Share News

పంటల నష్ట పరిహారం పక్కదారి!

ABN , Publish Date - Dec 31 , 2024 | 12:37 AM

సెప్టెంబరులో సంభవించిన కృష్ణానది వరదలకు వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిని రైతులు భారీగా నష్టపోయారు. ఈ రైతులకు ఎన్యుమరేషన్‌ చేసి ప్రభుత్వం బాధిత రైతుల ఖాతాల్లో నగదు జమ చేసింది. అయితే వ్యవసాయాధికారి, సిబ్బంది అవినీతికి పాల్పడి అక్రమార్కులకు పంట నష్టపరిహారం వచ్చేలా చేశారని ఆరోపణలు బలంగా వచ్చాయి.

 పంటల నష్ట పరిహారం పక్కదారి!

శివ కాంతమ్మ ఆగ్రో ఏజెన్సీ యజమానికి, ఆయన కోడలికి పరిహారం జమ

గౌడ సొసైటీ భూముల్లో పసుపు, అరటి పంటలు సాగు చేస్తున్నట్టు సృష్టి

భూములే లేనివారికి వరదల పరిహారం రూ.96,075 రావడంపై మండల రైతుల ఆగ్రహం

ఇంకా వందల మంది బోగస్‌ రైతులు ఉన్నట్టు జిల్లా అధికారులకు ఫిర్యాదు

- ఆయన పేరు దండ భాస్కరరావు. శివ కాంతమ్మ ఆగ్రో ఏజెన్సీస్‌ అధినేత. తోట్లవల్లూరులో పురుగుల మందు, ఎరువుల వ్యాపారం చేస్తున్నారు. ఈయన తోట్లవల్లూరు నివాసి కాదు. ఈయనకు తోట్లవల్లూరు లంకల్లో ఎలాంటి భూములు లేవు. కాని ఈయన సెప్టెంబరులో కృష్ణానది వరదలకు పంటలను నష్టపోయినట్టు రూ.48,615 పరిహారం ఆయన బ్యాంకు ఖాతాలో జమయింది.

- ఆమె పేరు వనజ. దండ భాస్కరరావుకు కోడలు. ఈమె కూడా తోట్లవల్లూరు నివాసి కాదు. ఈమెకు తోట్లవల్లూరు లంకల్లో ఎటువంటి భూములు లేవు. అయినా ఈమె సెప్టెంబరులో కృష్ణానది వరదలకు పంటలను నష్టపోయినట్టు రూ.47,460 పరిహారం ఈమె బ్యాంకు ఖాతాలో జమయింది.

తోట్లవల్లూరు, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి) : సెప్టెంబరులో సంభవించిన కృష్ణానది వరదలకు వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిని రైతులు భారీగా నష్టపోయారు. ఈ రైతులకు ఎన్యుమరేషన్‌ చేసి ప్రభుత్వం బాధిత రైతుల ఖాతాల్లో నగదు జమ చేసింది. అయితే వ్యవసాయాధికారి, సిబ్బంది అవినీతికి పాల్పడి అక్రమార్కులకు పంట నష్టపరిహారం వచ్చేలా చేశారని ఆరోపణలు బలంగా వచ్చాయి. తోట్లవల్లూరులో శివ కాంతమ్మ ఆగ్రో ఏజెన్సీ యజమాని డి.భాస్కరరావుకి, ఆయన కోడలు వనజకు అక్రమంగా పంట నష్టపరిహారం జమయిన వివరాల జాబితా సోమవారం ‘ఆంధ్రజ్యోతి’కి లభించింది. సర్వే నంబరు 331/1లోని గౌడ ఫీల్డు లేబర్‌ సొసైటీ భూముల్లో భాస్కరరావు 0.595 ఎకరాల్లో అరటి సాగు చేసి పంట నష్టపోయినందుకు రూ.20,825, 0.794 ఎకరాల్లో పసుపు సాగు చేసి నష్టపోయినందుకు రూ.27,790, కోడలు వనజకు 331/1లో 0.567 ఎకరాల్లో అరటి సాగు చేసినందుకు రూ 19,845, 0.789 ఎకరాల్లో పసుపు సాగు చేసినందుకు రూ.27,615 వారిరువురి బ్యాంకు ఖాతాల్లో రూ.96,075 జమయ్యాయి. ఈ విషయం రైతులకు తెలిసి అగ్గిమీదగుగ్గిలమవుతున్నారు. ఇతను వ్యాపారం నిమిత్తం తోట్లవల్లూరు రాగా సెంటు భూమి కూడా లేదని, లంకల్లో ఎక్కడా వ్యవసాయం చేయటం లేదని, వారికి పంటనష్టపరిహారం ఎలా జమయిందని రైతులు ప్రశ్నిస్తున్నారు.

పరిహారం విషయం ఏవోను అడగండి : శివ కాంతమ్మ ఆగ్రో ఏజెన్సీ యజమాని

పరిహారం విషయామై శివ కాంతమ్మ ఆగ్రో ఏజెన్సీ యజమాని డి.భాస్కరరావును సోమవారం వివరణ అడగ్గా నేను ఎక్కడా పంటలు పండించలేదని స్పష్టం చేశారు. మీకు పంటల నష్టపరిహారం జమయిందని అడగ్గా ఆ విషయాన్ని మండల వ్యవసాయాధికారి నాగేశ్వరరావును అడగమని చెప్పారు. తాను పురుగుమందుల వ్యాపారి కావడంతో తమ బ్యాంకు ఖాతా, ఆధార్‌నంబర్లు వ్యవసాయాధికారి వద్ద ఉంటాయని ఆయన ఏమి చేశారో అడగాలని భాస్కరరావు సమాధానం ఇచ్చారు.

ప్లీజ్‌ వార్త రాయోద్దు : వ్యవసాయ అధికారి నాగేశ్వరరావు

పరిహారం పక్కదారి పట్టించిన విషయంపై మండల వ్యవసాయాధికారి జి.నాగేశ్వరరావును వివరణ కోరగా వార్త రాయోద్దని రిక్వెస్ట్‌ చేశారు. పురుగు మందుల వ్యాపారి అంతా మీరే చేశారని ఆరోపిస్తున్నారని తెలపగా, అన్ని విషయాలు తర్వాత చెబుతానని నాగేశ్వరరావు చెప్పటం ఆయన తప్పిదాన్ని ఎత్తిచూపిస్తోంది.

తోట్లవల్లూరుకు చెందిన రైతు లంక అశోక్‌కుమార్‌ సోమవారం వ్యవసాయాధికారి నాగేశ్వరరావుపై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. తోట్లవల్లూరుకు చెందిన 40 మంది రైతులు రెండు నెలలుగా అధికారులకు వినతి పత్రాలు సమర్పించినా ఇంత వరకు పంటల పరిహారం అందలేదని తెలిపారు. అర్జీలు పెట్టినందుకు చులకనగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. తమ కుటుంబానికి ఇంత వరకు పంట నష్టపరిహారం రాలేదన్నారు. కాగా, మండలంలో పరిహారం విషయంలో భారీ ఎత్తున అక్రమాలు చోటుచేసుకున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి.

Updated Date - Dec 31 , 2024 | 12:37 AM