Share News

AP: కోస్తాంధ్ర జిల్లాల్లో జోరుగా కోడి పందేలు, గుండాటలు

ABN , Publish Date - Jan 15 , 2024 | 09:14 AM

సంక్రాంతి ఉత్సవాల్లో పలు జిల్లాల్లో కోడి పందేల పోలీసుల సాక్షిగా జోరుగా హుషారుగా సాగుతున్నాయి. పందెం రాయుళ్లు జాతరలా తరలివస్తూనే ఉన్నారు. మెజారిటీ బరులు వైసీపీ నేతల అండతో ఏర్పాటు కావడంతో ఎలాంటి ఆంక్షలూ ఆటంకాల్లేకుండా పందేలు జరుగుతున్నాయి.

AP: కోస్తాంధ్ర జిల్లాల్లో జోరుగా కోడి పందేలు, గుండాటలు

తొలిరోజు రూ.వెయ్యి కోట్ల వరకు పందేల అంచనా

తెలంగాణ నుంచీ భారీగా తరలివచ్చిన ఔత్సాహికులు

వైసీపీ నేతల కనుసన్నల్లోనే పందేలు

పశ్చిమలోనే 200 బరులు.. కోట్లలో పందేలు

అమిరాంలో ఒక్క పందేనికి రూ.50 లక్షలు

పలు బరుల్లో రూ.25 లక్షలుంటేనే లోపలికి..

అక్కడే పేకాటలు.. ఏరులై పారిన మద్యం

కోస్తాంధ్ర జిల్లాల్లో కోడి పందేలు, గుండాటల జోరు.. వైౖసీపీ నేతల కనుసన్నల్లోనే పందేలు

(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌)

సంక్రాంతి ఉత్సవాల్లో పలు జిల్లాల్లో కోడి పందేల పోలీసుల సాక్షిగా జోరుగా హుషారుగా సాగుతున్నాయి. పందెం రాయుళ్లు జాతరలా తరలివస్తూనే ఉన్నారు. మెజారిటీ బరులు వైసీపీ నేతల అండతో ఏర్పాటు కావడంతో ఎలాంటి ఆంక్షలూ ఆటంకాల్లేకుండా పందేలు జరుగుతున్నాయి. ఎక్కడికక్కడ బరులు ఏర్పాటు చేసి కోట్లలో పందేలు కాస్తున్నారు. కొన్ని బరులు 50, 100 ఎకరాలకు పైబడిన విస్తీర్ణంలో.. భారీ టెంట్లతో.. ఫ్లడ్‌ లైట్ల వెలుగుల్లో జరుగుతున్నాయి. పందేలకు వచ్చే జనంతో బరుల వద్ద కార్లు, బైక్లు వందలాదిగా కనిపిస్తున్నాయి. పందెం డబ్బులు లెక్కబెట్టడానికి సమయం కూడా లేక.. ఏకంగా నోట్ల కౌంటింగ్‌ మిషన్లు పెట్టారు. సంక్రాంతి తొలిరోజు భోగినాడు అన్ని బరుల వద్ద కోడి పందేలతోపాటు గుండాట, పేకాటలు జోరుగా సాగి లక్షలు చేతులు మారాయి. ప్రభుత్వ మద్యం దుకాణాల నుంచి బెల్టులకు.. అక్కడి నుంచి బరుల వద్ద మద్యం ఏరులై పారింది. ముఖ్యంగా ఉమ్మడి గోదారి, ఉమ్మడి కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో జరిగిన పందేలకు తెలంగాణ జిల్లాల నుంచి భారీ సంఖ్యలో ఔత్సాహికులు వచ్చి లక్షల్లో పందేలు కాసి ఎంజాయ్‌ చేశారు. కొన్ని బరుల వద్ద ప్రవేశ రుసుముగా వెయ్యి పైనే టికెట్‌ పెట్టి లోనికి అనుమతిస్తున్నారు. పండగ మూడు రోజులూ పందేలు, గుండాటలు ఉంటాయి కనుక.. రేయింబవళ్లూ నిరాటంకంగా నిర్వహించేందుకు అన్ని చోట్లా ఫ్లడ్‌ లైట్లు, విద్యుత్‌ లైట్లు ఏర్పాటు చేశారు. ఓవైపు సంక్రాంతి ఉత్సవాల్లో కోడి పందేలు, ఇతర జూదాల నిర్వహణను అడ్డుకోవాలని హైకోర్టు ఆదేశించినా అధికార పార్టీ నేతల ఒత్తిడితో పోలీసులు పూర్తిగా చేతులెత్తేశారు.

