విజయవాడ మెట్రోను ‘అమరావతి’తో అనుసంధానించండి
ABN , Publish Date - Oct 23 , 2024 | 03:14 AM
‘గత టీడీపీ హయాంలో ప్రతిపాదించిన విశాఖ, విజయవాడ మెట్రో ప్రాజెక్టులపై త్వరగా నిర్ణయం తీసుకోవాలి’ అని రాష్ట్ర మునిసిపల్, పట్టణాభివృద్ధి మంత్రి నారాయణ కోరా రు.
కేంద్ర మంత్రి ఖట్టర్‌తో మంత్రి నారాయణ
న్యూఢిల్లీ, అమరావతి, అక్టోబరు 22(ఆంధ్రజ్యోతి): ‘గత టీడీపీ హయాంలో ప్రతిపాదించిన విశాఖ, విజయవాడ మెట్రో ప్రాజెక్టులపై త్వరగా నిర్ణయం తీసుకోవాలి’ అని రాష్ట్ర మునిసిపల్, పట్టణాభివృద్ధి మంత్రి నారాయణ కోరా రు. మంగళవారం కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తో సమావేశమైన ఆయన ఈమేరకు విజ్ఞప్తి చేశారు. రెండు మెట్రో ప్రాజెక్టులకు సంబంధించి పూర్తి వివరాలతో రూపొందించిన తాజా ప్రతిపాదనలను కేంద్ర మంత్రికి అందించా రు. ఈ భేటీలో మంత్రితో టీడీపీపీ నేత లావు శ్రీకృష్ణదేవరాయులు, రాష్ట్ర మునిసిపల్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్ పాల్గొన్నారు. విశాఖపట్నం, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులను ముందుకు తీసుకువెళ్లే అంశంపై ఈ భేటీలో చర్చించారు. విజయవాడ మెట్రోను రాష్ట్ర రాజధాని అమరావతికి అనుసంధానించే ప్రతిపాదనలు కూడా ఇప్పటికే కేంద్రానికి పంపినట్లు కేంద్ర మంత్రి దృష్టికి నారాయణ తీసుకెళ్లారు. అమృత్ 2 పథకం గత ఐదేళ్లుగా రాష్ట్రంలో అమలుకు నోచుకోలేదని కేంద్ర మంత్రికి చెప్పారు. అమృత్ 2 అమలుకు ఉన్న మార్గాలపై చర్చలు జరిపారు. తన ప్రతిపాదనలపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని మంత్రి నారాయణ తెలిపారు.