Share News

CM YS Jaganmohan Reddy : చేతకాక.. చేయలేక!

ABN , Publish Date - Feb 07 , 2024 | 04:35 AM

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డికి... ఇప్పుడు, ఎన్నికల ముందు అకస్మాత్తుగా విభజన కష్టాలు, ప్రత్యేక హోదా, రెవెన్యూ లోటు వంటి అంశాలు గుర్తుకొస్తున్నాయి

CM YS Jaganmohan Reddy : చేతకాక.. చేయలేక!

అసెంబ్లీ సాక్షిగా జగన్‌ వింత వాదనలు

ఎన్నికల ముందు గుర్తుకొచ్చిన ‘హోదా’

కేంద్రంలో ఎవరికీ మెజారిటీ రాకూడదనే ‘షరతు’

విపక్షంలో ఉండగా మెడలు వంచేస్తానని గర్జన

అధికారంలోకి రాగానే కేంద్రంతో ములాఖత్‌

హైదరాబాద్‌ వంటి నగరం లేదని ఆవేదన

విశాఖపట్నం నుంచి ఐటీని తరిమేసిందీ ఆయనే

తన హయాంలో ఆర్థిక సంఘం నిధులు రాలేదట

మరి.. కేంద్రాన్ని ఎందుకు గట్టిగా అడగలేదు?

చేసిన అప్పులపైనా అదే తప్పుడు వాదన

హామీలన్నీ నెరవేర్చామంటూ మాయ మాటలు

(అమరావతి - ఆంధ్రజ్యోతి)

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డికి... ఇప్పుడు, ఎన్నికల ముందు అకస్మాత్తుగా విభజన కష్టాలు, ప్రత్యేక హోదా, రెవెన్యూ లోటు వంటి అంశాలు గుర్తుకొస్తున్నాయి. గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మంగళవారం అసెంబ్లీలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. బుధవారం ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ ప్రవేశ పెడతామని, మళ్లీ అధికారంలోకి వచ్చి పూర్తిస్థాయి బడ్జెట్‌ తీసుకొస్తామని చెప్పారు. తన గొప్పలు చెప్పుకొంటూ... చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. స్వయానా ముఖ్యమంత్రే ప్రసంగిస్తున్న ఆ సమయంలో... సభలో సుమారు 95 మంది సభ్యులు మాత్రమే ఉండటం గమనార్హం. ఈ సందర్భంగా జగన్‌ అనేక అంశాలపై తనదైన శైలిలో, చిత్రవిచిత్రమైన వాదనలు చేశారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా... కేంద్రంతో ఒక్క అంశంపైనా పోరాడిందీ లేదు, గట్టిగా నిలదీసిందీ లేదు. ఢిల్లీ యాత్రల ద్వారా సాధించిందేమిటో ఎవరికీ తెలియదు. ప్రత్యేక హోదా నుంచి నిధుల సాధన దాకా అసెంబ్లీలో జగన్‌ చెప్పిందేమిటి... ఆయన అసలు వైఖరి, వాస్తవాలు ఏమిటి...

తమరేం చేస్తున్నట్లు?

ముఖ్యమంత్రి: చంద్రబాబు హయాంలో ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు కేంద్రం నుంచి వచ్చిన నిధులు... మా హయాంలో అందలేదు.

అడిగిందేదీ: ఆర్థిక సంఘం సిఫారసు మేరకు రాష్ట్రాలకు నిధులు ఇవ్వాల్సిందే. చంద్రబాబు ఎప్పుడు ఢిల్లీకి వెళ్లినా... రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి అడిగి, సాధించుకునే వారు. నిబంధనల ప్రకారం నిధులు రాలేదని వాపోతున్న జగన్‌... వాటిని తెచ్చుకునేందుకు ఏం చేసినట్లు? కేంద్రం అడక్కముందే అన్ని అంశాలపైనా మద్దతిస్తున్న ఆయన... రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏం సాధించినట్లు?

అప్పులపైనా తప్పుడు లెక్కలే!

ముఖ్యమంత్రి: విభజన నాటికి రూ.1.53 లక్షల కోట్లు అప్పు ఉంటే, చంద్రబాబు దిగిపోయే సమయానికి రూ.4.12 లక్షల కోట్లకు చేరింది. చంద్రబాబు హయాంలో అప్పులు 21.87 శాతం పెరుగుదల ఉంటే... మా ప్రభుత్వ హయాంలో అప్పుల పెరుగుదల కేవలం 12 శాతమే.

అసలు విషయం: ‘అప్పుల పెరుగుదల శాతం’ అంటూ జగన్‌ మళ్లీ మళ్లీ మాయ లెక్కలు చెప్పారు. ఆయన మాట ప్రకారమే చూసుకుంటే... చంద్రబాబు హయాంలో కొత్తగా చేసిన అప్పు... రూ.2.59 లక్షల కోట్లు. రాష్ట్ర విభజన నాటికి వచ్చిన వాటాతో కలిపితే అది 4.12 లక్షల కోట్లు! ఇక... జగన్‌ ఈ ఒక్క ఆర్థిక సంవత్సరంలోనే ఆర్బీఐ నుంచి మాత్రమే రూ.60వేలకోట్లకు పైగా అప్పు తెచ్చారు. మొత్తం ఐదేళ్లలో ఆర్బీఐ, కార్పొరేషన్లు, ఇతరత్రా మార్గాల్లో ఎడాపెడా అప్పులు తెచ్చారు. ఇది కాదని... భారీగా పెండింగ్‌ బిల్లులు! వెరసి... జగన్‌ హయాంలో రాష్ట్ర రుణ భారం దాదాపు రూ.10 లక్షల కోట్లకు చేరుకుంది. మరి... ఎవరు ఎక్కువ అప్పులు చేసినట్లు?

