కుట్రతోనే నిప్పు
ABN , Publish Date - Jul 28 , 2024 | 03:39 AM
మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులు, రెవెన్యూ అధికారులు కుమ్మక్కై, కుట్రపన్ని మదనపల్లె సబ్‌కలెక్టర్ కార్యాలయాన్ని తగులబెట్టారు.

షార్ట్ సర్క్యూట్ కారణం కాదు.. బయటి వ్యక్తుల ప్రమేయం లేదు
భూ అక్రమాలు బయటకు రాకూడదనే దుశ్చర్య
అల్మరాలో దాచిన 7 లీటర్ల ఇంజన్ ఆయిల్
21వ తేదీ రాత్రి 11-11:30 గంటల మధ్య ఘటన
10వ తేదీ నుంచే పనిచేయని సీసీ కెమెరాలు
మాజీ ఆర్‌డీఓ మురళి, పెద్దిరెడ్డి పీఏ, అనుచరుల పాత్ర
వీరిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి
22(ఏ) నుంచి వేలాది ఎకరాలు అడ్డగోలుగా తొలగింపు
‘మదనపల్లె’ ఫైళ్ల దహనంపై సిసోడియా ప్రాథమిక నివేదిక
అమరావతి, జూలై 27(ఆంధ్రజ్యోతి): ‘‘మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులు, రెవెన్యూ అధికారులు కుమ్మక్కై, కుట్రపన్ని మదనపల్లె సబ్‌కలెక్టర్ కార్యాలయాన్ని తగులబెట్టారు. వేలాది ఎకరాల అసైన్డ్, చుక్కల భూములను అక్రమంగా, నిబంధనలకు విరుద్ధంగా తప్పుడు పద్ధతుల్లో నిషేధ జాబితా నుంచి తొలగించారు. ఇప్పుడు అవి బయటకు రాకూడదనే ఉద్దేశపూర్వకంగా రికార్డులు తగలబెట్టే పేరిట ఆఫీసుకు నిప్పుపెట్టారు’’ అని రెవెన్యూశాఖ స్పెషల్ సీఎస్ ఆర్.పి. సిసోడియా సర్కారుకు నివేదించారు. మదనపల్లె పర్యటన తర్వాత అమరావతి వచ్చిన సిసోడియా శనివారమే ప్రభుత్వానికి ప్రాథమిక నివేదికను సమర్పించారు. ఈ ఘటనలో ప్రధాన కుట్రదారులుగా భావిస్తున్న మదనపల్లె మాజీ ఆర్‌డీఓ, డిప్యూటీ కలెక్టర్ మురళి, సీనియర్ అసిస్టెంట్ గౌతమ్‌ను సస్పెండ్ చేయాలని నిర్ణయుంచారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం, అలవిమాలిన అసలత్వం, అవినీతి, వైసీపీ నేతలతో అంటకాగి అడ్డగోలుగా భూములు ధారాదత్తం చేసినందుకు ప్రస్తుత మదనపల్లె ఆర్‌డీఓ హరిప్రసాద్‌ను కూడా సస్పెండ్ చేయనున్నారు. ఈ మేరకు ఆదివారం ఉత్తర్వులు వెలువడనున్నాయి దీంతోపాటు వారిపై క్రిమినల్ చర్యలు కూడా తీసుకోవాలని సిసోడియా సిఫారసు చేశారు.
ఆఫీసు దహనం కేసులో వారిని ప్రధాన దోషులుగా చేర్చి, క్రిమినల్ కేసులు పెట్టి విచారణ చేయాలని కోరారు. మరోవైపు ఈ కుట్రలో సూత్రధారులు, పాత్రధారులుగా మురళి, గౌతమ్, పెద్దిరెడ్డి పీఏ తుకారాం, పెద్దిరెడ్డి ప్రధాన అనుచరుడు మాధవరెడ్డి వ్యవహరించారని ప్రాథమిక విచారణలో తేలినట్లు ఆయన సర్కారుకు నివేదించారు. ఆఫీసుకు నిప్పుపెట్టడానికి ముందే, సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ 7 లీటర్ల షెల్ ఇంజన్ ఆయిల్‌ను తెప్పించుకొని కార్యాలయంలోని తన అల్మారాలో అందుబాటులో ఉంచుకున్నారని పేర్కొన్నారు. ఈ నెల 21న మురళి, హరిప్రసాద్, గౌతమ్, పెద్దిరెడ్డి మనుషులు సమావేశమయ్యారని, అదేరోజు రాత్రి 10 గంటల వరకూ గౌతమ్ ఆఫీసులోనే ఉన్నారని, 11.30 తర్వాత రికార్డు రూమ్‌కు నిప్పుపెట్టారని ఆయన తన నివేదికలో పేర్కొన్నారు. మంటలు త్వరగా అంటుకొని ఎక్కువ నష్టం జరిగేలా కెమికల్ ఏజెంట్లను కూడా వాడారని వివరించారు.
