Share News

గుడివాడలో హోరాహోరీ

ABN , Publish Date - May 05 , 2024 | 03:53 AM

రాష్ట్రవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్న నియోజకవర్గాల్లో కృష్ణా జిల్లాలోని గుడివాడ ఒకటి. ప్రధాన పార్టీ అభ్యర్థులిద్దరూ ఆర్థిక, అంగబలాల్లో సమాన స్థాయిలో ఉండడంతో గుడివాడ పోరు ఆసక్తి రేపుతోంది.

గుడివాడలో హోరాహోరీ

  • మాజీ మంత్రి కొడాలి నానితో వెనిగండ్ల రాము ఢీ

  • వరుసగా ఐదోసారి గెలుపుపై నాని కన్ను.. తొలి గెలుపు కోసం పక్కా వ్యూహంతో రాము

రాష్ట్రవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్న నియోజకవర్గాల్లో కృష్ణా జిల్లాలోని గుడివాడ ఒకటి. ప్రధాన పార్టీ అభ్యర్థులిద్దరూ ఆర్థిక, అంగబలాల్లో సమాన స్థాయిలో ఉండడంతో గుడివాడ పోరు ఆసక్తి రేపుతోంది. వైసీపీ అభ్యర్థిగా మాజీ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు అలియాస్‌ నాని, టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి తరఫున టీడీపీ అభ్యర్థిగా ఎన్నారై వెనిగండ్ల రాము పోటీ చేస్తున్నారు.

ఇక్కడి నుంచి వరుసగా నాలుగు సార్లు విజయం సాధించిన నానీ ఐదోసారి కూడా గెలవాలని తహతహలాడుతున్నారు. అయితే అదంత సునాయాసంగా కనిపించడం లేదని సొంత పార్టీ శ్రేణులే అంటున్నాయి.

టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్‌పై బూతుల దాడిలో ముందుండే నానీ ఓటమే లక్ష్యంగా టీడీపీ శ్రేణులు కసితో పనిచేస్తున్నాయి.

  • ఒకనాడు టీడీపీ కంచుకోట

గుడివాడ.. టీడీపీ ఆవిర్భావం నుంచీ ఆ పార్టీకి కంచుకోట. టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు పుట్టిన నిమ్మకూరు ఒకప్పుడు గుడివాడ నియోజకవర్గంలోనే ఉండేది (2009లో పామర్రులోకి వెళ్లింది).

సొంత గడ్డపై మమకారంతో 1983లో ఎన్టీఆర్‌ తన రాజకీయ అరంగేట్రానికి ఈ నియోజకవర్గాన్నే కార్యశాలగా ఎంచుకున్నారు. గుడివాడ వాసులూ అంతే మమకారంతో ఆయన్ను గెలిపించారు. 1985లోనూ విజయం సాధించారు. ఆయన హయాంలో గుడివాడ రూపురేఖలు మారిపోయాయి. అభివృద్ధి పరుగులు తీసింది.

అందమైన రహదారులతోపాటు క్రీడాప్రియుల కోసం ఎన్టీఆర్‌ స్టేడియం నిర్మించారు. టీడీపీ పుట్టిన తర్వాత ఇప్పటి వరకు 10 సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే 7 సార్లు టీడీపీ జెండా ఎగిరింది.

ఒక్కసారి కాంగ్రెస్‌, గత రెండుసార్లు వైసీపీ గెలుపొందింది. కొడాలి నానీ వరుసగా నాలుగు సార్లు (2004, 2009ల్లో టీడీపీ తరఫున, 2014,19ల్లో వైసీపీ తరఫున) విజయం సాధించారు.

వరుస ఓటముల నుంచి పాఠాలు నేర్చుకున్న టీడీపీ.. ఎన్నారై వెనిగండ్ల రామును ఎన్నికలకు రెండేళ్ల ముందే రంగంలోకి దింపింది. గత రెండేళ్లుగా నియోజకవర్గంలో సేవా కార్యక్రమాలతో ఆయన చొచ్చుకుపోయారు.

మాజీ ఎమ్మెల్యే, స్థానికంగా బలమైన నాయకుడిగా ఉన్న రావి వెంకటేశ్వరరావు తొలుత ఆయనకు దూరంగా ఉన్నా అధిష్ఠానం జోక్యంతో ప్రస్తుతం ఇద్దరూ కలిసి పనిచేస్తున్నారు. రాము సతీమణి ఎస్సీ సామాజికవర్గానికి చెందిన మహిళ కావడం కలిసొచ్చే అంశమని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.


