Share News

కోట్లు కొల్లగొట్టారు!

ABN , Publish Date - Apr 26 , 2024 | 05:43 AM

తెల్లరాయి (క్వార్ట్జ్‌) అక్రమ తవ్వకాల్లో వైసీపీ నాయకుల పాత్ర బయటపడింది. ఎన్నికల కోడ్‌ ముందు వరకూ తమ అధికారాన్ని అడ్డం పెట్టుకొని జరిపిన అవినీతి బాగోతం బట్టబయలైంది.

కోట్లు కొల్లగొట్టారు!

నెల్లూరు జిల్లాలో అడ్డగోలుగా వైసీపీ నేతల తెల్లరాయి దోపిడీ

మైనింగ్‌ అధికారుల విచారణలో వెల్లడి

స్థానిక నేతలకు షోకాజ్‌ నోటీసులు

ఇప్పటి వరకు 12 కోట్ల జరిమానా

బడా నాయకులు 400 కోట్లు సొమ్ము చేసుకున్నట్టు అంచనా

ప్రభుత్వ, అటవీ భూముల్లో తవ్వకాలు

సూత్రధారులను కాపాడే యత్నాలు

కేంద్రానికి నివేదిక ఇవ్వకుండా జాప్యం

రిపోర్టు మార్చేందుకు మరోసారి విచారణ?

నెల్లూరు, ఏప్రిల్‌ 25 (ఆంధ్రజ్యోతి): తెల్లరాయి (క్వార్ట్జ్‌) అక్రమ తవ్వకాల్లో వైసీపీ నాయకుల పాత్ర బయటపడింది. ఎన్నికల కోడ్‌ ముందు వరకూ తమ అధికారాన్ని అడ్డం పెట్టుకొని జరిపిన అవినీతి బాగోతం బట్టబయలైంది. నెల్లూరు జిల్లాలో తెల్లరాయి అక్రమ తవ్వకాలు నిజమేనని మైనింగ్‌ శాఖ అధికారులు నిగ్గు తేల్చారు. తవ్వకాలు జరిపిన ప్రాంతాల్లో ఇటీవల తనిఖీలు చేసి స్థానికంగా పంచనామా నిర్వహించారు. వైసీపీ నాయకులే ఈ తవ్వకాలు జరిపారని ఆ విచారణలో తేలడంతో వారికి మైనింగ్‌ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఇప్పటి వరకు నెల్లూరు జిల్లాలో రూ.12 కోట్ల వరకు జరిమానాలు విధించారు. ఇప్పటి వరకూ ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు నిజమేనని ఈ విచారణతో తేటతెల్లమవుతోంది. వైసీపీ నేతలు రూ.400 కోట్ల విలువైన తెల్లరాయిని విదేశాలకు ఎగుమతి చేసి సొమ్ము చేసుకున్నారు. అక్రమాలు జరగడం లేదని ఇప్పటి వరకూ దబాయిస్తూ వచ్చిన ఎమ్మెల్యేలు, మంత్రులు ఇప్పుడు తమ అనుచరులకు నోటీసులు అందడంతో తేలుకుట్టిన దొంగల్లా నోరు మెదపడం లేదు. అసలు సూత్రధారులు ఎమ్మెల్యేలు, మంత్రులు కాగా.. పాత్రధారులుగా వారి అనుచరులు ఉన్నారు. బడా నేతలు తెల్లరాయిని అక్రమంగా తవ్వుకునే గ్రామాల్లో స్థానిక వైసీపీ నాయకులను కాపలాగా పెట్టారు. తవ్వకాలు జరిపే ప్రాంతంలోకి ఇతరులు వెళ్లకుండా వారు అడ్డుకునేవారు. ఎవరైనా ప్రతిపక్ష పార్టీల నేతలు లేక అధికారులు ఆ ప్రాంతాలకు వస్తే ఆ సమాచారాన్ని ఎమ్మెల్యేలు లేక మంత్రులకు చేరవేసేవారు. వారు ఇంట్లో కూర్చొని కథ నడిపిస్తూ వచ్చారు. ఇప్పుడు రూ.వందల కోట్లు దోచుకున్న ఎమ్మెల్యేలు, మంత్రులు దర్జాగా తిరుగుతుంటే నోటీసులను మాత్రం కాపలా ఉన్న స్థానిక నాయకులకు అందాయి. ఈ విషయంపై వైసీపీ కేడర్‌లో కలకలం రేపుతోంది.


అంతా వైసీపీవారే...

పొదలకూరు మండలం మరుపూరులో అక్రమంగా తెల్లరాయి తవ్వకాలు జరిపినందుకు మంత్రి కాకాణి ప్రధాన అనుచరుడు మోపూరు శ్రీనివాసులురెడ్డికి రూ.36.41 లక్షల పెనాల్టీతో మైనింగ్‌ అధికారులు షోకాజు నోటీసు జారీ చేశారు. మొగళ్లూరులో తవ్వకాలు జరిపినందుకు కొత్తలూరు కోటేశ్వరరావు, త్రిప్పిరిశెట్టి రత్నంలకు రూ.25.39 లక్షలు, మొగళ్లూరులోనే మరో చోట అక్రమంగా తవ్వకాలు జరిపినందుకు యనమాల శ్రీనివాసులురెడ్డి, పేర్నాటి దినే్‌షరెడ్డిలకు రూ.1.40 కోట్లు, గురవాయపాలెంలో తవ్వకాలు చేసినందుకు వర్దినేని కొండయ్యకు రూ.4.99 లక్షలు, కుంకు అన్నపూర్ణకు రూ.13.32 లక్షలు పెనాల్టీ విధిస్తూ షోకాజు నోటీసులు జారీ చేశారు. వీరంతా వైసీపీ నాయకులు, కాకాణి అనుచరులు. అలాగే సైదాపురం మండలంలో కూడా మాజీ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ అనుచరులకు షోకాజు నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని పొదలకూరు, సైదాపురం, గూడూరు రూరల్‌, రాపూరు మండలాల పరిధిలో పదుల సంఖ్యలో వైసీపీ నేతలకు మైనింగ్‌ శాఖ నుంచి షోకాజు నోటీసులు అందాయి. ఎవరూ ఈ నోటీసులకు స్పందించకపోవడంతో త్వరలో డిమాండ్‌ నోటీసులు ఇచ్చిన అనంతరం వారిపై రెవెన్యూ రికవరీ యాక్ట్‌ ప్రయోగించాలని యోచిస్తున్నట్లు తెలిసింది.

