Share News

భార్యాపిల్లలను బలిపెట్టి రైతు బలవన్మరణం

ABN , Publish Date - Dec 29 , 2024 | 05:11 AM

వ్యవసాయమే అతని వ్యసనం! కానీ ఆరుగాలం కష్టించినా పెట్టుబడులూ రాకపోగా అప్పులపాలయ్యాడు.

భార్యాపిల్లలను బలిపెట్టి రైతు బలవన్మరణం

సింహాద్రిపురం/పులివెందుల టౌన్‌, డిసెంబరు 28(ఆంధ్రజ్యోతి): వ్యవసాయమే అతని వ్యసనం! కానీ ఆరుగాలం కష్టించినా పెట్టుబడులూ రాకపోగా అప్పులపాలయ్యాడు. రుణదాతల ఒత్తిడి ఎక్కువ కావడంతో తట్టుకోలేక.. భార్య, ఇద్దరు పిల్లలను బలిపెట్టి తానూ బలవన్మరణానికి పాల్పడ్డాడు. కడప జిల్లా సింహాద్రిపురం మండలం దుద్దెకుంట్ల గ్రామానికి చెందిన రైతు కొమెర నాగేంద్ర(41)కు భార్య వాణి(33), కుమారుడు భార్గవ్‌ (13), కుమార్తె గాయత్రి(12) ఉన్నారు. నాగేంద్ర తన ఎకరన్నర పొలంతో పాటు మరికొంత పొలాన్ని కౌలుకు తీసుకుని సాగుచేసేవారు. చీడపీడలు, తెగుళ్లతో సరైన దిగుబడి రాకపోవడంతో సుమారు రూ.20 లక్షలు అప్పులపాలయ్యారు. వడ్డీలు పెరిగిపోవడం, రుణ దాతల నుంచి ఒత్తిళ్లు పెరగడంతో నాగేంద్ర తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి తోట వద్దకు తొలుత భార్యను, అనంతరం కూతురిని తర్వాత కుమారుడిని బైక్‌పై తీసుకెళ్లి ఒకరి తర్వాత ఒకరిని గొంతుకు తాడు బిగించి హతమార్చి, తానూ అక్కడే గేటుకు ఉరివేసుకున్నారు. రాత్రి పొద్దుపోయాక కూడా వారు ఇంటికి రాకపోవడంతో నాగేంద్రకు తల్లి ఫోన్‌ చేయగా సెల్‌ స్విచ్చాఫ్‌ వచ్చింది. ఈ విషయం తెలిసి బంధువులు, గ్రామస్థులు గాలించగా అర్ధరాత్రి దాటాక తోట దగ్గర నాగేంద్ర, వాణి, భార్గవ్‌, గాయత్రి విగతజీవులై కనిపించారు. ఘటనపై కలెక్టర్‌ శ్రీధర్‌ ఆరా తీశారు. పులివెందుల డీఎస్పీ మురళీనాయక్‌ మాట్లాడుతూ.. అప్పుల బాధతో భార్యాపిల్లలను హత్య చేసి నాగేంద్ర ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. ఆత్మహత్యకు ఇంకేవైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామన్నారు. కాగా.. ఈ ఘటనపై వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై విచారణ జరపాలని అధికారులను ఆదేశించారు.

Updated Date - Dec 29 , 2024 | 05:11 AM