ప్రాణాలు తీసిన ఈత సరదా
ABN , Publish Date - Oct 21 , 2024 | 03:17 AM
ఆరుగురు ఇంజనీరింగ్ విద్యార్థులు ఆదివారం ఆటవిడుపుగా ట్రెక్కింగ్‌కు వెళ్లారు. మధ్యాహ్నం వరకూ సరదాగా గడిపారు.
క్వారీ గోతుల్లో నీట మునిగి ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులు మృతి
గన్నవరం, అక్టోబరు 20 (ఆంధ్రజ్యోతి): ఆరుగురు ఇంజనీరింగ్ విద్యార్థులు ఆదివారం ఆటవిడుపుగా ట్రెక్కింగ్‌కు వెళ్లారు. మధ్యాహ్నం వరకూ సరదాగా గడిపారు. పక్కనే ఉన్న క్వారీ గోతుల్లోని నీటిలో స్నానం చేసేందుకు దిగగా, వారిలో ఇద్దరు మునిగిపోయి మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గన్నవరం మండలంలోని మాదలవారిగూడెం లింగయాస్ ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతున్న ఆరుగురు ఫైనలియర్ విద్యార్థులు ఆదివారం సరదాగా ట్రెక్కింగ్‌కు వెళ్లారు. గట్టు ఎక్కి దిగడంతో అందరికీ చెమటలు పట్టాయి. పక్కనే ఉన్న తోకతిప్ప క్వారీ గోతుల్లో నీళ్లు ఉండటంతో స్నానం చేసేందుకు వెళ్లారు. కొద్దిసేపటికి ఇద్దరు మునిగిపోవటంతో ఆందోళనకు గురైన మిగిలినవారు కాపాడే ప్రయత్నం చేశారు. ఫలితం లేకపోవడంతో ఎన్డీఆర్‌ఎ్‌ఫకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చేసరికి ఇద్దరు మృతిచెందారు. సీఎ్‌సఈ ఫైనలియర్ చదువుతున్న ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం సుబ్బాల గ్రామానికి చెందిన పగడాల దుర్గారావు (21), ఏడీఎస్ ఫైనలియర్ విద్యార్థి తెలంగాణ రాష్ట్రం భువనగిరి జిల్లా యాదాద్రి మండలం రాజానగరం గ్రామానికి చెందిన జొగ్గరాజు వెంకటేష్ రాజు(22) ఈ ఘటనలో మృతి చెందారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై ప్రేమ్‌కుమార్ తెలిపారు.