Share News

‘గులకరాయి’ కేసులో నిందితుడికి రిమాండ్‌

ABN , Publish Date - Apr 19 , 2024 | 04:03 AM

‘గులకరాయి’ కేసులో అదుపులోకి తీసుకున్న సతీశ్‌ అనే యువకుడిని పోలీసులు మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ జడ్జి కోర్టులో హాజరుపరిచారు. న్యాయాధికారి సి.రమణారెడ్డి ఇరువైపుల వాదనలు విన్న తర్వాత.. అజిత్‌సింగ్‌ నగర్‌ వడ్డెర కాలనీకి చెందిన వేముల

‘గులకరాయి’ కేసులో నిందితుడికి రిమాండ్‌

కోర్టులో సతీశ్‌ పుట్టిన తేదీ విషయంలో వివాదం

ఆధార్‌ కార్డు ప్రకారం ఘటన నాటికి మైనర్‌..

ఆస్పత్రి రికార్డులను పరిగణించాలన్న సర్కార్‌

పోలీసుల అదుపులోని మైనర్లను విడిపించండి

న్యాయాధికారికి డిఫెన్స్‌ న్యాయవాదుల వినతి..

అడ్వకేట్‌ కమిషనర్‌ను నియమించిన కోర్టు

విజయవాడ, ఏప్రిల్‌ 18 (ఆంధ్రజ్యోతి): ‘గులకరాయి’ కేసులో అదుపులోకి తీసుకున్న సతీశ్‌ అనే యువకుడిని పోలీసులు మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ జడ్జి కోర్టులో హాజరుపరిచారు. న్యాయాధికారి సి.రమణారెడ్డి ఇరువైపుల వాదనలు విన్న తర్వాత.. అజిత్‌సింగ్‌ నగర్‌ వడ్డెర కాలనీకి చెందిన వేముల సతీశ్‌కుమార్‌ 14 రోజులపాటు రిమాండ్‌ విధించారు. అనంతరం సతీశ్‌ను విజయవాడలోని జిల్లా కారాగారానికి తరలించారు. సతీశ్‌ జనంలో ఉండి సీఎం జగన్‌పైకి రాయి విసిరినట్టు పోలీసులు తమ రిమాండ్‌ రిపోర్టులో పేర్కొన్నారు. పోలీసుల కథనం ప్రకారం..‘‘సెంట్రల్‌ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి వెలంపల్లి శ్రీనివాసరావు ఫిర్యాదు మేరకు పోలీసు కమిషనర్‌ కేసు దర్యాప్తునకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ‘సీఎం బస్సు యాత్ర ఈనెల 13వ తేదీన విజయవాడలోని వారధి నుంచి కేసరపల్లి వరకు నిర్వహించాలని షెడ్యూల్‌ ఇచ్చారు. శిఖామణి సెంటర్‌, చుట్టుగుంట, ఫుడ్‌ జంక్షన్‌, డాబాకొట్లు సెంటర్‌ మీదుగా కృష్ణా హోటల్‌ సెంటర్‌, పైపుల రోడ్డు, కండ్రిక మార్గాల్లో యాత్రను నిర్వహించారు. బస్సు యాత్ర సెంట్రల్‌ నియోజకవర్గంలోకి ప్రవేశించగానే జగన్‌, ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్సీ రుహుల్లాతోపాటు ఇతర నాయకులు బస్సు పైకి ఎక్కి ప్రజలకు అభివాదం చేశారు. రాత్రి 8.30 గంటల సమయంలో బస్సు యాత్ర అజిత్‌సింగ్‌ నగర్‌లోని వివేకానంద స్కూల్‌ వద్దకు చేరుకుంది. ప్రజల్లో జగన్‌కు ఉన్న ఆదరణను చూడలేక ఒక వ్యక్తి ఆయనపై దాడి చేశాడు. పదునైన అంచులు ఉన్న రాయితో జగన్‌ తలపై కొట్టాడు. ఈ రాయి జగన్‌కు తగలడంతోపాటు నాకు తగిలి, ఎడమ కంటి భాగం వద్ద రక్తపు గాయమైంది. నేను జగన్‌కు పక్కనే నిలబడి ఉన్నాను. ఈ రాయు దాడితో జగన్‌కు నుదుటిపై ఎడమ వైపున రక్తపు గాయమైంది. వైద్య సిబ్బంది జగన్‌కు, నాకు ప్రాథమిక వైద్యం చేశారు. వైద్యం తర్వాత బస్సు యాత్ర మొదలైంది. ఆ తర్వాత మేం విజయవాడ ప్రభుత్వాసుపత్రికి వెళ్లి చికిత్స చేయించుకున్నాం. వైద్యులు మా ఇద్దరికీ వైద్యం చేశారు. ముందస్తు ప్రణాళికతోనే ఈ దాడి చేశారు. ముఖ్యమంత్రిని లక్ష్యంగా చేసుకుని ఆయనను హత్య చేయాలన్న ఉద్దేశంతో దాడి చేశారు’ అని వెలంపల్లి శ్రీనివాసరావు తన ఫిర్యాదులో తెలిపారు. ఆయన ఫిర్యాదు మేరకు ఘటనా స్థలం చేరుకుని మధ్యవర్తుల సమక్షంలో రఫ్‌ స్కెచ్‌ రూపొందించాం. వివిధ కోణాల్లో ఫొటోలను సేకరించాం. 12 మంది వాంగ్మూలాలను నమోదు చేశాం. ప్రధాన నిందితుడు సతీశ్‌కుమార్‌ సీఎం బస్సునకు సమీపంగా తిరిగినట్టు సాక్షులు తెలిపారు. దర్యాప్తులో భాగంగా నార్త్‌ జోన్‌ ఏసీపీ సీసీ కెమెరా ఫుటేజీలు, ఫొటోగ్రా్‌ఫలు, సీఎం భద్రతా విభాగం నుంచి వీడియోగ్రాఫ్‌, యాత్రకు హాజరైన వారు చిత్రీకరించిన వీడియోలను సేకరించారు. సెల్‌టవర్‌ డంప్‌ ఎనాలసిస్‌ చేశాం. సీడీఆర్‌లను పరిశీలించాం. వాటి ప్రకారం సతీశ్‌కుమార్‌ నేరం చేసినట్టు తేలింది. ఏ2 వేముల దుర్గారావుతో కలిసి సతీశ్‌కుమార్‌.... జగన్‌ను అంతమొందించాలని దాడి చేశాడు. విచారణలో సతీశ్‌ నేరం అంగీకరించాడు. ‘దుర్గారావు ఆదేశాలతో సిమెంట్‌ కాంక్రీట్‌ రాయిని జేబులో పెట్టుకుని వివేకానంద స్కూల్‌ వద్దకు 13వ తేదీ రాత్రి 8.04 గంటలకు వెళ్లాను. అక్కడ వివేకానంద స్కూల్‌ వైపున జనం మధ్య నిలబడి రాయి విసిరా’నని సతీశ్‌ అంగీకరించాడు. జగన్‌కు సున్నితమైన ప్రదేశంలో తగలాల్సిన ఆ రాయి ఆయన నుదుటిపై తగిలింది’ అని అతడు తెలిపాడు’’ అని రిమాండ్‌ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు. కాగా, గులకరాయి కేసులో పోలీసులు అదుపులోకి తీసుకున్న ఐదుగురు నిందితులూ మైనర్లు అనీ, వారు ఎక్కడ ఉన్నారో తెలియక తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారని న్యాయవాది అబ్దుల్‌ సలీం దాఖలుచేసిన సెర్చ్‌ వారంట్‌ పిటిషన్‌ను న్యాయాధికారి స్వీకరించారు. దీనిపై అడ్వకేట్‌ కమిషనర్‌ను నియమించారు.

