Share News

ఐఆర్‌ఆర్‌ కేసులో సీఐడీ చార్జిషీటు

ABN , Publish Date - Feb 09 , 2024 | 02:08 AM

ఇన్నర్‌ రింగ్‌రోడ్డులో అక్రమాలు జరిగాయని కేసు నమోదు చేసిన సీఐడీ దానికి సంబంధించి చార్జిషీటును విజయవాడ ఏసీబీ కోర్టులో గురువారం దాఖలు చేసింది.

ఐఆర్‌ఆర్‌ కేసులో సీఐడీ చార్జిషీటు

అందులో చంద్రబాబు, నారాయణ, లోకేశ్‌ పేర్లు

విజయవాడ, ఫిబ్రవరి 8(ఆంధ్రజ్యోతి): ఇన్నర్‌ రింగ్‌రోడ్డులో అక్రమాలు జరిగాయని కేసు నమోదు చేసిన సీఐడీ దానికి సంబంధించి చార్జిషీటును విజయవాడ ఏసీబీ కోర్టులో గురువారం దాఖలు చేసింది. దీనికి న్యాయస్థానం ఇంకా నంబరు కేటాయించలేదు. చార్జిషీటులో టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీ మంత్రి పొంగూరు నారాయణ, నారా లోకేశ్‌, రియల్టర్లు లింగమనేని రాజశేఖర్‌, లింగమనేని రమేశ్‌ పేర్లను చేర్చింది. 2014-19 మధ్యకాలంలో సీఆర్డీఏకి చంద్రబాబు, నారాయణ ఎక్స్‌ అఫిషియో చైర్మన్‌, వైస్‌ చైర్మన్లుగా వ్యవహరించారని సీఐడీ పేర్కొంది. రాజధాని నిర్మాణం కోసం సింగపూర్‌ ప్రభుత్వంతో జీ2జీ ఒప్పందం చేసుకున్నారని, దీనికి కేంద్రం నుంచి ఎలాంటి అనుమతి తీసుకోలేదని స్పష్టం చేసింది. ‘‘విదేశీ సంస్థ అయిన సర్బాన జురాంగ్‌ సంస్థకు మాస్టర్‌ ప్లాన్‌ను రూపొందించే బాధ్యత అప్పగించారు. దీనికి ఫీజు రూపంలో కోట్లాది రూపాయలు చెల్లించారు. ఇది పూర్తిగా అక్రమం. ఇన్నర్‌ రింగ్‌ రోడ్డును లింగమనేని రమేశ్‌, చంద్రబాబుకు సంబంధించిన హెరిటేజ్‌ భూములు, నారాయణ విద్యాసంస్థల భూముల పక్కనుంచి తీసుకెళ్లారు. చంద్రబాబు స్కెచ్‌తో నారాయణ 58 ఎకరాలు కొనుగోలు చేశారు. ఈ భూములకు పక్కన సీడ్‌ క్యాపిటల్‌ వచ్చేలా ప్లాన్‌ డిజైన్‌ చేయించారు. క్విడ్‌ ప్రో కోలో భాగంగా లింగమనేని రమేశ్‌కు చెందిన అతిథిగృహాన్ని చంద్రబాబు కానుకగా తీసుకున్నారు. ఏసీబీ కోర్టు ఈ అతిథి గృహం జప్తునకు ఆదేశించింది. లింగమనేని రమేశ్‌కు చెందిన భూముల పక్కనే హెరిటేజ్‌ సంస్థ 14 ఎకరాలు కొనుగోలు చేసింది. వీటి పక్కనుంచే ఐఆర్‌ఆర్‌ వెళ్లేలా రోడ్డు అలైన్‌మెంట్‌ మార్చడం ద్వారా ఈ భూముల విలువను పెంచుకున్నారు. ఐపీసీ 120(బీ), 409, 420, 34, 35, 36,37 ప్రివెన్షన్‌ ఆఫ్‌ కరప్షన్‌ యాక్ట్‌ 1988 సెక్షన్‌ 13(2) రెడ్‌విత్‌ 13(1)(సీ)(డీ) ప్రకారం శిక్ష విధించండి’’ అని కోర్టును సీఐడీ కోరింది.

Updated Date - Feb 09 , 2024 | 09:33 AM