Share News

కారుతో ఢీకొట్టి.. ఆపై తొక్కించి..

ABN , Publish Date - Feb 07 , 2024 | 04:41 AM

విశాఖపట్నంలో తహసీల్దార్‌ హత్య ఘటనను మరవకముందే.. అన్నమయ్య జిల్లాలో మరో ప్రభుత్వ ఉద్యోగి దారుణ హత్యకు గురయ్యారు.

కారుతో ఢీకొట్టి.. ఆపై తొక్కించి..

కానిస్టేబుల్‌ దారుణ హత్య.. ఎర్రచందనం స్మగ్లర్ల ఘాతుకం

కారులో ఎర్రచందనం స్మగ్లింగ్‌

తనిఖీల్లో కారు ఆపిన పోలీసులు

ఆపినట్టే ఆపి వేగంగా ముందుకు

అడ్డుకునేందుకు కానిస్టేబుల్‌ యత్నం

ఢీకొట్టి తొక్కిస్తూ దూసుకెళ్లిన స్మగ్లర్లు

వెంబడించి పట్టుకున్న పోలీసులు

ఇద్దరు అరెస్టు.. ముగ్గురి పరారీ..

ఆస్పత్రికి వెళ్లేలోపే కానిస్టేబుల్‌ మృతి

అన్నమయ్య జిల్లా కేవీపల్లెలో ఘటన

30 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటన

పీలేరు, ధర్మవరం, ఫిబ్రవరి 6: విశాఖపట్నంలో తహసీల్దార్‌ హత్య ఘటనను మరవకముందే.. అన్నమయ్య జిల్లాలో మరో ప్రభుత్వ ఉద్యోగి దారుణ హత్యకు గురయ్యారు. ఎర్రచందనం స్మగ్లింగ్‌ను అడ్డుకోబోయిన ఏఆర్‌ కానిస్టేబుల్‌ను స్మగ్లర్లు కారుతో ఢీకొట్టి, ఆపై అదే కారుతో తొక్కించి కిరాతకంగా చంపేశారు. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ సంఘటన అన్నమయ్య జిల్లా కేవీపల్లె మండలంలో మంగళవారం తెల్లవారుజామున జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. అన్నమయ్య జిల్లా సుండుపల్లె, సానిపాయ అటవీ ప్రాంతాల నుంచి తమిళనాడుకు పెద్దఎత్తున ఎర్రచందనం స్మగ్లింగ్‌ జరుగుతుండడంతో ఇటీవల ఫారెస్టు, టాస్క్‌ఫోర్సు పోలీసులు ఆ ప్రాంతాల్లో గస్తీ పెంచారు. అందులో భాగంగా సుండుపల్లె-పీలేరు మార్గంలో తరచూ వాహనాల తనిఖీ చేపడుతున్నారు. ఈ క్రమంలో సానిపాయ అడవుల నుంచి చెన్నైకి ఎర్రచందనం స్మగ్లింగ్‌ జరుగుతోందన్న సమాచారంతో సోమవారం రాత్రి ఆర్‌ఎ్‌సఐ విశ్వనాథం నేతృత్వంలో ఏఆర్‌ పోలీసు సిబ్బంది కేవీపల్లె మండలం గుండ్రేవారిపల్లె సమీపంలోని గొల్లపల్లె చెరువు వద్ద వాహనాల తనిఖీ చేపట్టారు. మంగళవారం తెల్లవారుజాము 2.30 గంటల ప్రాంతంలో సుండుపల్లె వైపు నుంచి వేగంగా వస్తున్న మారుతీ స్విఫ్ట్‌ కారును ఆపేందుకు పోలీసులు ప్రయత్నించారు. కానీ, అందులోని స్మగ్లర్లు కారును ఆపినట్టే ఆపి మళ్లీ వేగంగా ముందుకు పోనిచ్చారు. దీంతో అప్రమత్తమైన ఏఆర్‌ కానిస్టేబుల్‌ కురుబ గణేశ్‌ (30) ఆ కారును అడ్డుకునేందుకు ప్రయత్నించారు. స్మగ్లర్లు కారుతో అతన్ని ఢీకొట్టి తొక్కించుకుంటూ వెళ్లిపోయారు. మిగిలిన సిబ్బంది అప్రమత్తమై కారును అడ్డుకున్నారు. ఇద్దరిని అదుపులోకి తీసుకోగా మరో ముగ్గురు పారిపోయారు. గాయపడిన గణేశ్‌ను వైద్యం కోసం పీలేరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ప్రాణాలు విడిచారు.

30 లక్షల ఎక్స్‌గ్రేషియా: అన్నమయ్య జిల్లా ఎస్పీ కృష్ణారావు, తిరుపతి టాస్క్‌ఫోర్స్‌ ఎస్పీ శ్రీనివాస్‌ ఘటన స్థలాన్ని పరిశీలించారు. గణేశ్‌ కుటుంబానికి ప్రభుత్వం రూ.30 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిందని తెలిపారు. కాగా, గణేశ్‌ ఎర్రచందనం స్మగ్లర్ల చేతిలో బలవ్వడంతో ఆయన స్వస్థలం, శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో విషాదఛాయలు అలముకున్నాయి. ధర్మవరం పట్టణంలోని గుట్టకిందపల్లి ప్రాంతానికి చెందిన శ్రీరాములు, అలివేళమ్మ దంపతుల కుమారుడైన గణేశ్‌ 2013లో కానిస్టేబుల్‌గా ఉద్యోగంలో చేరారు. అనంతపురంలోని ఏపీఎస్పీ 14వ బెటాలియన్‌కు చెందిన ఆయన ప్రస్తుతం ఎర్రచందనం స్మగ్లింగ్‌ నివారణ యూనిట్‌లో పనిచేస్తున్నారు. గణేశ్‌కు భార్య అనూష, కుమారులు రాజ్‌కిశోర్‌, వేదాంత్‌ ఉన్నారు. గణేశ్‌ మృతదేహాన్ని మంగళవారం రాత్రి ధర్మవ రానికి తెస్తారు. గుట్టకిందపల్లి వద్ద పోలీసు లాంఛనాలతో బుధవారం అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

జగన్‌ పాలనలో పోలీసులకూ భద్రత లేదు: బాబు

అమరావతి, ఫిబ్రవరి 6(ఆంధ్రజ్యోతి): ఎర్రచందనం స్మగ్లర్లకు టికెట్లు ఇచ్చే జగన్‌రెడ్డి ప్రభుత్వంలో పోలీసులకూ భద్రత లేదని టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఎర్రచందనం దొంగల చేతిలో పోలీస్‌ కానిస్టేబుల్‌ చనిపోవడంపై ఆయన విచారం వ్యక్తం చేశారు. కాగా, ఎర్రచందనం స్మగ్లర్లను పార్టీ అభ్యర్థులుగా ప్రకటించిన జగన్‌రెడ్డి రెడ్‌ శాండిల్‌ స్మగ్లింగ్‌కు గ్రీన్‌ చానల్‌ ఏర్పాటు చేశాడని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ ఆరోపించారు. జగన్‌ పాలన ఎర్రచందనం స్మగ్లర్ల పాలిట స్వర్ణయుగమైందని లోకేశ్‌ వ్యాఖ్యానించారు.

Updated Date - Feb 07 , 2024 | 04:41 AM