Share News

అవినీతి వైసీపీ నేతలు జైలుకే!

ABN , Publish Date - Apr 25 , 2024 | 04:46 AM

ఈసారి కేంద్రంలో ఎన్డీయే అధికారంలోకి రాగానే వైసీపీ అవినీతి నాయకులను జైలుకు పంపిస్తామని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ హెచ్చరించారు.

అవినీతి వైసీపీ నేతలు జైలుకే!

ఈసారి ఎన్డీయే ప్రభుత్వం రాగానే అదే చేస్తాం

జగన్‌ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయింది

కేంద్రం వద్ద పూర్తి సమాచారం ఉంది: రాజ్‌నాథ్‌

డ్రగ్స్‌ మాఫియాకు అడ్డా విశాఖ

పథకాలకు ఇస్తున్నకేంద్రం నిధులు పక్కదారి

ఎవరి జేబుల్లోకి వెళ్తున్నాయో త్వరలో వెల్లడిస్తాం

పైగా 13.5 లక్షల కోట్లు అప్పు చేశారు.. రక్షణ మంత్రి ఫైర్‌

విశాఖపట్నం/అనకాపల్లి, ఏప్రిల్‌ 24(ఆంధ్రజ్యోతి): ఈసారి కేంద్రంలో ఎన్డీయే అధికారంలోకి రాగానే వైసీపీ అవినీతి నాయకులను జైలుకు పంపిస్తామని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ హెచ్చరించారు. జగన్‌ పాలనలో విశాఖపట్నం డ్రగ్స్‌, ల్యాండ్‌ మాఫియాకు అడ్డాగా మారిందని ఆరోపించారు. బుధవారం విశాఖ గ్రాండ్‌ బే హోటల్‌లో నిర్వహించిన మేధావుల సమావేశంలోనూ, అనకాపల్లి లోక్‌సభ నియోజకవర్గ కూటమి అభ్యర్థి సీఎం రమేశ్‌ నామినేషన్‌ సందర్భంగా నిర్వహించిన విజయీభవ ర్యాలీలోనూ రాజ్‌నాథ్‌ మాట్లాడారు. విశాఖలో ల్యాండ్‌ మాఫియాపై, ఏపీలో ఇసుక మాఫియాపై కేంద్రం వద్ద పూర్తి సమాచారం ఉందని రాజ్‌నాథ్‌ చెప్పారు. కేంద్రం రూ.15వేల కోట్లు ఇచ్చినా పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేయలేకపోయారని విమర్శించారు. ఏపీలో వివిధ పథకాలకు కేంద్రం నిధులు ఇస్తుంటే వాటిని కూడా జగన్‌ ప్రభుత్వం పక్కదోవ పట్టిస్తోందని, అవన్నీ ఎవరి జేబుల్లోకి వెళ్తున్నాయో త్వరలోనే వెల్లడిస్తామని తెలిపారు. ఈ నిధులన్నీ చాలవన్నట్టు జగన్‌ ప్రభుత్వం రూ.13.5 లక్షల కోట్ల అప్పులు చేసిందని వివరించారు. ఏపీలో కూటమి అభ్యర్థులను గెలిపిస్తే అధికారంలోకి రాగానే డ్రగ్స్‌, ల్యాండ్‌, ఇసుక మాఫియాలకు అడ్డుకట్ట వేస్తామని, శాంతి భద్రతలను కాపాడతామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో విశాఖ ఎంపీ అభ్యర్థి ఎం.శ్రీభరత్‌(టీడీపీ), విశాఖ ఉత్తర అభ్యర్థి విష్ణుకుమార్‌రాజు, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి పీవీఎన్‌ మాధవ్‌ తదితరులు పాల్గొన్నారు.


దిగజారిన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ..

వైసీపీ పాలనలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దిగజారిందని, ఏపీ అభివృద్ధికి కేంద్రం నిధులు కేటాయిస్తున్నా ఇక్కడి పాలకులు దుర్వినియోగం చేస్తున్నారని రాజ్‌నాథ్‌సింగ్‌ విమర్శించారు. భూ దందాలు, ఇసుక మాఫియా, లిక్కర్‌ మాఫియాకు వైసీపీ ప్రభుత్వం ప్రసిద్ధి చెందిందన్నారు. కేంద్ర పథకాలు అమలు చేస్తే ప్రధాని మోదీకి ఎక్కడ పేరు వచ్చేస్తుందోనని అవి లబ్ధిదారులకు చేరకుండా వైసీపీ ప్రభుత్వం అడ్డుకుందని ఆరోపించారు. గతంలో భారత్‌ను పొరుగు దేశాలు బెదిరించేవని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని చెప్పారు. ఎంతో శక్తిమంతమైన దేశంగా భారతదేశం తయారైందన్నారు. 2014కు ముందు రక్షణ శాఖకు కావాల్సిన ఆయుధాలను విదేశాల నుంచి దిగుమతి చేసుకునేవారని ఇప్పుడు మనమే తయారుచేసి విదేశాలకు ఎగుమతి చేస్తున్నామని చెప్పారు. రాజ్యసభలో సీఎం రమేశ్‌ ప్రసంగాలను గత పన్నెండేళ్లుగా ప్రత్యక్షంగా విన్నానని, ఎటువంటి సమస్యనైనా సమర్థంగా పరిష్కరించగలరని కొనియాడారు. సీఎం రమేశ్‌తో పాటు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థులను గెలిపించాలని రాజ్‌నాథ్‌ పిలుపునిచ్చారు.

3, 4 తేదీల్లో రాష్ట్రానికి ప్రధాని మోదీ

అమరావతి, ఏప్రిల్‌ 24(ఆంధ్రజ్యోతి): ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వచ్చే నెల మూడు, నాలుగు తేదీల్లో రాష్ట్రానికి వస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర కార్యాలయం తెలిపింది. మోదీతో రోడ్‌ షో, బహిరంగ సభ నిర్వహణకు రాష్ట్ర బీజేపీ నాయకత్వం టీడీపీ, జనసేనతో కలిసి వేదికలు ఖరారు చేసే పనిలో పడింది. విజయవాడ, రాజంపేట ప్రాంతాల్లో మోదీ సభలు పెడితే కేడర్‌లో ఉత్సాహం వస్తుందనే భావనలో ఎన్డీఏ మిత్రపక్షాలు ఉన్నాయి. తెలంగాణతో పాటు ఏపీలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు ప్రధాన మంత్రిని రెండు రాష్ట్రాల నేతలు ఆహ్వానించగా ఢిల్లీ నుంచి బుధవారం సాయంత్రం ఏపీ బీజేపీ కార్యాలయానికి వర్తమానం అందింది. దీంతో రాష్ట్ర బీజేపీ ఇంచార్జి అరుణ్‌సింగ్‌, సహ ఇంచార్జి సిద్ధార్థనాథ్‌ సింగ్‌, పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి చర్చించారు. మిత్రపక్షాలైన టీడీపీ, జనసేన అధ్యక్షులతో సమావేశమై మోదీ సభల నిర్వహణపై ఏకాభిప్రాయానికి రానున్నారు. రోడ్‌ షోతోపాటు బహిరంగ సభ ఉండేలా చూసుకోనున్నారు.

Updated Date - Apr 25 , 2024 | 04:46 AM