Share News

సీఎం జగన్‌ను ప్రతివాదిగా కొనసాగించాల్సిందే!

ABN , Publish Date - Feb 13 , 2024 | 02:27 AM

తాను దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంలో ముఖ్యమంత్రి జగన్‌ను ప్రతివాదిగా కొనసాగించాల్సిన అవసరం ఎంతైనా ఉందని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు హైకోర్టును కోరారు.

సీఎం జగన్‌ను ప్రతివాదిగా కొనసాగించాల్సిందే!

ప్రభుత్వ విధాన నిర్ణయాలన్నీ ఆయనవే

వాటిద్వారా భారీగా లబ్ధి పొందిందీ ఆయనే

ప్రతివాదిగా తొలగించాలన్నఅభ్యర్థన కొట్టివేయండి

హైకోర్టులో ఎంపీ రఘురామ రిప్లయ్‌ కౌంటర్‌

అది మొన్న రాత్రే అందిందన్న సీఎం తరఫు న్యాయవాది

విచారణ ఎల్లుండికి వాయిదా

అమరావతి, ఫిబ్రవరి 12 (ఆంధ్రజ్యోతి): తాను దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంలో ముఖ్యమంత్రి జగన్‌ను ప్రతివాదిగా కొనసాగించాల్సిన అవసరం ఎంతైనా ఉందని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు హైకోర్టును కోరారు. తన హోదాను దుర్వినియోగం చేసి ఆయన వ్యక్తిగత లబ్ధి పొందారని పేర్కొన్నారు. కీలక విధాన నిర్ణయాలన్నీ ఆయనవేనని, భారీగా లబ్ధి పొందింది కూడా ఆయనేనని.. అందువల్ల తనను ప్రతివాదిగా తొలగించాలన్న అభ్యర్థనను తిరస్కరించాలని విజ్ఞప్తి చేశారు. సీఎం జగన్‌, ఆయన ఆప్తులకు అనుచిత లబ్ధి చేకూర్చేలా వైసీపీ ప్రభుత్వం రూపొందించిన వివిధ పాలసీలు, తీసుకున్న నిర్ణయాలపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని.. ముఖ్యమంత్రి, బంధుగణంపై క్రిమినల్‌ కేసులు నమోదు చేసి, కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు నిర్వహించాలని కోరుతూ రఘురామకృష్ణంరాజు హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్‌) దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాజ్యం ఇటీవల విచారణకు రాగా.. దాని విచారణార్హతపై రాష్ట్రప్రభుత్వం అభ్యంతరం తెలిపింది. దీంతో పిల్‌ విచారణార్హతను తేలుస్తామని ధర్మాసనం పేర్కొంది. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. విచారణార్హత పై కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశించింది. సోమవారం ఈ వ్యాజ్యం విచారణకు రాగా.. రఘురామ తరఫు సీనియర్‌ న్యాయవాది ఉన్నం మురళీధరరావు స్పందిస్తూ.. వ్యాజ్యంలో మెజారిటీ ప్రతివాదులు కౌంటర్లు వేశారని.. వాటికి తాము కూడా రిప్లయ్‌ కౌంటర్‌ దాఖలు చేశామని తెలిపారు. వాదనలు వినిపించేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు. జగన్‌ తరఫు న్యాయవాది వివేక్‌ చంద్రశేఖర్‌ స్పందిస్తూ.. పిటిషనర్‌ దాఖలు చేసిన రిప్లయ్‌ కౌంటర్‌ తమకు ఆదివారం రాత్రి 10 గంటలకు అందిందని, దానిని పరిశీలించి వాదనలు వినిపించేందుకు సమయం ఇవ్వాలని కోరారు. అందుకు అంగీకరించిన ధర్మాసనం విచారణను గురువారాని(15వ తేదీ)కి వాయిదా వేసింది. ఈ మేరకు జస్టిస్‌ యు.దుర్గాప్రసాదరావు, జస్టిస్‌ మండవ కిరణ్మయితో కూడిన ధర్మాసనం ఆదేశాలిచ్చింది. ఆ రోజు సదరు పిల్‌ విచారణార్హతపై వాదనలు వింటామని స్పష్టం చేసింది.

రఘురామ కౌంటర్‌లో ఏముందంటే..

‘రాజకీయ దురుద్దేశంతో పిల్‌ దాఖలు చేశానన్న ఆరోపణల్లో వాస్తవం లేదు. లోక్‌సభ సభ్యత్వానికి నన్ను అనర్హుడిగా ప్రకటించాలని వైసీపీ.. స్పీకర్‌ ఫిర్యాదు చేయడం నిజమే. రాజ్యాంగంలోని పదో షెడ్యూల్‌ నిబంధనలు నాకు వర్తించనందునే స్పీకర్‌ ఇప్పటివరకు అనర్హతపై నిర్ణయం తీసుకోలేదు. జగన్‌ నన్ను శత్రువుగా చూస్తున్నారు తప్ప.. నేనెప్పుడూ ఆయన్ను శత్రువుగా చూడలేదు. రాజ్యాంగంలోని అధికరణ 19(1) ప్రకారం అసమ్మతి తెలియపరచడం ప్రాథమిక హక్కు. జగన్మోహన్‌రెడ్డి బెయిల్‌ రద్దు చేయాలని తెలంగాణ హైకోర్టులో నేను పిటిషన్‌ దాఖలు చేసింది నిజమే. ఆయన 11 సీబీఐ, 7 ఈడీ కేసుల్లో ప్రథమ నిందితుడిగా ఉన్నారు. ప్రస్తుతం బెయిల్‌పై ఉన్న ఆయన కేసుల విచారణకు హాజరుకావడం లేదు. కేసుల్లో సహచర నిందితులుగా ఉన్న అధికారులు, వ్యక్తులను ప్రస్తుత ప్రభుత్వ పరిపాలనలో భాగస్వాములను చేసి కీలక పదవులు కట్టబెట్టారు. ఇది సాక్షులను ప్రభావితం చేయడం తప్ప మరొకటి కాదు. వాస్తవాలు దాచి పిల్‌ దాఖలు చేశానన్న ఆరోపణల్లో నిజం లేదు. ప్రస్తుత కేసు విచారణ నిమిత్తం అవసరమైన.. నాపై నమోదైన కేసుల వివరాలను వెల్లడించాను. పిల్‌ రూల్స్‌ ప్రకారం పెండింగ్‌ కేసులన్నిటినీ ప్రస్తావించాల్సిన అవసరం లేదు. ఈ నేపథ్యంలో పిల్‌ విచారణార్హతపై ప్రాథమిక అభ్యంతరాలు లేవనెత్తుతూ ముఖ్యమంత్రి వేసిన కౌంటర్‌ను కొట్టివేయండి’ అని రఘురామ తన రిప్లయ్‌లో కోరారు.

Updated Date - Feb 13 , 2024 | 09:16 AM