విశ్వసనీయత @459 కోట్లు
ABN , Publish Date - Oct 21 , 2024 | 04:15 AM
ఓ వ్యక్తికి లేక ప్రభుత్వానికి విశ్వసనీయత చాలాముఖ్యం. ఆ విశ్వసనీయతను సంపాదించుకుంటే ఏదైనా సాధ్యమే. అదే దానిని కోల్పోతే అథోగతే!..
నెలన్నర తర్వాతా వరదలా సాయం
వరదలోనూ వెంట ఉండే నాయకుడికీ
బురదలో దిగని నేతకీ తేడా చూసిన జనం
అందుకే దాతల నుంచి ఇంతటి స్పందన
(అమరావతి - ఆంధ్రజ్యోతి)
ఓ వ్యక్తికి లేక ప్రభుత్వానికి విశ్వసనీయత చాలాముఖ్యం. ఆ విశ్వసనీయతను సంపాదించుకుంటే ఏదైనా సాధ్యమే. అదే దానిని కోల్పోతే అథోగతే!.. గత వైసీపీ ప్రభుత్వంలోనూ రాష్ట్రంలో వరదలు, తుఫానులు వచ్చాయి. అప్పట్లో దాతలు స్పందించిన తీరును.. బుడమేరు వరదలు వచ్చిపోయిన నెలన్నర తర్వాత కూడా ప్రభుత్వానికి వరదలా అందుతున్న విరాళాలతో పోల్చినవారు అంటున్న మాట ఒక్కటే! అదే విశ్వసనీయత! 2014లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే విశాఖను హుద్‌హుద్ తుఫాన్ అతలాకుతలం చేసింది. ఆ సమయంలో చంద్రబాబు వెంట పారిశ్రామికవేత్తలు, దాతలు అండగా నిలిచారు. విశాఖపట్నం పునర్నిర్మాణం కోసం దాతల నుంచి రూ.425 కోట్ల విరాళాలు వచ్చాయి. అప్పట్లో ప్రభుత్వం, చంద్రబాబు తుఫాను బాధితులను ఆదుకునేందుకు, తిరిగి వారి బతుకులను నిలబెట్టేందుకు చూపిన తపనను చూసి అందిన సాయమిది. ఆ తర్వాత తితిలీ తుఫాన్ అప్పుడూ అంతే.. ఆ తుఫానుకు అల్లాడిన శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో పరిస్థితులు మెరుగు పడేవరకు చంద్రబాబు అక్కడే ఉండిపోయారు. ఆయన పిలుపుతో దాతల నుంచి దాదాపు రూ.90 కోట్ల వరకు బాధితుల సహాయార్థం అందాయి. ఇక.. వైసీపీ హయాంలో 2020లో నివార్ తుఫాను, 2021లో గులాబ్ తుఫాన్, 2022లో మరికొన్ని తుఫాన్లు రాష్ట్రాన్ని ముంచెత్తాయి. 2022లో ఏకంగా అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయింది. పదుల సంఖ్యలో జనం మరణిస్తే, వందల సంఖ్యలో నిరాశ్రయులయ్యారు.
నాడు చంద్రబాబుకు ఉన్నంత యంత్రాంగమూ, ప్రభుత్వ బలగమూ... జగన్‌కూ ఉన్నాయి. కానీ, లోపించిందల్లా విశ్వసనీయత.. సంకల్ప బలం. వరదలు, తుఫాన్ల సహాయ పనులను అధికారులను వదిలేసి, ఆయన తాడేపల్లి ప్యాలె్‌సకు పరిమితం అయ్యారు. నష్టపోయిన ప్రాంతాల్లోను, బురద చేరిన పొలాల్లో కనీసం కాలు పెట్టలేదు. ఏరియల్ సర్వే చేసి కేంద్రానికి నష్టం లెక్కలు పంపించారు. చివరకు.. ప్రాణనష్టం చోటుచేసుకున్న అన్నమయ్య జిల్లాకు కూడా చాలా రోజుల వరకు జగన్ వెళ్లలేదు. ఆయన స్పందనకు తగినట్టే అప్పట్లో దాతలు కూడా వ్యవహరించారు. దీంతో జగన్ హయాంలో విపత్తుపై దాతల సాయం రూ.100 కోట్లు ఎప్పుడూ దాటలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది నెలలకే బుడమేరు రూపంలో విజయవాడను వరద ముంచెత్తింది. చంద్రబాబు రంగంలోకి దిగారు. వరద నీటిలో జేసీబీలు ఎక్కి మరీ ప్రజలకు వద్దకు వెళ్లి వారికి భరోసా కల్పించారు. ఐఏఎస్ అధికారులను రంగంలోకి దించి వరద నీటిలోనే ఇంటింటికి పంపించి సహాయ చర్యలు చేపట్టారు. ప్రజలు సాధారణ జీవితం మొదలు పెట్టే వరకూ అక్కడే ఉండి పరిస్థితిని అదుపులో పెట్టారు. సీఎం స్థాయి వ్యక్తి వరద నీటిలో దిగి తిరుగుతుంటే.. స్వచ్ఛంద సంస్థలు, పారిశ్రామికవేత్తలు రంగంలోకి దిగారు. వరద బాధితుల కోసం రూ.459 కోట్ల విరాళాలు ప్రకటించారు.