Share News

ఛీకొట్టిన విశాఖ!

ABN , Publish Date - Jun 05 , 2024 | 04:38 AM

జగన్‌ను విశాఖ ప్రజలు ఛీకొట్టారు. జిల్లాలోని మొత్తం ఏడు నియోజకవర్గాల్లోనూ వైసీపీని ఓడించారు. విశాఖను పాలనా రాజధాని చేస్తామని,

ఛీకొట్టిన విశాఖ!

జగన్‌ను విశ్వసించని జనం

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

జగన్‌ను విశాఖ ప్రజలు ఛీకొట్టారు. జిల్లాలోని మొత్తం ఏడు నియోజకవర్గాల్లోనూ వైసీపీని ఓడించారు. విశాఖను పాలనా రాజధాని చేస్తామని, ఆర్థిక రాజధానిగా మారుస్తామంటూ జగన్‌ ఆడిన డ్రామాలను జనం విశ్వసించలేదు. ఈ ఎన్నికల్లో గెలిస్తే విశాఖలోనే ప్రమాణ స్వీకారం చేస్తానని, ఇక్కడి నుంచే పరిపాలన కొనసాగిస్తానని గొప్పలు చెప్పారు. నిజానికి, గత ఎన్నికల్లో గెలవగానే విశాఖపట్నంపై జగన్‌ కన్నేశారు. విశాఖకు రాజధానిగా కొనసాగే అర్హత ఉందని, అన్ని రకాల వసతులు ఉన్నాయని, మెట్రో రైలు, ఫ్లైఓవర్లు వంటివి సమకూర్చుకుంటే సరిపోతుందని చెప్పారు. కానీ, వాటినీ నిర్మించకుండా, కనీస చర్యలు కూడా చేపట్టకుండా కాలయాపన చేశారు. రుషికొండపై చక్కటి పర్యాటక అతిథి గృహాలను కూలగొట్టి, రూ.450 కోట్లతో అత్యంత విలాసవంతమైన భవనాన్ని సీఎం క్యాంపు కార్యాలయం కోసం నిర్మించుకున్నారు. దీన్ని విశాఖ ప్రజలు జీర్ణించుకోలేకపోయారు. అక్కడికి ఎవరినీ అనుమతించకపోవడం, రుషికొండ బీచ్‌లోకి వెళ్లడానికి కూడా ఆంక్షలు పెట్టడం, ఆయన ఇక్కడికి వచ్చిన ప్రతిసారీ ప్రజలను ఇబ్బందికి గురిచేయడం వంటివి అన్నీ గుర్తుపెట్టుకొన్నారు. సమయం రాగానే తమ విస్పష్టమైన తీర్పుతో జగన్‌ను తిరస్కరించాయి.

Updated Date - Jun 05 , 2024 | 08:00 AM