ఈవీఎంలపై సందేహాల నివృత్తి
ABN , Publish Date - Mar 06 , 2024 | 04:02 AM
రాష్ట్రంలో త్వరలో జరగనున్న సాధారణ ఎన్నికల నేపథ్యంలో ఎలకా్ట్రనిక్ ఓటింగ్ యంత్రాల నిర్వహణ,

ఈసీఐఎల్ బృందం వర్చువల్ శిక్షణ
అమరావతి, మార్చి 5 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో త్వరలో జరగనున్న సాధారణ ఎన్నికల నేపథ్యంలో ఎలకా్ట్రనిక్ ఓటింగ్ యంత్రాల నిర్వహణ, వాటి వినియోగంలో నోడల్ అధికారులు ఎదుర్కొంటున్న సందేహాలను, సమస్యలను హైద్రాబాద్ నుంచి ఆన్‌లైన్ ద్వారా ఈసీఐఎల్ అధికారుల బృందం సభ్యులు నివృత్తి చేశారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం ఆధ్వర్యంలో మంగళవారం అమరావతి సచివాలయంలో రెండో విడత శిక్షణ కార్యక్రమం జరిగింది. అదనపు ప్రధాన ఎన్నికల అధికారి హరేంద్ర ప్రసాద్ నేతృత్వంలో జరిగిన ఈ శిక్షణా కార్యక్రమంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు చెందిన ఈవీఎం నోడల్ అధికారులు, సాంకేతిక సహాయకులు ప్రత్యక్షంగాను అరుణాచలప్రదేశ్, ఒడిసా, సిక్కిం రాష్ట్రాలకు చెందిన అధికారులు ఆన్‌లైన్ ద్వారా పాల్గొన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 9న జరిగిన మొదటి విడత శిక్షణా కార్యక్రమంలో ఎలకా్ట్రనిక్ ఓటింగ్ యంత్రాల నిర్వహణ వాటి వినియోగంపై సమగ్ర అవగాహన కల్పించారు. అయితే క్షేత్ర స్థాయిలో ఈవీఎంల వినియోగంలో అధికారులకు, సాంకేతిక సహాయకులకు ఎదురైన సమస్యలు, సందేహాలను నివృత్తిపర్చేందుకు నెల రోజుల తదుపరి రెండో విడత శిక్షణ నిర్వహించారు. జిల్లాల వారీగా ఈవీఎం నోడల్ అధికారులు, సాంకేతిక సహాయకులు అడిగిన పలు సందేహాలకు, సమస్యలకు ఈసీఐఎల్ అధికారుల బృందం సభ్యులు సీనియర్ డీజీఎం ఏపీ రాజు, ఇంజనీర్ సీజీ ఆదిత్య సమగ్రమైన వివరణ ఇచ్చారు.