తేదీపై తకరారు...

సతీశ్‌కుమార్‌ను న్యాయాధికారి ప్రశ్నించారు. పోలీసులు కొట్టారా అని ఆరా తీశారు. ఆ తర్వాత పుట్టిన తేదీ చెప్పాలని అడిగారు. ఆధార్‌కార్డు ప్రకారం... 2006 ఏప్రిల్‌ 14 అని అతడు తెలిపాడు. ఘటన జరిగిన ఏప్రిల్‌ 13వ తేదీ నాటికి సతీశ్‌ కుమార్‌ మైనర్‌ అని డిఫెన్స్‌ న్యాయవాదులు కె.రాజశేఖర్‌, అబ్దుల్‌ సలీం వాదించారు. పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ దీనికి అభ్యంతరం చెప్పారు. సెయింట్‌ ఆన్స్‌ ఆసుపత్రి ఇచ్చిన ధ్రువీకరణపత్రం, మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఇచ్చిన ధ్రువీకరణపత్రాన్ని న్యాయాఽధికారికి అందజేశారు. వాటిలో 2005 ఏప్రిల్‌ 14 అని ఉంది. తాను మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఇచ్చిన సర్టిఫికెట్లను పరిగణనలోకి తీసుకుంటున్నట్టు న్యాయాధికారి వెల్లడించారు. నిందితుడిని రిమాండ్‌కు ఆదేశించారు.

రాయి కాదు... దండ గాయం....

గులకరాయి కేసులో ఐపీసీ 307 సెక్షన్‌ వర్తించదని డిఫెన్స్‌ న్యాయవాదులు వాదించారు. నిందితుడు సతీశ్‌కుమార్‌ ఒక ఆకతాయి అని చెప్పారు. జగన్‌ను హత్య చేసే స్థాయి ఈ యువకుడికి ఉందా అని ప్రశ్నించారు. రాజకీయ నాయకులు రోడ్‌షోలు చేసినప్పుడు ఎంతోమంది అభిమానులు, నేతలు పూలదండలు వేస్తారన్నారు. అదేవిధంగా జగన్‌కు పూలదండ వేసినప్పుడు అది గీసుకుని గాయమైందని వాదించారు. ఒకవేళ రాయి విసిరితే దెబ్బ తగిలిన చోట వాపు కనిపిస్తుందన్నారు. కానీ, అలాంటిదేమీ కనిపించలేదని వాదించారు.

Updated Date - Apr 19 , 2024 | 04:03 AM