Share News

‘గ్లాసు’పై కుట్ర

ABN , Publish Date - Apr 30 , 2024 | 04:38 AM

‘జనసేన’ గుర్తు... గాజు గ్లాసు! మరి... ఇతరులకూ అదే గుర్తు కేటాయిస్తే!? ఓట్లాటలో మాయోపాయానికి తెరలేపినట్లే! కూటమి ఓట్లను చీల్చే కుట్ర అమలు చేస్తున్నట్లే! ఓటమి భయం పట్టుకున్న వైసీపీ...

‘గ్లాసు’పై కుట్ర

ఓట్ల చీలికకు వైసీపీ పన్నాగం

కామన్‌ సింబల్‌గా మారిన గాజుగ్లాసు

జనసేన అభ్యర్థులందరికీ అదే గుర్తు

ఇతర స్థానాల్లో అందరికీ అందుబాటులో

16 అసెంబ్లీ, 3 ఎంపీ స్థానాల్లో కేటాయింపు

జనసేన అభిమానులను గందరగోళపరిచే కుట్ర

పొద్దుపోయేదాకా రిటర్నింగ్‌ ఆఫీసుల సహకారం!

పలుచోట్ల గుర్తు కేటాయింపులో జాప్యం!

(అమరావతి - ఆంధ్రజ్యోతి)

‘జనసేన’ గుర్తు... గాజు గ్లాసు! మరి... ఇతరులకూ అదే గుర్తు కేటాయిస్తే!? ఓట్లాటలో మాయోపాయానికి తెరలేపినట్లే! కూటమి ఓట్లను చీల్చే కుట్ర అమలు చేస్తున్నట్లే! ఓటమి భయం పట్టుకున్న వైసీపీ... ఇప్పుడు ఇదే దొంగాట మొదలుపెట్టింది. జనసేన అభ్యర్థులు లేనిచోట... జనసేన గుర్తయిన గాజు గ్లాస్‌ను స్వతంత్రులకు కోరి సాధించుకునేలా కుట్ర పన్నింది. రాష్ట్రంలో టీడీపీ - జనసేన - బీజేపీ కూటమిగా ఏర్పడి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో జనసేన 21 స్థానాల్లో అభ్యర్థులను నిలిపింది. కూటమిగా పోటీ చేస్తున్నందున... జనసేనకు మాత్రమే గాజు గ్లాసు గుర్తు కేటాయించాలని, ఇతరులకు ఆ గుర్తు ఇవ్వొద్దని ఇప్పటికే ఈసీని కోరారు. అయితే... జనసేన పార్టీకి చెందిన గాజుగ్లా్‌సను ఈసీ కామన్‌ సింబల్‌గా ప్రకటించింది.

అంటే... జనసేన తరఫున బరిలో ఉన్న అభ్యర్థులందరికీ ఇదే గుర్తును కేటాయిస్తారు. అదే సమయంలో... ఆ పార్టీ పోటీ చేయని స్థానాల్లో కామన్‌ సింబల్‌గా ఇండిపెండెంట్‌ అభ్యర్థులకు గాజుగ్లాస్‌ గుర్తును ఇచ్చేశారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన కొద్ది సేపటికే ఇండిపెండెంట్లకు గుర్తుల కేటాయింపు పూర్తిచేయాలి. కానీ... సోమవారం నామినేషన్ల ఉపసంహరణ గడువు పూర్తయినా, రాత్రి పొద్దుపోయేదాకా పలుచోట్ల ఈ ప్రక్రియ ముగియలేదు. అంటే... గ్లాసు గుర్తు కోరుకునే వారికోసమే ఈ కాలయాపన చేశారనే అనుమానాలు తలెత్తుతున్నాయి. కడపటి వార్తలు అందేసరికి... రాష్ట్ర వ్యాప్తంగా 16 అసెంబ్లీ, మూడు లోక్‌సభ స్థానాల్లో ఇండిపెండెంట్లు, ఇతరులకు గాజుగ్లాసు గుర్తు కేటాయించినట్లు తెలిసింది. ఇందులో... బీజేపీ ఎంపీ అభ్యర్థులున్న అనకాపల్లి, రాజమహేంద్రవరం కూడా ఉన్నాయి. నారా లోకేశ్‌ పోటీ చేస్తున్న మంగళగిరిలోనూ ఒక అభ్యర్థికి గ్లాసు గుర్తు కేటాయించారు.


