Share News

చిరు సేద్యం..చిన్న రైతు సుభిక్షం

ABN , Publish Date - Jun 11 , 2024 | 12:50 AM

ఈ ఖరీఫ్‌ సీజన్‌లో రైతులు చిరుధాన్యాల సాగు పట్ల మక్కువ చూపుతున్నారు.

చిరు సేద్యం..చిన్న రైతు సుభిక్షం

గోనెగండ్ల, జూన్‌ 10: ఈ ఖరీఫ్‌ సీజన్‌లో రైతులు చిరుధాన్యాల సాగు పట్ల మక్కువ చూపుతున్నారు. ఈ సీజన్‌లో నియోజకవర్గ పరిఽధిలో రైతులు ఆశించిన మేరనే సాగు చేస్తున్నారు. కొర్ర, సజ్జ, రాగులు, జొన్న పంటలను అంతర్‌ పంటలుగా రైతులు సాగు చేస్తున్నారు. పల్లెలు, పట్టణాలలో ఎక్కువ మంది చిరుధాన్యాలనే ఆహారంగా వాడుతుండటంతో వాటికి మంచి గిరాకీ పెరిగింది. వైద్యులు సైతం చిరుధాన్యాలను వాడాలని చెప్పడంతో ఈ పంటలకు మరింత డిమాండ్‌ పెరిగింది.

చిరుధాన్యాల సాగు

ఈ ఖరీఫ్‌ సీజన్‌లో కొర్ర పంటను నియోజకవర్గంలో 400 హెక్టార్‌లు, సజ్జ పంట 300 హెక్టార్లు జొన్న, రాగులు, అట్టు కోర్రలుమరో 300 హెక్టార్‌లలో రైతులు సాగు చేస్తున్నారు.

పెట్టుబడి తక్కువ దిగుబడి ఎక్కువ

చిరు ధాన్యాల సాగుకు పెట్టుబడి తక్కువ దిగుబడి ఎక్కువగా ఉంటుంది. ఈ పంటలను అంతర్‌ పంటలుగా సాగుచేస్తారు. ఈ పంటలు క్వింటం ధర రూ. 6వేల నుంచి రూ. 14వేల వరకు పలుకుతుంది. పశువులకు మేతకూడా వస్తుంది. ఈ మేతతో పాడి పశువుల రైతులకు గ్రాసం భారం తగ్గుతుంది. పాడి కూడా పెరుగుతుంది. రైతులు ప్రస్తుతం ఎక్కువగా ఈ పంటల సాగుకు ఇష్టపడుతున్నారు. గోనెగండ్ల మండలంలో గాజులదిన్నె, కులుమాల, పెద్దనేలటూరు, చిన్నమరివీడు, చిన్ననేలటూరు, తిప్పనూరు, వేముగోడు, ఎర్రబాడు, హెచ్‌ కైరవాడి, నందవరం మండలంలో గురుజాల, ముగతి, నందవరం, మిట్టసోమాపురం, పూలచింత, సోమలగూడురు, నది కైరవాడి, ఎమ్మిగనూరు మండలంలోని 10 గ్రామాల్లో ఈ పంటలు అధికంగా సాగు చేస్తున్నారు.

కొర్ర వర్షాధార పంట

కొర్ర పంట కేవలం 100 రోజుల్లో పంట చేతికి అందుతుంది. ఎకరాకు 10, 12 బస్తాలు దిగుబడి వస్తుంది. అన్ని పంటల్లా కొర్ర పంటకు నీటి అవసరం పెద్దగా ఉండదు, కేవలం వర్షం పై ఆధారపడి పంట పండించవచ్చనే ఉద్ధేశ్యంతో పంటకు ఎటువంటి పిచికారి మందులు గానీ ఎరువులు అవసరం లేకున్నా భూమిలోని సారాన్ని బట్టి మంచి దిగుబడి సాధించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

సజ్జ, కొర్ర సాగు చేశా

నేను ఒక ఎకరాంలో సజ్జ, కొర్ర పంటలు సాగు చేశాను. ప్రతి ఏడాది సజ్జ, కొర్రను సాగు చేస్తాను. ఈ పంటకు మంచి గిరాకీ కూడా ఉంది. మార్కెట్‌లో ఎప్పుడైన ధర పలుకుతుంది. ఆరోగ్యానికి అవసరం అని చాల మంది ఇంటి దగ్గరకే వచ్చి పండిన కొర్ర, సజ్జలను విడిగా కొనుకొని వెలతారు. పెట్టుబడికూడా పెద్దగా ఉండదు. మంచి లాభాలు వస్తాయి. ఇటీవల ఈ పంటలకు మంచి ప్రచారం వస్తుంది.

- శ్రీనివాసులనాయుడు, గాజులదిన్నె

Updated Date - Jun 11 , 2024 | 12:50 AM