Share News

మాతో పెట్టుకుంటే కుర్చీ లాగేస్తాం!

ABN , Publish Date - Jan 12 , 2024 | 04:20 AM

మమ్మల్ని పట్టించుకోకుంటే మీ కుర్చీ లాగేస్తామని సమ్మె చేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలు సీఎం జగన్మోహన్‌రెడ్డిని హెచ్చరించారు.

మాతో పెట్టుకుంటే కుర్చీ లాగేస్తాం!

హెచ్చరించిన అంగన్వాడీలు.. కొనసాగిన ఆందోళనలు

నేడు అంగన్వాడీ సంఘాలతో మంత్రుల కమిటీ చర్చలు

హెచ్చరించిన అంగన్వాడీలు

నేడు అంగన్వాడీ సంఘాలతో మంత్రుల కమిటీ చర్చలు

అమరావతి, జనవరి 11(ఆంధ్రజ్యోతి): మమ్మల్ని పట్టించుకోకుంటే మీ కుర్చీ లాగేస్తామని సమ్మె చేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలు సీఎం జగన్మోహన్‌రెడ్డిని హెచ్చరించారు. ప్రభుత్వం మొండిగా ముందుకు వెళితే వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెబుతామని చెప్పారు. వేతనాలు పెంచాలని, గ్రాట్యుటీ అమలు చేయాలని, తదితర డిమాండ్లతో అంగన్వాడీలు చేస్తున్న సమ్మె 31వ రోజుకు చేరుకుంది. ఒకవైపు ఎస్మా ప్రయోగించినా, షోకాజ్‌ నోటీసులు ఇస్తున్నా అంగన్వాడీలు సమ్మెను యథావిధిగా కొనసాగిస్తున్నారు. పారిశుధ్య కార్మికులను చర్చలకు పిలిచిన ప్రభుత్వం తమను చర్చలకు పిలవకుండా కక్షసాధింపులకు పాల్పడుతోందని మండిపడ్డారు. కాగా, అంగన్వాడీల ఉద్యమం ఉధృతంగా కొనసాగుతుండడంతో జగన్‌ సర్కార్‌ మరోమారు అంగన్వాడీలతో చర్చలకు సిద్ధమయ్యింది. శుక్రవారం అమరావతి సచివాలయంలో అంగన్వాడీ సంఘాలతో మంత్రుల కమిటీ భేటీ కానుంది. ఈమేరకు గురువారం అంగన్వాడీ సంఘాల నేతలకు సమాచారం అందజేసింది. కాగా రాష్ట్రవ్యాప్తంగా గురువారం అంగన్వాడీల ఆందోళనలు కొనసాగాయి. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం పాశర్లపూడి వైనతేయ నదిలో జల దీక్ష చేశారు. విజయనగరం జిల్లాలో ఓవైపు అధికారుల నోటీసుల జారీ జోరుగా కొనసాగుతుండగా.. మరోవైపు అంగన్వాడీలు ఆందోళనలు చేస్తున్నారు. కలెక్టరేట్‌ వద్ద దీక్షలు చేస్తున్న కార్యకర్తలు గురువారం కూడా రాత్రి అక్కడే నిద్రకు ఉపక్రమించారు.

పర్వతీపురం కలెక్టరేట్‌ వద్ద అంగన్‌వాడీలు నిరసన దీక్ష కొనసాగించారు. పాలకొండ సమ్మె శిబిరంలోనే నిద్రపోయారు. గరుగుబిల్లిలో ఒంటి కాలిపై నిలబడి, కొమరాడలో పురుగు మందు డబ్బాలతో, సీతానగరంలో చెంపలు వేసుకుని, బలిజిపేటలో చెరువులో దిగి నిరసన వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లావ్యాప్తంగా నోరు, కళ్లు, చెవులు మూసుకుని ప్రదర్శనలు నిర్వహించారు. అనంతపురం కలెక్టరేట్‌ వద్ద రోడ్డుపైకి వచ్చిన కుర్చీలు తలపై పెట్టుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమతో పెట్టుకుంటే కుర్చీలు తిరగబడతాయని హెచ్చరించారు. మరోవైపు అంగన్వాడీలకు ఐసీడీఎస్‌ అధికారులు, సచివాలయ ఉద్యోగులు షోకాజ్‌ నోటీసులు అందజేస్తున్నారు. శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం, ముదిగుబ్బ తహసీల్దారు కార్యాలయాల వద్ద అంగన్వాడీలు దీక్షలు కొనసాగించారు.తిరుపతి జిల్లా పిచ్చాటూరులో ఊయలకు సీఎం జగన్‌ ఫొటో అంటించి నిరసన తెలిపారు. కడప కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేశారు. బద్వేలులో మెడలకు ఉరితాళ్లతో నిరసన తెలిపారు. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో మోకాళ్లపై కూర్చుని నిరసన తెలిపారు. బి.కొత్తకోటలో 31 ఆకారంలో కూర్చున్నారు. తంబళ్లపల్లెలో రిలే దీక్షలు చేపట్టారు. కోటకొండ, రెడ్డికోట అంగన్వాడీ కేంద్రాలను వైసీపీ నాయకుల ఒత్తిడితో తెరిచారు. యూనియన్‌ నాయకులు వాటిని మూయించారు. వాల్మీకీపురంలో అంగన్వాడీలు గడ్డి తింటూ, రాయచోటిలో మోకాళ్లపై కూర్చుని నిరసన తెలిపారు. ఎస్మా జీవో ప్రతులను దహనం చేశారు. లక్కిరెడ్డిపల్లెలో ఒంటికాలిపై నిలబడి ఆందోళన చేశారు. శ్రీకాకుళంలో 24 గంటల నిరాహార దీక్షలు చేశారు. కాగా, అంగన్వాడీల పట్ల రాష్ట్ర ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విమర్శించారు. ప్రభుత్వం ఎస్మా ప్రయోగించడం సిగ్గు చేటన్నారు. అంగన్‌వాడీల ఉద్యమానికి మద్దతుగా ఉమ్మడి కార్యాచరణకు సన్నద్ధమవుతున్నామని సీపీఎం నాయకులు ఏలూరులో చెప్పారు. సంక్రాంతిలోపు సమస్యలు పరిష్కరించని పక్షంలో పండుగ తర్వాత రాష్ట్ర బంద్‌కు ఇప్పటి నుంచే సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు.

Updated Date - Jan 12 , 2024 | 04:20 AM