హోదాపై ఉత్తుత్తి బాధ

ముఖ్యమంత్రి: ప్రత్యేక హోదా ఎండమావిగా మారింది. హోదా అంశాన్ని చట్టంలో పెట్టించి ఉన్నా... కోర్టుల్లో దాన్ని సాధించుకునేవాళ్లం. అందుకే కేంద్రంలో ఏ పార్టీకీ పూర్తి మెజారిటీ రావొద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.

మాట మడత: విపక్షంలో జగన్‌ ఊరూరా ‘హోదా’ పేరుతో హోరెత్తించారు. కేంద్రం మెడలు వంచి హోదా సాధిస్తామన్నారు. కానీ... అధికారంలోకి రాగానే, మాట మడతేశారు. ‘ఏం చేద్దాం... దేవుని దయ లేదు. కేంద్రంలో ఏర్పడిన ప్రభుత్వానికి మన అవసరం లేకుండా పోయింది’ అని ముఖ్యమంత్రిగా తాను మాట్లాడిన తొలి (అదే చివరిది కూడా) ప్రెస్‌మీట్‌లోనే తేల్చేశారు. ఇప్పుడు మళ్లీ అదే మాట చెబుతుండటం గమనార్హం. రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలంటే... కేంద్రంలో ఏ పార్టీకీ మెజారిటీ రాకూడదట! ఈ మాత్రానికి ‘మెడలు వంచుతాం’... అనే బీరాలు ఎందుకు పలికినట్లు?

ఇదేనా పారదర్శకత?

ముఖ్యమంత్రి: 57 నెలల మన ప్రయాణంలో ఎక్కడా అవినీతికి తావివ్వలేదు. లంచాలు, వివక్ష లేకుండా పారదర్శక పాలన చేశాం.

అంతులేని గోప్యత: ‘పారదర్శక’ పాలన చేశామని జగన్‌ చెప్పడం పెద్ద జోక్‌! జీవోలను ప్రజలకు అందుబాటులో లేకుండా చేశారు. ఇసుక టెండర్లు ఎవరు దక్కించుకున్నారో, ఎవరు తవ్వుకుంటున్నారో పెద్ద మిస్టరీ. బరైటీస్‌ తవ్వకాలదీ అదే పరిస్థితి. అస్మదీయులైన కొందరికి మాత్రమే బిల్లుల చెల్లింపు! మద్యం పాలసీ మరో భారీ స్కామ్‌!

విశాఖను ఉద్ధరించారా?

ముఖ్యమంత్రి: రెవెన్యూ లోటుకు మూలకారణం మనకు హైదరాబాద్‌ లాంటి నగరం లేకపోవడమే. పెద్ద నగరం ఉంటే మన సంపద పెరుగుతుంది. అందుకే నేను పదేపదే విశాఖపట్నం అంటున్నాను.

ఏం చేసినట్లు: హైదరాబాద్‌లాంటి నగరం ఏపీకి లేదనే విషయం జగన్‌కు ఇప్పుడే గుర్తుకొచ్చినట్లుంది! పైగా... ఆయన పదేపదే ‘విశాఖపట్నం’ అంటున్నది అందుకేనట! మరి... విశాఖను ఉద్ధరించేందుకు ఈ ఐదేళ్లలో ఆయన చేసిందేమిటి? ఉన్న ఐటీ పరిశ్రమలను తరిమేయడం, కొత్తగా ఏమీ తేలేక పోవడం, రుషికొండకు గుండు కొట్టడం, పెట్టుబడిదారులు అటువైపు రాకుండా భయపెట్టడం... ఇదేనా విశాఖను ఉద్ధరించడం?’

ఇవన్నీ చేసేశారా?

ఇచ్చిన హామీల్లో 99% నెరవేర్చామని అసెంబ్లీ సాక్షిగా జగన్‌ చెప్పారు. మరి...ఇవన్నీ చేశారా!?

2020నాటికే పోలవరం పూర్తిచేస్తామన్నారుగా?

ఏటా జనవరిలో జాబ్‌ క్యాలెండర్‌ అన్నారుగా?

పదివేల పోస్టులతో మెగా డీఎస్సీ... ఇచ్చేశారా?

అధికారం చేపట్టిన వారం రోజుల్లోనే సీపీఎ్‌స రద్దు చేస్తానన్నారుగా?

మద్య నిషేధం తెచ్చాకే ఓట్లు అడుగుతానన్నారుగా?

కడప స్టీల్‌ ప్లాంట్‌ వచ్చేసిందా?

అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేశారా?

అధికారంలోనికి వస్తే.. విద్యుత్తుచార్జీలను పెంచం’...అన్నారుకదా!?మరి...తొమ్మిదిసార్లు చార్జీ లు పెంచి, జనంపై 64వేలకోట్ల భారం వేయలేదా?

Updated Date - Feb 07 , 2024 | 04:47 AM