అసలు ఉద్దేశం అదేనా...

గత ఏడాది చివర్లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లోనూ గాజు గ్లాసు కామన్‌ సింబల్‌గా అందుబాటులో ఉంది. కానీ... దానిని ఎవరూ కోరలేదు. ఈసీ కూడా ఎవరికీ ఇవ్వలేదు. ఇప్పుడు, ఆంధ్రప్రదేశ్‌లో కొందరు ఏరికోరి గాజు గ్లాసునే కోరుకోవడం, వారికి ఈసీ అదే గుర్తు కేటాయించడం గమనార్హం! గత ఎన్నికల్లో జనసేన గాజు గ్లాసు గుర్తుతోనే పోటీ చేసింది. ఈసారీ కూటమిలో భాగస్వామిగా ఉన్న పవన్‌... గాజు గ్లాసునే తమ గుర్తుగా బలంగా ప్రచారం చేస్తున్నారు. అలాంటిది... జనసేన అభ్యర్థులు లేని చోట ఇతరులకు ఆ గుర్తు కేటాయించడం గమనార్హం. అందులోనూ... జనసేన రెబల్స్‌ కోరిమరీ ఈ గుర్తును పొందారు. ఆయా నియోజకవర్గాల్లో జనసేన అభిమానులు కొందరైనా ఈ గుర్తును చూసి గందరగోళానికి గురవుతారన్నదే వీరి ఉద్దేశం. ఉదాహరణకు...

జగ్గంపేట నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థి పాఠంశెట్టి సూర్యచంద్రకు గాజుగ్లాసు గుర్తు కేటాయించారు. ఆయన మొన్నటి వరకూ జనసేన పార్టీలో క్రియాశీలకంగా ఉన్నారు. ఆ నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్‌చార్జిగా కొనసాగారు. పొత్తుల్లో భాగంగా తనకు పార్టీ నుంచి సీటు రాలేదన్న ఉద్దేశంతో బయటకు వచ్చి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేశారు. ఇప్పుడు ఆయనకు ఏకంగా గాజుగ్లాసు గుర్తు లభించింది. ఉమ్మడి గోదావరి జిల్లాల్లో పెద్దాపురం, కాకినాడ సిటీ, రామచంద్రాపురం, అమలాపురం, ముమ్మడివరం, కొత్తపేట, మండపేట, కొవ్వూరు స్థానాల్లో వివిధ పార్టీల, స్వతంత్ర అభ్యర్థులకు ‘గాజుగ్లాసు’ కేటాయించారు.

అనకాపల్లి పార్లమెంట్‌ నియోజకవర్గంలో ఎంపీగా పోటీ చేస్తున్న వడ్లమూరి కృష్ణస్వరూ్‌పకు గాజుగ్లాస్‌ గుర్తు కేటాయించారు. ఆ పార్లమెంట్‌ పరిధిలో అనకాపల్లి, యలమంచిలి, పెందుర్తి నియోజకవర్గాల నుంచి జనసేన పార్టీ అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా బీజేపీ తరఫున సీఎం రమేశ్‌ పోటీ చేస్తున్నారు.

విజయవాడ పార్లమెంటు స్థానంలో నవతరం పార్టీ అభ్యర్థి కృష్ణ కిశోర్‌కు కూడా గాజు గ్లాసు కేటాయించారు.

