Share News

తుంగభద్ర తీరంలో భక్తుల సందడి

ABN , Publish Date - Dec 29 , 2024 | 11:40 PM

తుంగా తీరం భక్తులతో పులకరించిపోయింది. మంత్రాలయం రాఘవేంద్ర స్వామి దర్శనార్థం ఇసుకేస్తే రాలనంత భక్తులు తరలివచ్చారు.

తుంగభద్ర తీరంలో భక్తుల సందడి
స్వర్ణ రథంపై ఊరేగుతున్న ప్రహ్లాదరాయలు

మంత్రాలయం, డిసెంబరు 29(ఆంధ్రజ్యోతి): తుంగా తీరం భక్తులతో పులకరించిపోయింది. మంత్రాలయం రాఘవేంద్ర స్వామి దర్శనార్థం ఇసుకేస్తే రాలనంత భక్తులు తరలివచ్చారు. ఏడాది ఆఖరి ఆదివారం సెలవు కలసి రావటంతో వివిధ రాష్ర్టాల నుంచి భక్తులు తరలివచ్చారు. దీంతో మఠం ప్రాంగాణం భక్తులతో కిక్కిరిసింది. అన్నపూర్ణ భోజనశాల, మహాముఖద్వారం, మధ్వమార్గ్‌ కారిడార్‌, ప్రధాన రహదారులు, రాఘవేంద్ర సర్కిల్‌, తుంగభద్ర నదితీరం భక్తులతో కోలాహాలంగా మారింది. గ్రామదేవత మంచాలమ్మను దర్శించుకొని రాఘవేంద్రస్వామి మూల బృందావనానికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. స్వామి వారి దర్శన క్యూలైనన్లు పెంచి, పరిమళప్రసాదం కౌంటర్లు అధనంగా ఏర్పాటు చేశారు. మంత్రాలయం ఎటుచూసిన భక్తుల సందడిగా మారింది. భక్తుల రద్దీ పెరగడంతో ప్రైవేట్‌ లాడ్జీల ధరలకు రెక్కలొచ్చాయి. చలికాలం కావడంతో గదులు దొరక్కా భక్తులు మధ్యమార్గ్‌ కారిడార్‌లో నిద్రిస్తూ తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

స్వర్ణ రథంపై ప్రహ్లాదరాయలు

రాఘవేంద్ర స్వామి మఠంలో ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయలు స్వర్ణ రథంపై విహరించారు. ఆదివారం మఠం పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థుల ఆధ్వర్యంలో బృందావనానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సుప్రభాతం, నిర్మలవిసర్జనం, క్షీరాభిషేకం, విశేష పంచామృతాభిషేకం చేసి వెండి, బంగారు, పట్టు వస్ర్తాలతో బృందావనాన్ని శోభాయమానంగా అలంకరించారు. వేద పండితుల మంత్రోచ్చరణాలు, మంగళ వాయిద్యాల, విద్యుత దీపాల మధ్య స్వర్ణ రథంపై ప్రహ్లాదరాయలను అధిష్టించి ఆలయ ప్రాంగణం చుట్టూ ఊరేగించారు. అనంతరం ఉత్సవ మూర్తికి ఊంజల సేవ నిర్వహించారు. మఠం పండితులు భక్తులకు ఫల, పుష్ప, మంత్రాక్షితలు ఇచ్చి ఆశీర్వదించారు.

కిక్కిరిసిన వాహనాలు

రాఘవేంద్రస్వామి దర్శనార్థం వచ్చిన భక్తుల వాహనాలతోనే మంత్రాలయం నిండిపోయింది. ఈ ఏడాది ముగింపు సందర్భంగా చివరి ఆదివారం కావడంతో వేలాది మంది వాహనాల్లో రావడంతో ఏ దారి, వీధి చూసినా వాహనాలతో నిండిపోయింది. దీనితో నిత్యం రాకపోకలు సాగించే కర్ణాటక, ఆర్టీసీ, ప్రైవేటు వాహనాలు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రోజురోజుకు పెరుగుతున్న భక్తుల ప్రైవేటు వాహనాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆర్టీసీ బస్టాండు, ఉన్నత పాఠశాల మైదానం, తహసీల్దార్‌ కార్యాలయం, నాగులదిన్నె రోడ్డు, ఎమ్మిగనూరు రోడ్డు, మాధవరం రోడ్డు, ప్రధాన రహదారులు కి.మీటరున్నర మేర ఇరువైపులా పార్కింగ్‌ కనిపిస్తున్నాయి. హైవే రోడ్డుపై ఇష్టానుసారంగా వాహనాలు నిలిపివేయడంతో పోలీసులు దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. పార్కింగ్‌కు అనువైన స్థలాన్ని చూపాలని భక్తులు కోరుతున్నారు.

Updated Date - Dec 29 , 2024 | 11:40 PM