Share News

పతనావస్థలో ప్రజాస్వామ్యం

ABN , Publish Date - Mar 09 , 2024 | 02:21 AM

రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పతనావస్థలో ఉందని సిటిజన్స్‌ ఫర్‌ డెమోక్రసీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఎన్నికల మాజీ కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ అన్నారు.

పతనావస్థలో ప్రజాస్వామ్యం

ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేద్దాం

ఓటు వేయాలని నిమ్మగడ్డ పిలుపు

నంద్యాల, మార్చి 8: రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పతనావస్థలో ఉందని సిటిజన్స్‌ ఫర్‌ డెమోక్రసీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఎన్నికల మాజీ కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ అన్నారు. సిటిజన్స్‌ ఫర్‌ డెమోక్రసీ ఆధ్వర్యంలో ‘ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేద్దాం - ఓటు వేద్దాం’ రాష్ట్ర స్థాయి కళాజాత శుక్రవారం నంద్యాల జిల్లా కేంద్రంలోని రామకృష్ణ డిగ్రీ కళాశాల వివేకానంద ఆడిటోరియంలో జరిగింది. ఈ కార్యక్రమానికి అతిథిగా హాజరైన నిమ్మగడ్డ మాట్లాడుతూ... ‘రాజ్యాంగం, ప్రజాస్వామ్యం మన దేశ సంస్కృతికి, పౌర సమాజానికి ఆదర్శప్రాయం. కానీ రాష్ట్రంలో అలాంటి వాతావరణం మచ్చుకైనా కనబడటం లేదు. రాష్ట్ర రాజకీయాలలో విష సంస్కృతి తయారైంది. రానున్న ఎన్నికలు రాష్ట్రంలో యుద్ధ వాతావరణంలో జరగనున్నాయి. గతంలో తిరుపతి పార్లమెంట్‌ ఉప ఎన్నికల్లో జరిగిన పరిణామాలు రాజ్యాంగ విరుద్ధంగా జరిగాయి. ఒకే నియోజకవర్గంలో 35 వేల దొంగ ఓట్లు ఉంటే రాష్ట్ర ఎన్నికల యంత్రాంగం ఏం చేస్తోంది? ఒక అసెంబ్లీ స్థానంలోనే అన్ని దొంగ ఓట్లు ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని లక్షల దొంగ ఓట్లు నమోదు చేసి ఉంటారో ఊహించవచ్చు. దీనిపై ఎన్నికల యంత్రాంగం నిష్పక్షపాతంగా చర్యలు తీసుకోకపోవడం బాధాకరం. ప్రజాస్వామ్యంలో వలంటీర్‌ వ్యవస్థకు చట్టబద్ధత లేకున్నా ఓటర్ల వ్యక్తిగత విషయాలు చేపట్టడం రాజ్యాంగ విరుద్ధం. ఎన్నికల విధుల్లో వలంటీర్‌ వ్యవస్థ సేవలను వినియోగించవద్దని కోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ ఎన్నికల అధికారి ఎందుకు స్పందించలేదు? కలెక్టర్లకు ఎందుకు ఆదేశించలేదు?’ అని నిమ్మగడ్డ ప్రశ్నించారు. అనంతరం ప్రముఖ ప్రజా గాయకుడు మహమ్మద్‌ మియా ఓటర్లను చైతన్యపరిచే పాటలు పాడారు. కళాకారులు నృత్యాలు ప్రదర్శించారు. కార్యక్రమంలో సిటిజన్‌ ఫర్‌ డెమోక్రసీ సంయుక్త కార్యదర్శి వల్లంరెడ్డి లక్ష్మీరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 09 , 2024 | 07:40 AM