Share News

రైతుల ఖాతాల్లో డబ్బు జమ కాలేదు

ABN , Publish Date - Mar 01 , 2024 | 03:04 AM

రైతుల ఖాతాల్లో డబ్బు జమ చేస్తున్నామంటూ ముఖ్యమంత్రి జగన్‌ వంద శాతం ప్రచారం చేసుకుని.. కేవలం 20 శాతం మంది రైతులకే డబ్బులు జమ చేశారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ విమర్శించారు. మిగిలిన 80 శాతం మంది రైతులు బ్యాంకులకు వెళ్లగా

రైతుల ఖాతాల్లో డబ్బు జమ కాలేదు

గ్రూప్‌-1 పరీక్షల్లోనూ కుట్ర కోణం: సీపీఐ రామకృష్ణ

అమరావతి, ఫిబ్రవరి 29 (ఆంధ్రజ్యోతి): రైతుల ఖాతాల్లో డబ్బు జమ చేస్తున్నామంటూ ముఖ్యమంత్రి జగన్‌ వంద శాతం ప్రచారం చేసుకుని.. కేవలం 20 శాతం మంది రైతులకే డబ్బులు జమ చేశారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ విమర్శించారు. మిగిలిన 80 శాతం మంది రైతులు బ్యాంకులకు వెళ్లగా డబ్బులు జమ కాలేదని తెలుసుకుని నివ్వెర పోయారని తెలిపారు. వడ్డీ చెల్లింపు కింద రాష్ట్రవ్యాప్తంగా రైతులకు రూ.3 వేల కోట్లు జమ చేయాల్సి ఉంటే.. 20 శాతం నిధులు మాత్రమే జమ చేశారని తెలిపారు. గురువారం విజయవాడలోని దాసరి భవన్‌లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రతి ఏటా జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేసి గ్రూప్‌-1, గ్రూప్‌-2 ఉద్యోగాలు, డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తామని చెప్పిన జగన్‌.. యువతను మోసం చేశారని మండిపడ్డారు. ఏపీపీఎస్సీ చైర్మన్‌ గౌతమ్‌ సవాంగ్‌ ప్రకటన మేరకు 1,48,880 మంది అభ్యర్థులు కొత్త సిలబ్‌సతో గ్రూప్‌-1 పరీక్షకు ప్రిపేర్‌ అయ్యారని, ఇప్పుడు పాత సిలబస్‌ ప్రకారం పరీక్ష నిర్వహిస్తున్నట్లు ప్రకటించడం వెనుక కుట్ర కోణం ఉందని ఆరోపించారు. దీనిపై ప్రభుత్వం, ఏపీపీఎస్సీ చైర్మన్‌ వివరణ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

పొత్తులు, సీట్లపై ఈ వారంలోనే స్పష్టత

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌, సీపీఐ, సీపీఎం కలిసి పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నామని, ఈ నెల మొదటి వారంలోనే పొత్తులు, సీట్ల సర్దుబాటుపై స్పష్టత ఇస్తామని రామకృష్ణ తెలిపారు. వైఎస్‌ షర్మిల కాంగ్రెస్‌ పార్టీలో చేరడానికి సీఎం జగన్మోహన్‌రెడ్డే కారణమన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా డిక్లరేషన్‌పై శుక్రవారం తిరుపతిలో నిర్వహిస్తున్న కాంగ్రెస్‌ పార్టీ సభకు, విద్యార్థి, యువజన సంఘాల జేఏసీ చేపట్టిన ‘చలో సీఎం కార్యాలయం ముట్టడి’ కార్యక్రమానికి సీపీఐ మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు.

Updated Date - Mar 01 , 2024 | 08:58 AM