పింఛన్ల జాప్యం వైసీపీ కుట్రే
ABN , Publish Date - Apr 03 , 2024 | 04:01 AM
ఎన్నికల ముందు పింఛన్ల పంపిణీపై వైసీపీ నాయకులు కుట్రలు చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.

ఆలస్యానికి నిధుల కొరతే కారణం
నెపం టీడీపీపై వేయాలని చూస్తున్నారు
ప్రజలకు చంద్రబాబు బహిరంగ లేఖ
అమరావతి, ఏప్రిల్ 2(ఆంధ్రజ్యోతి): ఎన్నికల ముందు పింఛన్ల పంపిణీపై వైసీపీ నాయకులు కుట్రలు చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. పింఛన్ల పంపిణీలో ఆలస్యం వెనుక వాస్తవాలను తెలియజేస్తూ రాష్ట్ర ప్రజలకు మంగళవారం ఆయన బహిరంగ లేఖ రాశారు. ‘‘ఎన్నికల కోడ్ నేపథ్యంలో నగదు పంపిణీ చేసే బాధ్యతల నుంచి వలంటీర్లను ఎన్నికల కమిషన్ తప్పించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా ప్రత్యామ్నాయ మార్గాల్లో ఇళ్ల వద్దకే పింఛన్లు అందించాలని ఈసీ ఆదేశించింది. కానీ, ఈ పరిణామాన్ని కుట్రలు, కుతంత్రాలకు వైసీపీ ఉపయోగించుకుంటున్న విధానాన్ని రాష్ట్ర ప్రజలు, లబ్ధిదారులు అర్థం చేసుకోవాలి. గతేడాది, 2022లలో ఏప్రిల్ ఒకటో తేదీకి ముందే పింఛన్ల నిధులు బ్యాంకుల నుంచి విత్‌డ్రా చేసి ఒకటో తేదీన పంపిణీ చేశారు. ఈ ఏడాది కూడా ముందే బ్యాంకుల నుంచి విత్ డ్రా చేసి ఉంటే ఇబ్బంది ఎదురయ్యేది కాదు. మార్చి 16 నుంచి 30వ తేదీ మధ్య 15 రోజుల్లోనే సొంత కాంట్రాక్టర్లకు రూ.13 వేల కోట్లు విడుదల చేసిన జగన్‌రెడ్డి ప్రభుత్వం పింఛనుదారులకు ఇవ్వాల్సిన రూ.2 వేల కోట్లను కూడా సొంత కాంట్రాక్టర్లకు కట్టబెట్టి ఖజానా ఖాళీ చేశారు. నిధుల కొరత వల్లే పింఛన్ల పంపిణీని జాప్యం చేస్తున్నారు. ఇళ్ల వద్దనే పింఛన్లు ఇవ్వాలని ఈసీ ఇచ్చిన ఆదేశాలనూ జగన్ లెక్క చేయకుండా.. మండుటెండల్లో పింఛన్‌దారులను కష్టపెట్టి, ఆ నెపాన్ని ప్రతిపక్షాలపైకి నెట్టి ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తున్నారు. గత ఎన్నికల సమయంలో బాబాయి హత్య ను రాజకీయ లబ్ధికి వాడుకున్నాడు. నారాసుర రక్తచరిత్ర అంటూ నాపై నిందలేశాడు. నేడు పింఛన్ల పంపిణీ విషయంలోనూ జగన్నాటకం ఆడుతూ పింఛనుదారులకు నమ్మక ద్రోహం చేస్తున్నాడు. ఈ విషయాన్ని లబ్ధిదారులు, ప్రజలు అర్థం చేసుకోవాలని కోరుతున్నాను. టీడీపీపైకి నెపం నెట్టి ఎన్నికల్లో లబ్ధి పొందడానికి అవ్వాతాతల్ని అవస్థలపాలు చేయడం దుర్మార్గం కాదా? దివ్యాంగులు, వృద్ధులు, రోగులకు మాత్రమే ఇళ్ల వద్ద పింఛన్లు ఇస్తామని, మిగిలినవారికి సచివాలయాల వద్ద ఇస్తామంటూ సర్క్యులర్ ఇవ్వడం దుర్మార్గం. ఈ కుట్రలకు, నాటకాలకు తెరదించి లబ్ధిదారులందరికీ ఇళ్ల వద్దనే పింఛన్లు పంపిణీ చేయాలని ప్రజల తరఫున డిమాండ్ చేస్తున్నాను’’ అని చంద్రబాబు ఆ లేఖలో పేర్కొన్నారు.