  • విధ్వంసం, కేసినోలు.. సెంటిమెంట్‌..

నానీ సైతం దీటైన వ్యూహాలతో ఐదోసారి గెలుపు కోసం కసరత్తు చేస్తున్నారు. తనపై నియోజకవర్గ ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉందని గ్రహించి.. ఆఖరి అస్త్రంగా సెంటిమెంట్‌ను తెరపైకి తెచ్చారు. ఇవే తనకు చివరి ఎన్నికలని.. గెలిపించి గౌరవప్రదంగా రాజకీయాల నుంచి నిష్క్రమించే అవకాశం కల్పించాలని వేడుకుంటున్నారు.

అయితే ఒకప్పుడు అభివృద్ధికి మారుపేరుగా ఉన్న గుడివాడలో గత ఐదేళ్లలో విధ్వంసం రాజ్యమేలింది. తాగునీటికీ ప్రజలు అల్లాడుతున్నారు.

సాగునీటిదీ అదే పరిస్థితి. వీటికితోడు నాని గుడివాడను జూదశాలగా మార్చేశారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా లేనివిధంగా కేసినో సంస్కృతిని తొలిసారి దిగుమతి చేసుకున్న పట్టణంగా గుడివాడ నిలిచిపోయింది. నానీ మూడేళ్లు రాష్ట్ర మంత్రిగా చేశారు.

నియోజకవర్గ సమస్యలపై దృష్టి పెట్టడం కన్నా ప్రతిపక్ష నాయకులపై బూతులతో విరుచుకుపడడానికే ప్రాధాన్యమిస్తూ వస్తున్నారు. ఇసుక రీచ్‌ల్లో ఇసుక దోపిడీతో కోట్లు కొల్లగొడుతున్నారని విపక్షాలు దుయ్యబడుతున్నాయి.

రోడ్ల బాగునూ నానీ పట్టించుకోలేదు. టిడ్కో ఇళ్లను ఐదేళ్లపాటు లబ్ధిదారులకు ఇవ్వకుండా ఎన్నికల ముందు సీఎం జగన్‌తో ప్రారంభింపజేసి హడావుడి చేశారు.

ఈ పరిణామాల దరిమిలా ఆయన చెమటోడ్చాల్సిన పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు.

- విజయవాడ, ఆంధ్రజ్యోతి

గుడివాడ నియోజకవర్గ స్వరూపం..

మండలాలు: గుడివాడ, గుడ్లవల్లేరు, నందివాడ

మొత్తం ఓటర్లు: 2,04,271

పురుషులు: 97,710

మహిళలు: 1,06,550

ట్రాన్స్‌జెండర్లు: 11

కీలక సామాజిక వర్గాలు

ఎస్సీలు-60 వేలు, బీసీలు-40 వేలు, కాపులు-30 వేలు, ముస్లింలు-30 వేలు, కమ్మ-12 వేలు, రెడ్లు-8 వేలు, బ్రాహ్మణ/వైశ్య/మార్వాడీలు- 25 వేలు

వెనిగండ్ల రాము బలాలు..

ఉన్నత విద్యావంతుడు.. ఆర్థిక, అంగబలం పరంగా బలమైన నాయకుడు. స్థానిక టీడీపీ నేతలతో మమేకం..

బలహీనతలు: తొలిసారి పోటీ

టీడీపీలో ఉన్న నానీ కోవర్టులు

ఎన్నికల నిర్వహణ కొత్త

కొడాలి నాని బలాలు..

20 ఏళ్లుగా ఎమ్మెల్యే.. ఆర్థిక, అంగబలాలు.. ఎన్నికల నిర్వహణలో ఆరితేరడం.. ఎస్సీ ఓటు బ్యాంకు.

బలహీనతలు

గత ఐదేళ్లలో అభివృద్ధిలేమి, కేసినో సంస్కృతిపై ఆగ్రహ జ్వాలలు.. ఎన్నికలప్పుడు తప్ప అందుబాటులో ఉండకపోవడం.

Updated Date - May 05 , 2024 | 03:53 AM