Share News

టీడీఆర్‌ కుంభకోణంపై సీఐడీ విచారణ!

ABN , Publish Date - Aug 13 , 2024 | 03:26 AM

రాష్ట్ర వ్యాప్తంగా 2019-2024 మధ్యకాలంలో జారీచేసిన టీడీఆర్‌ బాండ్లపై ప్రభుత్వం అంతర్గత విచారణ చేస్తోంది. ఈ కుంభకోణంపై సీఐడీ విచారణకు ఆదేశించనున్నట్లు సమాచారం.

టీడీఆర్‌ కుంభకోణంపై సీఐడీ విచారణ!

అమరావతి, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర వ్యాప్తంగా 2019-2024 మధ్యకాలంలో జారీచేసిన టీడీఆర్‌ బాండ్లపై ప్రభుత్వం అంతర్గత విచారణ చేస్తోంది. ఈ కుంభకోణంపై సీఐడీ విచారణకు ఆదేశించనున్నట్లు సమాచారం. దీనిపై మరింత లోతుగా విచారణ చేపట్టాల్సిన అవసరంపై మంత్రి నారాయణ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. సీఐడీ విచారణకు ఇస్తేనే అసలు సూత్రధారులు ఎవరన్న అంశం వెలుగులోకి వస్తుందని ప్రభుత్వం యోచిస్తోంది. టీడీఆర్‌ బాండ్ల కుంభకోణంలో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుపై ఆరోపణలున్నాయని, తణుకు టీడీఆర్‌ బాండ్ల కుంభకోణం జరిగిన తీరును సీఎం చంద్రబాబుకు మంత్రి నారాయణ వివరించినట్లు తెలిసింది. ఈ వ్యవహారం కోర్టులో ఉండటంతో న్యాయ నిపుణులతో సంప్రదింపులు చేపట్టారు. తణుకు మున్సిపాలిటీలో రూ.754 కోట్ల మేర బాండ్లు జారీచేసినట్లు ఏసీబీ అధికారులు, మున్సిపల్‌శాఖ గుర్తించింది. ఇందులో రూ.691 కోట్ల మేర అక్రమాలు జరిగినట్లు ఏసీబీ గుర్తించింది. అలాగే, బాండ్ల జారీకి అనుసరించిన విధానం చూస్తే.. స్థల సేకరణ సమయంలో ఎకరా రూ.55 లక్షలకు సేకరించి బాండ్ల జారీకి ఎకరా రూ.10 కోట్ల విలువ చూపడంపై విస్మయం వ్యక్తం చేసింది. ఇప్పటికే ఈ వ్యవహారంలో మున్సిపల్‌ కమిషనర్‌ సహా ముగ్గురిని సస్పెండ్‌ చేశారు.

Updated Date - Aug 13 , 2024 | 06:53 AM