Share News

ఎన్‌డీఏ కూటమితోనే వర్గీకరణ

ABN , Publish Date - May 03 , 2024 | 01:45 AM

కేంద్రంలో, రాష్ట్రంలో ఎన్‌డీఏ కూటమి ప్రభుత్వాలు అధికారంలోకి వస్తేనే ఏబీసీ ఎస్సీ వర్గీకరణ సాధ్యమని ఎంఆర్‌పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ అన్నారు.

ఎన్‌డీఏ కూటమితోనే వర్గీకరణ

ఎర్రగొండపాలెం, మే 2 : కేంద్రంలో, రాష్ట్రంలో ఎన్‌డీఏ కూటమి ప్రభుత్వాలు అధికారంలోకి వస్తేనే ఏబీసీ ఎస్సీ వర్గీకరణ సాధ్యమని ఎంఆర్‌పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ అన్నారు. ఎర్రగొండపాలెంలో ఎన్‌డీఏ కూటమి అభ్యర్థి గూడూరి ఎరిక్షన్‌బాబు విజయం కోసం గురువారం ఎర్రగొండపాలెంలో టీడీపీ ప్రచార ర్యాలీలో ఆయన పాల్గొని మాట్లాడారు. ముందుగా టీడీపీ కార్యాలయం నుంచి అంబేడ్కర్‌ బొమ్మ కూడలి, త్రిపురాంతకం రోడ్లపై ప్రచారం చేశారు. ఎంఆర్‌పీఎస్‌ కార్యకర్తలు ఎన్‌డీఏ కూటమి అసెంబ్లీ, ఎంపీ అభ్యర్థులకు సైకిల్‌ గుర్తుపై ఓట్లు వేసి గెలిపించాలని పిలుపునిచ్చారు. 1999 నుంచి 2004 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్న సమయంలో అసెంబ్లీలో వర్గీకరణ బిల్లును ఆమోదించి కేంద్రానికి పంపించారని గుర్తు చేశారు. రాష్ట్రం ఏబీసీ వర్గీకరణ అమలు చేయడం వలన ఐదేళ్లలో 22వేల మాదిగ యువతి, యువకులకు ఉద్యోగా లు దక్కాయని గుర్తు చేశారు. 2004 తర్వాత కాంగ్రెస్‌ ముఖ్యమంత్రిగా ఉన్న రాజశేఖరరెడ్డి తనకు పదవి ఇచ్చి ఉద్యమాన్ని నీరుగార్చాలని చూశారన్నారు. వైసీపీ స్థాపించిన సమయంలో జగన్మోహన్‌రెడ్డి కలసి వర్గీకరణ బిల్లుకు సహాయం చేయమని అడిగామన్నారు. అయితే వైసీపీకి మద్దతు ఇస్తే రాజ్యసభ ఇస్తానని చెప్పి, తనను మభ్యపెట్టి ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నం చేశారని అన్నారు. ఎవరు ఎన్ని ప్రలోబాలు పెట్టిన మాదిగ జాతి బిడ్డల భవిష్యత్‌కోసం 1994లో స్థాపించిన ఎంఆర్‌పీఎస్‌ ఉద్యమాన్ని మొక్కవోని దీక్షతో కొనసాగిస్తున్నామన్నారు. దేశప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎంఆర్‌పీఎస్‌ కార్యకర్తగా పనిచేయాలని ఉందని హైదరాబాద్‌ సభలో అన్నారని, ఎంఆర్‌పీఎస్‌ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు వ్యాపించిందని అన్నారు. రాష్ట్రంలో జగన్‌ను ఇంటికి పంపించి, చంద్రబాబునాయుడిని ముఖ్యమంత్రిని చేస్తేనే మాదిగ బిడ్డలతో పాటు అన్ని వర్గాల పేదప్రజలకు విద్యా, ఉద్యోగ అవకాశాలు మెరుగు పడతాయన్నారు. ఎర్రగొండపాలెం ఎమ్మెల్యేగా గూడూరి ఎరిక్షన్‌బాబును గెలిపిస్తే, చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారని అన్నారు. రాష్ట్రంలో 29 ఎస్సీ రిజర్వుడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే కూటమిలో బీజేపీ, జనసేనకు పోను మిగిలిన 25 అసెంబ్లీ స్థానాలలో 19 మంది మాదిగలకు చంద్రబాబు ఎమ్మెల్యే అభ్యర్థులుగా సీట్లు ఇచ్చారని, వారంతా పోటీలో ఉన్నారని అన్నారు. వైసీపీ పార్టీ కేవలం 10 మందికి మాత్రం ఎమ్మెల్యే సీట్లు ఇచ్చిందన్నారు. టీడీపీ అభ్యర్థి గూడూరి ఎరిక్షన్‌బాబు మాట్లాడుతూ.., మే 13 జరిగే పోలింగ్‌ రోజున ఎంఆర్‌పీఎస్‌, మాదిగ దండోర కార్యకర్తలు సైకిల్‌గుర్తుపై ఓట్లు వేసి గెలిపించాలని అభ్యర్థిం చారు. మార్కాపురం జిల్లా ఏర్పాటు, వెలిగొండ ప్రాజెక్టు నీటి విడుదల బాధ్యతను టీడీపీ తీసుకుంటుందన్నారు. కార్యక్రమంలో జడ్పీ మాజీ ఉపాధ్యక్షులు డాక్టరు మన్నె రవీంద్ర, ఎంఆర్‌పీఎస్‌ జాతీయ అధ్యక్షులు డాక్టరు ము న్నంగి నాగరాజు, జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆదిమూలం ప్రకాష్‌, జిల్లా అధికార ప్రతినిధి వినయ్‌, సీనియర్‌ నాయకులు చేదూరి గంగయ్య, కొదమల జిన్నా, నియోజకవర్గ టీడీపీ ఎస్సీ సెల్‌ ఉపాధ్యక్షులు లింగాల అ బ్రహాం మాజీ జడ్పీటీసీ జడ్డారవి, వెంగయ్య పాల్గొన్నారు.

