Share News

‘బయటికి రా.. నీ అంతు చూస్తాం’

ABN , Publish Date - Feb 17 , 2024 | 03:32 AM

పార్వతీపురంలో గురువారం అర్ధరాత్రి వైసీపీ కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు వీరంగం సృష్టించారు. అధికార పార్టీ ఎమ్మెల్యే భూదందాలు, కబ్జాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్న టీడీపీ కౌన్సిలర్‌ ఇంటిపై దాడికి యత్నించారు.

‘బయటికి రా.. నీ అంతు చూస్తాం’

పార్వతీపురంలో వైసీపీ శ్రేణుల వీరంగం

అర్ధరాత్రి టీడీపీ కౌన్సిలర్‌ ఇంటిపై దాడికి యత్నం

పార్వతీపురం, ఫిబ్రవరి 16(ఆంధ్రజ్యోతి): పార్వతీపురంలో గురువారం అర్ధరాత్రి వైసీపీ కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు వీరంగం సృష్టించారు. అధికార పార్టీ ఎమ్మెల్యే భూదందాలు, కబ్జాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్న టీడీపీ కౌన్సిలర్‌ ఇంటిపై దాడికి యత్నించారు. తలుపులు, గేట్లు కొట్టి.. దుర్భాషలాడుతూ.. భయభ్రాంతులకు గురి చేశారు. ‘బయటికి రా.. నీ అంతు చూస్తాం’ అంటూ బెదిరించారు. జిల్లా కేంద్రంలోని కొత్తవలస, గిజబ కాలనీ, గోపాలపురం సమీపంలోని జగనన్న కాలనీల్లో ఎమ్మెల్యే సహకారంతో కొంతమంది వైసీపీ కౌన్సిలర్లు గుడి, బడికి సంబంధించిన స్థలాలను ఆక్రమించి, యథేచ్ఛగా నిర్మాణాలు చేపడుతున్నారు. వాటిపై బహిరంగంగానే కాకుండా పత్రికలు, సోషల్‌ మీడియా ద్వారా టీడీపీ కౌన్సిలర్‌ నారాయణ ప్రజలకు తెలియజేస్తున్నారు. రెండు రోజుల కిందట పార్వతీపురం మండలం వెంకంపేటలో నిర్వహించిన శంఖారావం సభలో టీడీపీ జాతీయ కార్యదర్శి లోకేశ్‌ కూడా పట్టణంలో ఆక్రమణలు, ఎమ్మెల్యే కబ్జాలపై ధ్వజమెత్తారు. ఇది ఎమ్మెల్యేతో పాటు ఆ పార్టీ శ్రేణులకు మింగుడుపడలేదు. దీంతో గురువారం అర్ధరాత్రి సమయంలో 8వ వార్డు టీడీపీ కౌన్సిలర్‌ కోరాడ నారాయణరావు ఇంటిపై దాడికి యత్నించారు. 7, 9 వార్డులకు చెందిన వైసీపీ కౌన్సిలర్లు ఆనంద్‌, జయంతితో పాటు కో ఆప్షన్‌ సభ్యుడు వెంకటరావుతో పాటు కొందరు వైసీపీ నాయకులు, వారి అనుచరులు నారాయణరావు ఇంటి గేటు, తలుపులు కొడుతూ తిట్ల పురాణం అందుకున్నారు. ‘మా ఎమ్మెల్యేపై అభాండాలు వేస్తూ మమ్మల్ని ఆక్రమణ దారులంటావా?’ అంటూ గట్టిగా కేకలు వేస్తూ.. కౌన్సిలర్‌ కుటుంబాన్ని భయభ్రాంతులకు గురిచేశారు. దీనిపై నారాయణరావు వెంటనే పట్టణ పోలీసులకు ఫోన్‌లో సమాచారం ఇచ్చారు. తనను, తన కుటుంబాన్ని రక్షించాలని కోరారు. తర్వాత ఇంటినుంచి బయటకు వచ్చిన నారాయణరావుపై అధికార పార్టీ నేతలు విరుచుకుపడ్డారు. ఆయన చొక్కా పట్టుకుని వాగ్వాదానికి దిగారు. ఇంతలో స్థానిక టీడీపీ నేతలు, పోలీసులు అక్కడకు రావడంతో వైసీపీ శ్రేణులు మెల్లగా జారుకున్నారు. టీడీపీ కౌన్సిలర్‌ ఇంటిపై దాడికి యత్నించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని టీడీపీ నేతలు డిమాండ్‌ చేశారు. ఈ ఘటనపై పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

Updated Date - Feb 17 , 2024 | 10:23 AM