‘రెడ్ బుక్’.. సిద్ధం
ABN , Publish Date - Jun 07 , 2024 | 02:20 AM
రెడ్‌బుక్ సిద్ధం పేరిట గుంటూరు జిల్లా మంగళగిరిలో పలుచోట్ల ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు చర్చనీయాంశంగా మారాయి.

మంగళగిరి సిటీ, జూన్ 6: రెడ్‌బుక్ సిద్ధం పేరిట గుంటూరు జిల్లా మంగళగిరిలో పలుచోట్ల ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు చర్చనీయాంశంగా మారాయి. సార్వత్రిక ఎన్నికల ముందు యువగళం పాదయాత్రలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ వైసీపీ అరాచక పాలనపై రెడ్‌బుక్‌ను తెరమీదికి తీసుకువచ్చారు. తనతోపాటు చంద్రబాబుపై అక్రమ కేసులు బనాయించి, పార్టీ నేతలు, కార్యకర్తలను వేధించిన వారి పేర్లను రెడ్‌బుక్‌లో నమోదు చేస్తున్నానని ప్రకటించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అందరి లెక్కలు తేలుస్తామన్నారు. ఈ నేపథ్యంలో లోకేశ్ చెప్పిన రెడ్‌బుక్ అంశాన్ని గుర్తుచేస్తూ మంగళగిరిలో పలుచోట్ల భారీ ఫ్లెక్సీలు వెలిశాయి. నారా లోకేశ్ ఫొటోతోపాటు రెడ్‌బుక్ సిద్ధం.. సిద్ధం ఫర్ రీసైలెన్స్, ఎంపవర్‌మెంట్, డెవల్‌పమెంట్ అంటూ ముద్రించారు. అడుసుమిల్లి సురేంద్ర పేరుతో ఏర్పాటు చేసిన ఈ ఫ్లెక్సీ గురించి ప్రజలు ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు.