Share News

పొలం వద్ద నరికి చంపారు

ABN , Publish Date - Mar 26 , 2024 | 03:56 AM

కీలకమైన ఎన్నికల వేళ.. రాష్ట్రంలో హత్యారాజకీయాలు కొనసాగుతున్నాయి. ఇటీవలే మూడు జిల్లాల ఎస్పీలను పిలిచి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి హెచ్చరించినా పరిస్థితిలో మార్పు కనిపించడం లేదు.

పొలం వద్ద నరికి చంపారు

శ్రీసత్యసాయి జిల్లాలో టీడీపీ నేత దారుణ హత్య

రాష్ట్రంలో కొనసాగుతున్న హత్యా రాజకీయాలు

ప్రచారం నుంచి వచ్చిన కాసేపటికే దారుణం

రాజకీయ కోణంపై సర్వత్రా సందేహాలు

వ్యక్తిగత కారణాలే అంటున్న పోలీసులు

నల్లమాడ, మార్చి 25: కీలకమైన ఎన్నికల వేళ.. రాష్ట్రంలో హత్యారాజకీయాలు కొనసాగుతున్నాయి. ఇటీవలే మూడు జిల్లాల ఎస్పీలను పిలిచి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి హెచ్చరించినా పరిస్థితిలో మార్పు కనిపించడం లేదు. తాజాగా శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలో టీడీపీ నాయకుడు డి. అమరనాథ్‌రెడ్డి(42) దారుణ హత్యకు గురయ్యారు. నల్లమాడ మండలం కుటాలపల్లికి చెందిన ఆయన.. ఆదివారం పగలంతా టీడీపీ అభ్యర్థి ప్రచారంలో పాల్గొన్నారు. అనంతరం, రాత్రి పొలం వద్దకు వెళ్లారు. సోమవారం ఉదయం ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెళ్లి గమనించారు. రక్తపు మడుగులో ఉండటంతో హత్యకు గురైనట్లు గుర్తించారు. ఈ ఘటనపై అమరనాథ్‌రెడ్డి భార్య సుధమ్మ తమకు ఫిర్యాదు చేశారని ఎస్‌ఐ రమేశ్‌బాబు తెలిపారు.

పొలం వద్దే దారుణం

టీడీపీ నేత అమరనాథ్‌రెడ్డి వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. తనకున్న పొలంతోపాటు ఇతరుల పొలాన్ని కౌలుకు తీసుకుని సాగుచేస్తున్నారు. సొంత పొలం వద్దే ఆవులు, ఇతర పశువులను పెంచుతున్నారు. ఎప్పటిలాగే ఆదివారం రాత్రి పాల క్యాన్లు తీసుకుని పొలం వద్దకు వెళ్లారు. పాలు తీసుకుని సోమవారం ఉదయం ఇంటికి రావలసిన భర్త ఎంతసేపటికీ రాకపోవడంతో సుధమ్మ ఫోన్‌ చేసింది. స్పందించకపోవడంతో అనుమానం వచ్చి, తన అక్క కుమారుడు శ్యామ్‌సుందర్‌రెడ్డిని పొలంవద్దకు పంపింది. ఆయన వెళ్లి చూసేసరికే అమరనాథ్‌రెడ్డి రక్తపు మడుగులో పడివున్నారు. దీంతో తీవ్ర భయాందోళలకు గురైన ఆయన సుధమ్మకు ఫోన్‌ చేశారు. ‘చినాన్నను ఎవరో నరికి చంపేశారు’ అని చెప్పారు. దీంతో సుధమ్మ గుండెలు బాదుకుంటూ స్థానికులతో కలిసి పొలం వద్దకు చేరుకున్నారు. భర్త శవాన్ని చూసి సుధమ్మ సొమ్ముసిల్లి పడిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. సుధమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అమరనాథ్‌రెడ్డికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.

డాగ్‌ స్క్వాడ్‌తో పరిశీలన

హంతకుల ఆచూకీని కనిపెట్టేందుకు పోలీసులు అనంతపురం నుంచి డాగ్‌ స్వ్కాడ్‌ను రప్పించారు. హత్య జరిగిన ప్రాంతంలో సంచరించిన పోలీసు జాగిలం.. ఒక్కటిన్నర కిలోమీటరు దూరంలో ఉన్న కుటాలపల్లికి వచ్చింది. గ్రామం నడిబొడ్డున ఉన్న అమరనాథ్‌రెడ్డి ఇంటికి వెళ్లింది. అనంతరం తిరిగి ఘటనా స్థలానికి చేరుకుంది. కాగా, అమరనాథ్‌రెడ్డి హత్యతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అమరనాథ్‌రెడ్డి అందరితోను కలిసిమెలిసి ఉండేవారని, వివాదాల జోలికి వెళ్లేవారు కాదని స్థానికులు తెలిపారు. అమరనాథ్‌రెడ్డిని ఎవరు, ఎందుకు హత్య చేశారో తెలియడం లేదని చెప్పారు.

వ్యక్తిగత కారణాలవల్లే: ఎస్పీ

వ్యక్తిగత కారణాలతోనే అమరనాథ్‌రెడ్డి హత్య జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించామని శ్రీసత్యసాయి జిల్లా ఎస్పీ మాధవరెడ్డి తెలిపారు. డీఎస్పీ వాసుదేవన్‌తో కలిసి ఆయన ఘటనా స్థలాన్ని పరిశీలించారు. హత్య వెనుక ఎలాంటి రాజకీయ కోణం లేదని, కేవలం వ్యక్తిగత కారణాలతోనే హత్య జరిగి ఉండవచ్చన్నారు.

రాజకీయ కోణం ఉందా?

హత్యకు గురైన అమరనాథ్‌రెడ్డి టీడీపీలో చురుకైన నాయకుడు. చాలాకాలం నుంచి పార్టీలో ఉన్నారు. ఆదివారం సాయంత్రం కూడా ప్రచారానికి వెళ్లి వచ్చారు. దీంతో ఆయన హత్య వెనుక రాజకీయ కోణం ఉందనే చర్చ జరుగుతోంది. ఎన్నికల సమయంలో టీడీపీ నాయకుడు హత్యకు గురికావడంతో రాజకీయ కారణాలతోనే హత్య చేసి ఉంటారని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కానీ, పోలీసులు మాత్రం వ్యక్తిగత కారణాలతోనే హత్య జరిగి ఉంటుందని తెలిపారు. అయితే, తమకు ఎవరితోనూ వ్యక్తిగత తగదాలు, ఆస్తి గొడవలు లేవని బాధిత కుటుంబం పేర్కొంది.

అండగా ఉంటాం: పల్లె

అమరనాథ్‌ రెడ్డి హత్య గురించి తెలియగానే మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి కుటాలపల్లికి వెళ్లారు. హత్య జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. అమరనాథ్‌రెడ్డి కుటుంబ సభ్యులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. పార్టీ సహా తాను వ్యక్తిగతంగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అనంతరం ఎస్పీ మాధవరెడ్డితో హత్య విషయంపై చర్చించారు. దారుణానికి తెగబడ్డ వారిని వెంటనే గుర్తించి, అరెస్టు చేయాలని కోరారు.

Updated Date - Mar 26 , 2024 | 03:56 AM