స్పందించని రెవెన్యూ

తెల్లరాయి అక్రమ తవ్వకాలన్నీ ప్రభుత్వ భూములు, అటవీ భూముల్లోనే జరిగాయి. మైనింగ్‌, రెవెన్యూ శాఖల అధికారులు సంయుక్తంగా నిర్వహించిన పంచనామాలో కూడా ఆ భూములన్నీ ప్రభుత్వ అనాధీనం, అటవీ పోరంబోకు భూములుగా నిర్ధారించారు. అయినా రెవెన్యూ ఉన్నతాధికారులు మాత్రం కనీస చర్యలు తీసుకోవడం లేదు. అక్రమాలకు పాల్పడ్డ వైసీపీ నేతలపై క్రిమినల్‌ కేసులకు ఆదేశాలివ్వడం లేదు. క్రిమినల్‌ కేసులు నమోదు చేసి విచారణ చేపడితే ఈ అక్రమ తవ్వకాల వెనుక అసలు సూత్రధారులెవరన్నది స్పష్టమవుతుంది. కలెక్టర్‌, జాయింట్‌ కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లినా వారు పట్టించుకోవడం లేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఓబులాపురం మైనింగ్‌ స్కామ్‌ తరహాలో నెల్లూరు జిల్లాలో ప్రభుత్వ భూముల్లో రూ.వందల కోట్ల తెల్లరాయిని తవ్వేసినా తమకేమీ పట్టదన్నట్లు వ్యవహరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ అక్రమ సంపాదనతోనే వైసీపీ అభ్యర్థులు ప్రస్తుత ఎన్నికల్లో విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేస్తున్నారన్న చర్చ జిల్లా వ్యాప్తంగా నడుస్తోంది.


కోడ్‌ వచ్చాక విచారణ

ఎన్నికల కోడ్‌ వచ్చాక తెల్లరాయి అక్రమ తవ్వకాలపై మైనింగ్‌ అధికారులు కదిలారు. అప్పటి వరకూ తవ్వకాలు జరిపిన ప్రదేశాల్లో కొలతలు తీసి ఎంత మేరకు తరలించారన్న లెక్కలు వేశారు. మైనింగ్‌ చట్టాల ప్రకారం తెల్లరాయి టన్నుకు రూ.90 సీన రైజ్‌ ఫీజు కాగా అనుమతులు లేకుండా తవ్వినందుకు పది రెట్లు పెనాల్టీ వేస్తూ ట న్నుకు రూ.900 చొప్పున షోకాజు నోటీసులు ఇచ్చారు. అయితే ఇదే టన్ను తెల్లరాయి విలువ అంతర్జాతీయ మార్కెట్లో రూ.30 వేల వరకు ఉంది. నెల్లూరు జిల్లాలో రూ.12 కోట్ల వ రకు జరిమానాలు విధించారు. ఈ లెక్కన రూ.400 కోట్ల విలువైన తెల్లరాయిని విదేశాలకు ఎగుమతి చేసి వైసీపీ నేతలు సొమ్ము చేసుకున్నారు. ఇంత భారీ స్థాయిలో దోపిడీ జరుగుతున్నా ఎన్నికల కోడ్‌ ముందు వరకూ ఒక్క అధికారి కూడా పట్టించుకోలేదు.

కేంద్రం ఆదేశాలతో కదలిక

టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి.. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషీలకు ఫిర్యాదు చేయడంతో అక్రమార్కులకు బ్రేక్‌ పడింది. నెల్లూరు, తిరుపతి జిల్లాల పరిధిలో అక్రమంగా జరిగిన తెల్లరాయి త వ్వకాలపై వెంటనే విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని కేంద్ర నుంచి రాష్ట్ర అధికారులకు ఆదేశాలు అందాయి. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో మైనింగ్‌ అధికారులు విచారణ మొ దలుపెట్టారు. అక్రమ తవ్వకాలు స్పష్టంగా కనిపిస్తుండడంతో... తప్పుడు నివేదికలు ఇ వ్వాలంటూ పైస్థాయి నుంచి ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా జిల్లా స్థా యి అధికారులు సాహసించలేదు. ఉన్నది ఉన్నట్లుగా నివేదిక తయారు చేశారు. అయితే ఈ నివేదికను కేంద్రానికి పం పితే ఇబ్బందులు తప్పవని భావించిన రాష్ట్ర ఉన్నతాధికారులు ఇప్పుడు మరోసా రి విచారణ అంటూ కొత్త డ్రామాకు తెరలేపారు. నెల్లూరు జిల్లా అధికారులు ఇచ్చిన నివేదికను పక్కన పెట్టి ఇతర జిల్లాల అధికారులతో ప్రత్యేక టీమ్‌ను నియమించినట్లు తెలిసింది.

Updated Date - Apr 26 , 2024 | 05:43 AM