సేవకుడిని ఆదరించండి

పెద్దదోర్నాల : ఎర్రగొండపాలెం నియోజకవర్గ అభివృ ద్ధికి సేవకుడిగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్న తన తండ్రి గూడూరి ఎరిక్షన్‌బాబును ఈ ఎన్నికల్లో ఆదరించా లని ఆయన తనయ చల్సియా, తనయుడు అజిత్‌లు ఓటర్లను అభ్యర్ధించారు. స్థానిక సుందరయ్య కాలనీలో గురువారం ప్రచారం చేశారు. మూడేళ్లగా ఈ ప్రాంతంలో తమ తండ్రి ఎరిక్షన్‌బాబు పర్యటిస్తున్నారని అందరిలో కలిసిపోయారన్నారు. ప్రజా సమస్యల అవగాహన ఉన్న తమ తండ్రిని గెలిపిస్తే వారికి మేలు జరుగుతుందన్నారు. టీడీపీ ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డికి, ఎమ్మెల్యే అభ్యర్థి ఎరిక్షన్‌బాబుకు సైకిల్‌ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. కార్యక్రమంలో మండల అధ్యక్షులు ఏర్వ మల్లికార్జునరెడ్డి, నాయకులు షేక్‌ మాబు, దొడ్డా శేషాద్రి, ఈదర మల్లయ్య, దేసు నాగేంద్రబాబు, చంటి, కే.శ్రీనివాసులు, షేక్‌ ఇస్మాయిల్‌, భాష, ఎలకపాటి చెంచయ్య, కే సుబ్బారెడ్డి, బట్టు సుధాకర్‌ రెడ్డి పాల్గొన్నారు.

టీడీపీ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం

త్రిపురాంతకం : వచ్చే ఎన్నికల్లో సైకిల్‌ గుర్తుపై ఓటు వేసి తనను, ఎంపీ అభ్యర్థి మాగుంటను గెలిపించాలని, టీడీపీ ప్రభుత్వం రాగానే నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ముందుంచుతామని వై.పాలెం నియోజకవర్గ ఎన్‌డీఏ కూటమి అభ్యర్థి గూడూరి ఎరిక్షన్‌బాబు అన్నారు. మండలంలోని నడిగడ్డ, దూపాడు గ్రామాల్లో మండల టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులతో కలిసి సూపర్‌ సిక్స్‌ పథకాలపై ప్రచారం చేశారు. ఈ సందర్బంగా గ్రామాల్లో ఇంటింటికీ తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గత ఐదేళ్లలో వైసీపీ రాక్షస పాలనను సాగించిందన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీని గెలిపించుకుని రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించుకుందామని పిలుపునిచ్చారు. టీడీపీ గెలిచిన వెంటనే మార్కాపురం జిల్లా వస్తుందని, రాష్ట్రానికి కంపెనీలు వస్తాయన్నారు. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వస్తాయని వివరించారు. ఈ సందర్భంగా నడిగడ్డ గ్రామంలో వైసీపీని వీడిన 50 కుటుంబాలు టీడీపీలోకి చేరాయి. పార్టీలో చేరినవారికి ఎరిక్షన్‌బాబు టీడీపీ కండువాలు కప్పి ఆహ్వానించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఎం.వలరాజు, ఎం.శ్రీనివాసరెడ్డి, చలమయ్య, ఏ.నాసరరెడ్డి, వి.ఆంజనేయులు, వి.వెంకటేశ్వర్లు, కొల్లి వెంకటనారాయణరెడ్డి, గాయం వెంకటేశ్వరరెడ్డి, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

టీడీపీలో 50 కుటుంబాల చేరిక

ఎర్రగొండపాలెం : ఎన్నికల వేళ ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో వైసీపీ నుంచి టీడీపీలోకి 50 కుటుం బాల వారు చేరారు. వీరంతా గురువారం ఎర్రగొండపా లెం టీడీపీ కార్యాలయానికి రాగా పార్టీ కండువాలు వేసి టీడీపీ కూటమి అభ్యర్ధి గూడూరి ఎరిక్షన్‌ బాబు, డాక్టరు మన్నె రవీంద్రలు పార్టీలోకి ఆహ్వానించారు. ఎర్రగొండపాలెం మండలం గంజివారిపల్లె పంచాయతిలోని దద్దనాల గిరిజన గూడెంలో వైసీపీ నుంచి టీడీపీలోకి 25 కుటుంబాలు, పెద్దారవీడు మండలం మాచరాజుకుంటలో వైసీపీ నుంచి వార్డు సభ్యుడు జడ్డా దేవయ్య ఆధ్వర్యంలో 15 కుటుంబాలు, తంగిరాలపల్లె గ్రామంలో వైసీపీ నుంచి టీడీపీలోకి 10 కుటుంబాలు చేరాయి. కార్యక్రమంలో టీడీపీ నాయకులు కామేపల్లి వెంకటేశ్వర్లు, లింగాల అబ్రహాం, గంజి రమణారెడ్డి పాల్గొన్నారు.

Updated Date - May 03 , 2024 | 01:45 AM