Share News

రుతుపవనాల విస్తరణలో జాప్యం

ABN , Publish Date - Jun 12 , 2024 | 02:57 AM

దేశ పశ్చిమ తీరంలో చురుగ్గా ఉన్న నైరుతి రుతుపవనాలు తూర్పుతీరంలో స్తబ్దుగా మారాయి. నాలుగైదు రోజుల క్రితమే విజయనగరం వరకూ విస్తరించిన రుతుపవనాలు ఆ తరువాత ముందుకు కదలలేదు.

రుతుపవనాల విస్తరణలో జాప్యం

అల్పపీడనం ఏర్పడితేనే పురోగమనం

కోస్తాలో మళ్లీ ఎండ తీవ్రత, ఉక్కపోత

(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌)

దేశ పశ్చిమ తీరంలో చురుగ్గా ఉన్న నైరుతి రుతుపవనాలు తూర్పుతీరంలో స్తబ్దుగా మారాయి. నాలుగైదు రోజుల క్రితమే విజయనగరం వరకూ విస్తరించిన రుతుపవనాలు ఆ తరువాత ముందుకు కదలలేదు. కాగా, మంగళవారం అరేబియా సముద్రంలోని అనేక ప్రాంతాలు, మహారాష్ట్ర, గుజరాత్‌ వరకు రుతుపవనాలు విస్తరించాయి. తూర్పుతీరం వరకు విస్తరణకు సరిపడా బలమైన కరెంట్‌ అరేబియా సముద్రంలో లేదని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. రుతుపవనాలు ఈనెల తొలి వారంలోనే ఏపీలో ప్రవేశించడం, ఎండ తీవ్రత, బంగాళాఖాతం నుంచి తేమగాలులు రావడంతో జూన్‌ నెలలో ఇంతవరకూ మిగులు వర్షాలు కురిశాయి. ఏపీలో ఈనెల ఒకటో తేదీ నుంచి మంగళవారం వరకు 30.4 మిల్లీమీటర్లకు 80.4 మి.మీ.(సాధారణం కంటే 165 శాతం ఎక్కువ) వర్షపాతం నమోదైంది. బంగాళాఖాతంలో రుతుపవన కరెంట్‌ మోస్తరుగా ఉన్నా అల్పపీడనం ఏదీ లేకపోవడం రుతుపవనాల విస్తరణకు కొంత వరకు అడ్డంకిగా మారిందని నిపుణులు చెబుతున్నారు. దీంతో రాష్ట్రంలో గడచిన మూడు రోజుల నుంచి వర్షాలు తగ్గి ఎండ తీవ్రత పెరగడంతోపాటు ఉక్కపోత వాతావరణం నెలకొంది. కాగా, రుతుపవనాలు దేశం తూర్పు ప్రాంతం వైపు రావడానికి అనువైన వాతావరణం ఏర్పడాల్సి ఉందని నిపుణులు అంటున్నారు. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడితే రుతుపవనాలు పురోగమిస్తాయన్నారు.

చెట్టు కొమ్మ విరిగిపడి వృద్ధుడి మృతి..

కోస్తా, రాయలసీమల్లో మంగళవారం అక్కడక్కడ వర్షాలు కురిశాయి. ఈదురు గాలులకు అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం కౌకుంట్ల గ్రామంలో చెట్టు కొమ్మ విరిగిపడి గ్రామానికి చెందిన రామలింగ(60) మృతిచెందారు. రానున్న 24 గంటల్లో రాష్ట్రంలోని పలుచోట్ల వర్షాలు కురుస్తాయని, 13వ తేదీన కోస్తాలో అక్కడక్కడ భారీవర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తీరం వెంబడి బలమైన గాలులు వీస్తున్నందున సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించింది.

Updated Date - Jun 12 , 2024 | 07:09 AM