బరులను ప్రారంభించిన వైసీపీ ఎమ్మెల్యేలు

కోనసీమ జిల్లాలోని మలికిపురం, లక్కవరంలో రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు కోడిపందేలను, గుండాటలను ప్రారంభించారు. కొత్తపేట ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ చిర్ల జగ్గిరెడ్డి రావులపాలెం మండలం వెదిరేశ్వరం, రావులపాడుల్లో బరులను ప్రారంభించి పందేల్లో పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలులో కోడి పందేలను వైసీపీ ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణరెడ్డి ఆదివారం ప్రారంభించారు. ఆత్రేయపురం మండలం వసంతవాడ, కొత్తపేట పరిసర ప్రాంతాల్లో జరిగిన కోడిపందేలను తిలకించారు. అల్లవరం మండలం గోడిలోని బరుల్లో కోడి పందేలను వైసీపీకి చెందిన అమలాపురం ఎంపీ చింతా అనురాధ, ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్‌, బీజేపీ జిల్లా అధ్యక్షుడు యాళ్ల దొరబాబు వీక్షించారు. మిగిలిన ప్రాంతాల్లోనూ వైసీపీ ప్రజాప్రతినిధుల ఆదేశాలతో పోలీసులు షరా ‘మూలూలు’గా స్టేషన్లకే పరిమితమయ్యారు. అంబేడ్కర్‌ కోనసీమ జిల్లావ్యాప్తంగా వందకు పైగానే కీలక బరులు ఏర్పాటయ్యాయి. తొలి రోజు సుమారు రూ.30 కోట్ల మేర లావాదేవీలు జరిగినట్టు సమాచారం. బరుల వద్ద సీఎం జగన్‌తో పాటు ఆయా ప్రాంతానికి చెందిన ప్రజాప్రతినిధుల ఫొటోలతో కూడిన ఫ్లెక్సీలను భారీగా ఏర్పాటు చేశారు. కాట్రేనికోన మండలం గెద్దనపల్లి, చెయ్యేరుల్లో మెగా బరులు ఏర్పాటు చేశారు. తొలి రోజు 20కిపైగా పందేలు జరగగా, లక్షల రూపాయలు చేతులు మారాయి. అమలాపురం, రామచంద్రపురం, మండపేటలో ఐదేసి బరుల వరకు ఏర్పాటు చేశారు. కాట్రేనికోన మండలం వేట్లపాలెంలోను, అమలాపురం రూరల్‌ మండలం కామనగరువు శివారు ఢిల్లీ పబ్లిక్‌ స్కూలు వద్ద రెండు బరుల్లోను యువకుల మధ్య ఘర్షణ తలెత్తి ఉద్రిక్తతలకు దారితీసింది.


బాపట్లలో పోలీసులకు సవాల్‌

బాపట్ల జిల్లాలో అధికారపార్టీ నేతలు ఎక్కడికక్కడ బరులు ఏర్పాటు చేసి పోలీస్‌లకు సవాల్‌ విసిరారు. దీంతో కోడి పందేలను కట్టడి చేస్తామని సంక్రాంతి పండగకు పదిరోజుల ముందు నుంచే బాపట్ల జిల్లా పోలీసులు హడావుడి చేసినా తీరా ఆ సమయం వచ్చేసరికి చేతులెత్తేశారు. కొల్లూరు మండలం పెసర్లంక శివారులో వైసీపీ నేతల సారథ్యంలో కోడి పందేలు భారీ ఎత్తున నిర్వహిస్తున్నారు. ఏకంగా తాత్కాలిక టోల్‌ ఫీజు వసూలుకు తెరలేపారు. ప్రశ్నించిన వారిపై కూడా దాడికి తెగబడ్డారు. భట్టిప్రోలు మండలం ఓలేరు వద్ద జోరుగా కోడి పందేలు నిర్వహించారు. పల్లెకోన, ఇంటూరు, వరాహపల్లి ఇలా తీర ప్రాంత పరిధిలో పలు చోట్ల యథేచ్ఛగా కోడి పందేలు జరిగాయి. రేపల్లె నియోజకవర్గం పరిధిలోని నిజాంపట్నంలో పెద్ద ఎత్తున బరులు ఏర్పాటు చేయడం పొరుగు జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో పందెం రాయుళ్లు తరలివచ్చారు. వేమూరు నియోజకవర్గ పరిఽధిలో బరులు పెద్ద ఎత్తున రాత్రికి రాత్రే సిద్ధం చేసేశారు. రాజమహేంద్రవరం రూరల్‌ మండలం పిడింగొయ్యి గ్రామంలో ప్రధాన రోడ్డు పక్క భారీ బరి ఏర్పాటు చేశారు. ఇక్కడ ఓ గేటు పెట్టి రూ.1,000 టికెట్‌ కొనుక్కున్నవారినే లోపలికి అనుమతిస్తున్నారు. కాకినాడ, ఉమ్మడి కృష్ణా జిల్లాల్లో తొలిరోజు వందేసి కోట్లు పైబడి చేతులు మారినట్లు అంచనా. కాకినాడ రూరల్‌ మండలంలోని సర్పవరం వద్ద భారీ బరి ఏర్పాటు చేయగా, కోడి పందేలపై లక్షల్లో బెట్టింగ్‌లు కాశారు. ఏలూరు జిల్లాలోని ఏలూరు రూరల్‌, దెందులూరు, పెదవేగి, పెదపాడు, గుడివాకలంక, పత్తికోళ్లలంక, పైడి చింతపాడు, కైకలూరు, కలిదిండి, జంగారెడ్డిగూడెం, నూజివీడు, చాటపర్రు, చాట్రాయి. ముదినేపల్లి మండలంలోని దేవపూడిలో జరిగిన పందేల నిర్వహణలో ఇరువర్గాల మధ్య ఘర్షణలో పలువురు గాయపడ్డారు.

పశ్చిమలో 200 బరులు..

పశ్చిమగోదావరి జిల్లాలో దాదాపు 200 బరుల్లో పందేలు నిర్వహించారు. నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు సంప్రదాయ డింకీ కోడి పందేలను ప్రారంభించారు. ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌, ఉండి మాజీ ఎమ్మెల్యే వేటుకూరి శివరామరాజు పందేల్లో పాల్గొన్నారు. ఉండి నియోజకవర్గం పెదఅమిరంలో ఒక్కో పందానికి రూ.50 లక్షల వంతున కాశారు. ఆ ఒక్క బరిలోనే కోట్లు చేతులు మారాయి. సీసలిలోనూ బరిలోకి కోడి పుంజు తెచ్చుకోవాలంటే ఒక్క పందెంలోనే రూ.25 లక్షలు బెట్టింగ్‌ వేయాలి. పెదఅమిరంలో పందాల్లో పాల్గొనడానికి ప్రవేశ టికెట్‌ను నిర్ణయించారు.

Updated Date - Jan 15 , 2024 | 09:14 AM