Share News

అడ్డగోలుగా పదోన్నతులు!

ABN , Publish Date - Mar 16 , 2024 | 02:50 AM

కోడ్‌ కూయకముందే వీలైనంతగా సొమ్ము చేసేసుకుంటున్నారు. ఏకంగా మునిసిపల్‌ శాఖ ఉన్నతాధికారే అక్రమ పదోన్నతులతో కాసుల పండగ చేసుకున్నట్లు తెలుస్తోంది.

అడ్డగోలుగా పదోన్నతులు!

మున్సిపల్‌లో నిబంధనలు బేఖాతరు

సర్వీస్‌ రూల్స్‌ మార్చి ఏడీలుగా పదోన్నతులు

ఎన్నికల ముందు హడావుడిగా సన్నాహాలు

మున్సిపాలిటీల్లో పనిచేసే అధికారులకే చాన్స్‌

ఒక్కొక్కరి నుంచి 5-10 లక్షలు వసూలు

పురపాలక శాఖ ఉన్నతాధికారికి ముడుపులు

ప్రధాన, రీజినల్‌ ఆఫీసుల్లో పనిచేసే వారికి అన్యాయం

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

కోడ్‌ కూయకముందే వీలైనంతగా సొమ్ము చేసేసుకుంటున్నారు. ఏకంగా మునిసిపల్‌ శాఖ ఉన్నతాధికారే అక్రమ పదోన్నతులతో కాసుల పండగ చేసుకున్నట్లు తెలుస్తోంది. డిప్యూటీ డైరెక్టర్‌ టౌన్‌ప్లానింగ్‌ అధికారుల పదోన్నతుల్లో నిబంధనలకు పాతరేసిన మున్సిపల్‌ శాఖ.. తాజాగా అసిస్టెంట్‌ డైరెక్టర్‌ టౌన్‌ ప్లానింగ్‌ అధికారుల పదోన్నతుల్లోనూ అక్రమాల జాతరకు తెరలేపింది. ఎన్నికల కోడ్‌ వస్తుందన్న హడావుడిలో సర్వీస్‌ రూల్స్‌ను అడ్డగోలుగా మార్చి 19 మంది టౌన్‌ప్లానింగ్‌ ఆఫీసర్లకు అసిస్టెంట్‌ డైరెక్టర్లుగా పదోన్నతి కల్పిస్తున్నట్లు తెలిసింది. ఇందుకోసం ఒక్కో టౌన్‌ప్లానింగ్‌ ఆఫీసర్‌ నుంచి రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల దాకా వసూలు చేసి మున్సిపల్‌ శాఖ ఉన్నతాధికారికి ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రధాన కార్యాలయం, రీజినల్‌ ఆఫీసుల్లో పని చేసేవారికి పదోన్నతుల్లో అవకాశమివ్వకుండా... కేవలం మున్సిపాలిటీల్లో పనిచేసే టౌన్‌ప్లానింగ్‌ ఆఫీసర్లకు అసిస్టెంట్‌ డైరెక్టర్లుగా పదోన్నతులు ఇస్తున్నట్లు తెలిసింది. శనివారం ఎన్నికల షెడ్యూల్‌ విడుదలవుతుందని తెలిసి శుక్రవారం ఆదరాబాదరాగా సన్నాహాలు చేశారు. టౌన్‌ప్లానింగ్‌ విభాగంలో అసిస్టెంట్‌ డైరెక్టర్‌ పోస్టులకు పదోన్నతి పొందాలంటే.. టౌన్‌ప్లానింగ్‌ అసిస్టెంట్లు, మున్సిపాలిటీల్లో పనిచేసే టౌన్‌ప్లానింగ్‌ ఆఫీసర్లతో పాటు డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ద్వారా సమానంగా 1:1:1 నిష్పత్తిలో భర్తీ చేస్తారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా టౌన్‌ప్లానింగ్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ పోస్టులు సుమారు 19 దాకా ఖాళీలు ఏర్పడ్డాయి. వాటిని భర్తీ చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా టౌన్‌ప్లానింగ్‌ ఆఫీసర్లను ఎంపిక చేశారు. టౌన్‌ప్లానింగ్‌ అసిస్టెంట్లు పదోన్నతికి అర్హత సాధించాలంటే మరో 10 నెలలు పడుతుంది. అందుకే ప్రస్తుతం టౌన్‌ప్లానింగ్‌ అసిస్టెంట్లలో అర్హులు లేరని, ఏపీపీఎస్సీ ద్వారా డైరెక్ట్‌ నియామకాలు కూడా లేవంటూ మున్సిపల్‌ శాఖ.. ఈ పోస్టులన్నీ మున్సిపాలిటీల్లో పనిచేసే టౌన్‌ప్లానింగ్‌ ఆఫీసర్లతో భర్తీ చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం భారీగా సొమ్ము లు వసూలు చేసి ఎన్నికల ముందు హడావుడిగా శనివారం ఈ ప్రక్రియ పూర్తి చేయనున్నారు. సుమారు రూ.కోటి నుంచి రూ.2 కోట్లు దాకా చేతులు మారాయని చెబుతున్నారు.

గతంలోనూ నిబంధనలు బేఖాతరు

2013లో కాంగ్రెస్‌ సర్కార్‌ హయాంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఇలాగే సర్వీస్‌ రూల్స్‌ను సవరించి జీఓ నెం.500 ఇస్తూ ఉత్తర్వులు జారీచేశారు. అప్పట్లో కూడా టౌన్‌ప్లానింగ్‌ ఆఫీసర్లు, టౌన్‌ప్లానింగ్‌ అసిస్టెంట్లు, డైరెక్ట్‌ నియామకాలకు సమానంగా పదోన్నతులు కల్పించాల్సి ఉండగా అందుకు విరుద్ధంగా సర్వీస్‌ రూల్స్‌ సవరించారు. కేవలం టౌన్‌ప్లానింగ్‌ ఆఫీసర్లకు ఏడీలుగా పదోన్నతి కల్పిస్తూ ఆదేశాలిచ్చారు. అయితే ఆ తర్వాత చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత 2015లో ఆ ఉత్తర్వులను సరిదిద్దింది. సర్వీస్‌ రూల్స్‌ను ఎప్పటిలాగా 1:1:1 నిష్పత్తిలో ఇచ్చేలా ఆదేశాలిచ్చారు. ఇప్పుడు మళ్లీ ఎన్నికల ముందు ఉన్నతాధికారులు సొమ్ము చేసుకునేందుకు జీఓ నెం.42 తీసుకొచ్చి టౌన్‌ప్లానింగ్‌ అసిస్టెంట్లకు అన్యాయం చేశారని చెబుతున్నారు. పైగా టౌన్‌ప్లానింగ్‌ ఆఫీసర్లలో ఎక్కువ మంది డిప్లమో హోల్డర్‌లు ఉన్నారని, వారు ఎక్కువ కాలం అసిస్టెంట్‌ డైరెక్టర్లుగా కొనసాగుతారని అంటున్నారు. దీంతో తదుపరి పదోన్నతి అవకాశాలు కోల్పోతామని చెబుతున్నారు.

Updated Date - Mar 16 , 2024 | 02:50 AM