74వేల ఎకరాలు ఫ్రీహోల్డ్
మదనపల్లె డివిజన్ నుంచి అసైన్డ్ భూములను 22(ఏ) నుంచి తీసి పూర్తి హక్కులు కల్పించాలని తహసిల్దార్‌లు 79,107 ఎకరాలకు ప్రతిపాదనలు ఇచ్చారు. ఇందులో కలెక్టర్ 74,374 ఎకరాలను నిషేధ జాబితా నుంచి తొలగించారు. అందులో 2003 తర్వాత అసైన్ చేసిన భూములు కూడా ఉన్నాయని సిసోడియా తన నివేదికలో పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా వేలాది ఎకరాల భూమిని నిషేధ జాబితా నుంచి తొలగించాలని తహసిల్దార్లు ప్రతిపాదనలు ఇచ్చారని, వాటిని సరైన పరిశీలన చేయకుండానే ఆమోదించారని తేల్చారు. వివాదంలో ఉన్నవి, కోర్టులో ఉన్నవి, ప్రభుత్వ భూములు ఇంకా చట్టసవరణకు ముందు కేటాయించిన భూములను కూడా నిషేధ జాబితా నుంచి తొలగించాలని ప్రతిపాదనలు ఇచ్చారని ప్రభుత్వానికి నివేదించారు. కొన్ని కేసుల్లో తహసిల్దార్లు ఇచ్చిన నివేదికలను ఆర్డీఓ కార్యాలయంలో అడ్డగోలుగా ఫోర్జరీకి పాల్పడి తప్పుడు నివేదికలుగా మార్చారని వివరించారు ఆ ఒక్క డివిజన్‌లోనే 14వేల ఎకరాల చుక్కల భూములను రెగ్యులరైజ్ చేశారని పేర్కొన్నారు. ఈ భూములకు సంబంధించిన ఫైళ్లను నిశిత పరిశీలన చేయాల్సి ఉంటుందని, సమగ్ర విచారణతోనే ఇది సాధ్యమని తన నివేదికలో వివరించారు. కాగా, ఆఫీసులో 2,400 ఫైళ్లకు నిప్పుపెట్టారని ఆయన పేర్కొన్నారు. మదనపల్లె ఘటన నేపథ్యంలో కృష్ణా, గుంటూరు, ప్రకాశం, విశాఖ ఉమ్మడి జిల్లాల్లోని భూముల ఫైళ్లను కూడా పరిశీలించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
రాత్రి 11:30 ప్రాంతంలో ఘటన
‘మదనపల్లె సబ్‌కలెక్టరేట్‌లో ఆఫీసు లోపల 7, వెలుపల 3 సీసీ కెమెరాలు ఉన్నాయి. జూలై 10 నుంచి అవి పనిచేయలేదు. జూలై 21వ తేదీ రాత్రి 11, 11:30 గంటల మధ్య ఘటన జరిగింది. ఫర్నీచర్, కంప్యూటర్లు, వేలాది ఫైళ్లు దహనమయ్యాయి. ఇవన్నీ 22ఏ, ఫ్రీహోల్డ్ అసైన్‌మెంట్లు, చుక్కల భూములకు సంబంధించినవి. 17 నిమిషాల్లో ఘటనా స్థలికి ఫైరింజన్లు చేరుకున్నాయి. అగ్నిమాపక సిబ్బంది మంటల్లో కాలిపోకుండా 700 ఫైళ్లను కాపాడారు. ఘటనా స్థలంలో ఫోరెన్సిక్ ఆధారాలను పోలీసులు సేకరించారు. పోలీసుల అదుపులో 10 మంది ఉన్నారు. విచారణకు 36 మందిని పిలిపించారు. ఈ కేసుతో చాలా దగ్గర సంబంధం ఉన్న 11 మంది నుంచి స్టేట్‌మెంట్లు నమోదు చేశారు’ అని సిసోడియా తన నివేదికలో పేర్కొన్నారు.
ఆ రాత్రి ఆఫీసులో గౌతమ్
‘సంఘటన జరిగిన రోజు నైట్ డ్యూటీలో ఉన్న వీఆర్‌ఏ రమణయ్య (56) సాయంత్రం 5:45 గంటలకు ఆఫీసుకు వచ్చారు. మాజీ ఆర్డీవో మురళి సాయంత్రం 6గంటలకు గెస్ట్‌హౌ్‌సకు వచ్చారు. ఆ సమయంలో సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ ఆఫీసులో ఉన్నారు. ఆర్డీవో, ఇతర అధికారులు వెళ్లాక గౌతమ్ ఒక్కరే ఆఫీసులో ఉన్నారు. రమణయ్య సమీపంలోని కుమార్తె ఇంటికి భోజనానికి వెళ్లి రాత్రి 8:30 గంటలకు తిరిగి వచ్చారు. అప్పటికీ గౌతమ్ కంప్యూటర్‌తో పనిచేస్తున్నారు. రాత్రి 10 గంటల సమయంలో రమణయ్య నిద్రపోయారు. గౌతమ్ ఎంత సమయానికి ఆఫీసు నుంచి వెళ్లారో ఆయనకు తెలియదు. 11:30 గంటల సమయంలో మంటల శబ్దానికి రమణయ్య నిద్ర లేచారు. పెద్ద ఎత్తున అగ్నికీలలు చెలరేగినట్టు గమనించారు. దాదాపు 8 అడుగుల ఎత్తులో మంటలు ఎగిశాయి. ఆయన వెంటనే ఆఫీసు నుంచి బయటకు వచ్చి సమీపంలోని ఆర్డీవో నివాసానికి వెళ్లారు. అక్కడ వాచ్‌మెన్ రెడ్డ్డెప్ప లేకపోవడంతో రమణయ్య తన పై అధికారిణి, డిప్యూటీ తహసీల్దార్ తపస్వినికి సమాచారం అందించారు’ అని నివేదికలో రాశారు.