రాజమండ్రి లోక్‌సభ బరిలో కూటమి అభ్యర్థిగా పురందేశ్వరి పోటీలో నిలిచిన సంగతి తెలిసిందే. ఇక్కడా ఒక ఇండిపెండెంట్‌కు గాజుగ్లాసు కేటాయించారు.

టీడీపీ జాతీయ కార్యదర్శి బరిలో మంగళగిరిలోనూ ఒకరికి గాజు గ్లాసు ఇచ్చేశారు.

విజయవాడ సెంట్రల్‌లో ఆంధ్ర రాష్ట్ర ప్రజాసమితి అభ్యర్థి గొల్లపల్లి ఫణిరాజ్‌, మైలవరంలో ఇండిపెండెంట్‌ అభ్యర్థి వల్లభనేని నాగపవన్‌ కుమార్‌కూ ఇదే గుర్తు ఇచ్చారు.

విజయనగరం మాజీ ఎమ్మెల్యే మీసాల గీత అదే నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తున్నారు. ఆమెకు ఈసీ గాజుగ్లాసు గుర్తు కేటాయించింది.

ఎన్టీఆర్‌ జిల్లా గన్నవరం నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థి వల్లభనేని మోహన వంశీకి గాజుగ్లాసు గుర్తు కేటాయింపు.

టెక్కలిలో స్వతంత్ర అభ్యర్థి అట్టాడ రాజేశ్‌కు గ్లాస్‌ గుర్తు కేటాయించారు.

బాపట్ల నియోజకవర్గంలో వైసీపీ ఎంపీపీగా ఉన్న డి.సీతారామరాజు ఇండిపెండెంట్‌గా బరిలో నిలిచారు. ఆయనకు గ్లాసు గుర్తు కేటాయించారు.

శ్రీకాళహస్తిలోనూ ఒక ఇండిపెండెంట్‌కు గ్లాసుగుర్తు ఇచ్చారు.


రాష్ట్రంలో నామినేషన్ల ఉపసంహరణ పూర్తి

తుది సంఖ్యను ప్రకటించని ఈసీ

అమరావతి, ఏప్రిల్‌ 29: రాష్ట్రంలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో కీలకమైన నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం సోమవారం ముగిసింది. దీంతో 25 లోక్‌సభ, 175 శాసనసభ నియోజకవర్గాల్లో ఎవరెవరు పోటీచేస్తున్నారో స్పష్టత వచ్చింది. అయితే రాష్ట్రవ్యాప్తంగా బరిలో నిలిచినవారు ఎంతమంది... ఏయే పార్టీల తరఫున ఎవరెవరు పోటీచేస్తున్నారో తుది జాబితాను అర్ధరాత్రి దాటినా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) కార్యాలయం ప్రకటించలేదు.

‘కారు’ గుర్తును పోలినట్లుగా ఉన్న ట్రాక్టర్‌, రోడ్డు రోలర్‌ గుర్తులనే ఇతరులకు కేటాయించొద్దని తెలంగాణలో బీఆర్‌ఎస్‌ ఎన్నికల కమిషన్‌ను కోరింది. కానీ... ఇక్కడ ఏకంగా జనసేన గుర్తు అయిన గాజు గ్లాసును ఇండిపెండెంట్లు, ఇతరుకు ఇచ్చేశారు. ఇదేం నిబంధన?

తెలంగాణలో ఏ ఒక్కరూ గాజు గ్లాసు గుర్తు కావాలని కోరలేదు. ఈసీ ఇవ్వలేదు. కానీ... ఏపీలో మాత్రం మరే గుర్తులూ అందుబాటులో లేనట్లుగా గాజు గ్లాసు కోరి తీసుకున్నారు. అంటే.. కూటమి ఓట్లు చీల్చాలనే దురుద్దేశం ఉన్నట్లే కదా?

Updated Date - Apr 30 , 2024 | 06:28 AM