Share News

తిట్టను పో!

ABN , Publish Date - Jan 05 , 2024 | 04:16 AM

టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేశ్‌, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌లను తిట్టాలంటూ ముఖ్యమంత్రి జగన్‌ విధించిన షరతుకు కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మహీధర్‌రెడ్డి ససేమిరా అన్నట్లు తెలిసింది.

తిట్టను పో!

వైసీపీ దూతలకు తేల్చిచెప్పిన మహీధర్‌రెడ్డి

బాబు, పవన్‌,లోకేశ్‌పై

విమర్శలకు కందుకూరు ఎమ్మెల్యే ‘నో’

‘ప్రెస్‌ మీట్‌ పెట్టను.. టికెట్‌ మీ ఇష్టం’ అని స్పష్టీకరణ

కనిగిరి ఎమ్మెల్యే సీఎంవోకు వెళ్లటంపై చర్చ

ఒంగోలు, నెల్లూరు, జనవరి 4 (ఆంధ్రజ్యోతి): టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేశ్‌, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌లను తిట్టాలంటూ ముఖ్యమంత్రి జగన్‌ విధించిన షరతుకు కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మహీధర్‌రెడ్డి ససేమిరా అన్నట్లు తెలిసింది. తిడితేనే సీటు అని ఒత్తిడి పెట్టినా ఆయన అంగీకరించలేదని చెబుతున్నారు. గురువారం తనను కలిసిన వైసీపీ పార్టీ దూతలతో మహీధరరెడ్డి ఆ విషయాన్ని తేల్చిచెప్పారు. చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌, నారా లోకేశ్‌లపై విమర్శలు చేస్తూ మీడియా సమావేశం ఏర్పాటు చేయాలని మహీధరరెడ్డికి జగన్‌రెడ్డి షరతు విధించారు. ఆ విషయాన్ని చెప్పాలని విజయసాయిరెడ్డి, రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకరరెడ్డిలకు జగన్‌ సూచించారు. ఆయనకు నేరుగా ఆ విషయాన్ని చెప్పలేక నెల్లూరు డిప్యూటీ మేయర్‌ రూప్‌కుమార్‌ యాదవ్‌, ఐప్యాక్‌ ప్రతినిధులను గురువారం మహీధరరెడ్డి వద్దకు పంపారు. అందిన సమాచారం మేరకు ‘నేను ప్రెస్‌మీట్‌ పెట్టను, పెట్టలేను’ అని మహీధరరెడ్డి చెప్పినట్లు తెలిసింది. ఆ షరతును అమలు చేస్తేనే పార్టీ టికెట్‌ లభిస్తుందని సీఎం చెప్పమన్నట్లుగా వారు ఆయన దృష్టికి తీసుకెళ్లినట్లు కూడా తెలిసింది. ‘అలాగా.. అయితే ప్రెస్‌మీట్‌ వద్దు, టికెట్‌ విషయం మీ ఇష్టం. మా తండ్రి మూడుసార్లు ఎమ్మెల్యే, నేను నాలుగుసార్లు ఎమ్మెల్యేని. స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన చరిత్ర మాది. నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో చాలా చూశాం. వైసీపీ రాజకీయ చరిత్ర కన్నా మా రాజకీయ చరిత్రే అధికం’ అని సూటిగా ఆయన తేల్చిచెప్పినట్లు తెలిసింది. ఆ తర్వాత మహీధరరెడ్డితో జరిగిన సంభాషణను వారు విజయసాయి, వేమిరెడ్డిలకు వివరించారు. కాగా ఇదే సమయంలో కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్‌యాదవ్‌ సీఎంవోకు వెళ్లటం విశేషం. గురువారం సాయంత్రం ఆయన సీఎంవోలో ఉన్నారు. దీంతో అవసరమైతే మధుసూదన్‌యాదవ్‌ను కందుకూరు నుంచి రంగంలోకి దింపే ప్రయత్నంలో భాగంగా పిలిపించి ఉండవచ్చని భావిస్తున్నారు. అయితే తాను నియోజకవర్గ పనులపై సీఎంవోకు వచ్చానని తనకు కనిగిరి టికెట్‌ ఎప్పుడో ఖరారైందని మధుసూదన్‌యాదవ్‌ తనను అడిగిన సన్నిహితులకు చెప్పుకొన్నారు.

జగన్‌కు ఇది నాలుగో షాక్‌!?

నెల్లూరు జిల్లా వైసీపీ నేతలు జగన్‌కు షాకుల మీద షా కులు ఇస్తున్నారు. కొన్నాళ్ల క్రితం కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, మేకపాటి చంద్రశేఖర్‌ రెడ్డి జగన్‌పై తిరుగుబాటు ప్రకటించి బయటకు వచ్చారు. తెలుగుదేశం పార్టీ సాదర ఆహ్వానం మేరకు ఆ పార్టీలో చేరారు. వాస్తవానికి జగన్‌కు ఇది భారీ షాక్‌. రాష్ట్రవ్యాప్తంగా వైసీపీలో తిరుగుబాట్లకు నెల్లూరులోనే బీజం పడింది. ముగ్గురు బలమైన నాయకులు ఏక కాలంలో తిరుగుబాటు ప్రకటించి వెలుపలికి వెళ్లిన కొద్ది రోజుల వ్యవధిలోనే ఇదే జిల్లాకు చెందిన మరో బలమైన ఎమ్మెల్యే మహీధర్‌రెడ్డి జగన్‌ ఆదేశాన్ని ధిక్కరించారు. వీరందరూ జగన్‌ సామాజికవర్గానికి చెందినవారే కావడం ఒక విశేషమైతే, అందరూ వైఎస్‌ కుటుంబానికి వీర విధేయులుగా గుర్తింపు పొందిన నాయకులు కావడం మరోవిషయం.

Updated Date - Jan 05 , 2024 | 04:16 AM