ్రామ పంచాయతీ అధికారులు రాత్రికిరాత్రే కూల్చివేశారు.

గొల్లపూడి మార్కెట్‌ ప్రహరీగోడ కూల్చివేత

గొల్లపూడి, వన్‌టౌన్‌, ఆగస్టు 8: స్థానిక మహాత్మాగాంధీ హోల్‌సేల్‌ మార్కెట్‌ ప్రహరీగోడను గ్రామ పంచాయతీ అధికారులు రాత్రికిరాత్రే కూల్చివేశారు. ప్రహరీగోడ పక్కన ప్రైవేటు స్థలంలో ఓ బిల్డర్‌ నూతనంగా నిర్మిస్తున్న భవనానికి రహదారి ఏర్పాటు నిమిత్తం ఆ స్థలం యజమానితో పంచాయతీ అధికారులు కుమ్మక్కైయ్యారని మార్కెట్‌ కమిటీ ప్రెసిడెంట్‌, సెక్రటరీ పరుచూరి నాగేశ్వరరావు, కాసుల నారాయణ ఆరోపిస్తున్నారు. ఉమ్మడి రాష్ర్టానికి వ్యాపార కేంద్రంగా ఉన్న వన్‌టౌన్‌లో రవాణా రాకపోకలకు రద్దీగా మారిన దృష్ట్యా 1997లో నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వ హయాంలో గొల్లపూడి మహాత్మాగాంధీ హోల్‌సేల్‌ మార్కెట్‌లో సుమారు 500 షాపులు ఏర్పాటు చేశారు. దీనిపై ఆధారపడి వేలాది మంది కార్మికులు జీవిస్తున్నారు. ఈ క్రమంలో షాపు నెం.39 వద్ద ఉన్న ప్రహరీగోడ అవతల వైపు ఓ వ్యాపారికి 2,400 గజాలు ఖాళీ స్ధలం ఉంది. ఈ స్ధలాన్ని గొల్లపూడికి చెందిన బిల్డర్‌ చిగురుపాటి నాగరాజు డెవల్‌పమెంట్‌ నిమిత్తం సుమారు 8ఏళ్ల క్రితం తీసుకుని భారీగా బిల్డింగ్‌ నిర్మాణం చేపట్టారు. ఆ బిల్డింగ్‌కు మార్కెట్‌ ప్రాంగణంలో నుంచి దారివ్వాలంటూ స్ధల యజమాని, బిల్డర్‌ మార్కెట్‌ కమిటీపై ఒత్తిడి చేస్తున్నారు. మార్కెట్‌ భద్రత నిమిత్తం దారివ్వటం కుదరదని మార్కెట్‌ కమిటీ తేల్చి చెప్పింది. ఈ వ్యవహారం గొల్లపూడి గ్రామ పంచాయతీ దృష్టికి వెళ్లింది. మార్కెట్‌ కమిటీ పెద్దలు, గ్రామ పంచాయతీ అధికారుల సమక్షంలో ఆ భవనానికి మార్కెట్‌లో నుంచి రహదారి ఇచ్చేందుకు ఒప్పందం రాసుకున్నారు. మళ్లీ గత నెల నుంచి 2వ రహదారి కావాలంటూ ఒత్తిడి చేస్తున్నారు. మార్కెట్‌ కమిటీ కుదరదని తేల్చి చెప్పింది. ఈ వ్యవహారాన్ని మార్కెట్‌ కమిటీ స్ధానిక ఎంపీ కేశినేని శివనాథ్‌ (చిన్ని) దృష్టికి తీసుకువెళ్లారు. ఇరువర్గాలకు ఇబ్బంది లేకుండా సమస్య పరిష్కరిస్తామని ఎంపీ హామీ ఇచ్చారు. ఈ క్రమంలో గొల్లపూడి పంచాయతీ అధికారులు స్థలం యజమాని, బిల్డర్‌తో కుమ్మక్కై బుధవారం అర్ధరాత్రి ప్రహరీగోడను కూల్చివేసి రహదారి నిర్మాణం చేపట్టారు. విషయం తెలుసుకున్న మార్కెట్‌ ప్రెసిటెంట్‌ నాగేశ్వరరావు, సెక్రటరీ కాసుల నారాయణ, ఉపాధ్యక్షుడు-1 వెలగపూడి శంకర్‌బాబు, ట్రెజరర్‌ నంబూరి సాంబశివరావు, ఉపాధ్యక్షుడు-2 ప్రసాద్‌ కూల్చివేసిన ప్రదేశం వద్దకు వెళ్లి పరిశీలించి దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. స్ధలం యజమాని, బిల్డర్‌ కావాలనే రాత్రికి రాత్రి పంచాయతీ అధికారులతో కలిసి ప్రహరీగోడ కూల్చివేశారని ఆరోపించారు.

Updated Date - Aug 09 , 2024 | 06:37 AM