Share News

పేదలగూడుపై.. పెత్తందారు పగ

ABN , Publish Date - May 07 , 2024 | 04:56 AM

పేదల పెన్నిధినని చెప్పుకొనే ముఖ్యమంత్రి జగన్‌ పట్టణ పేదల ఇళ్లపై పగబట్టారు. చంద్రబాబుపై కక్షతో ఆయన హయాంలో శ్రీకారం చుట్టిన టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు ఇవ్వకుండా పాడుపెట్టారు. గత ప్రభుత్వ హయాంలోనే దాదాపుగా పూర్తయిన ఇళ్ల నిర్మాణాలను కూడా అసంపూర్తిగా వదిలేశారు.

పేదలగూడుపై.. పెత్తందారు పగ

మీ ప్యాలెస్‌లు బాగుండాలి.. పేదల ఇళ్లు పాడుబడాలి

టిడ్కో ఇళ్లకు జగన్‌ గ్రహణం

చంద్రబాబు కట్టించారనే కక్షతో

పేదలకివ్వకుండా పాడుపెట్టిన వైనం

(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌)

పేదల పెన్నిధినని చెప్పుకొనే ముఖ్యమంత్రి జగన్‌ పట్టణ పేదల ఇళ్లపై పగబట్టారు. చంద్రబాబుపై కక్షతో ఆయన హయాంలో శ్రీకారం చుట్టిన టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు ఇవ్వకుండా పాడుపెట్టారు. గత ప్రభుత్వ హయాంలోనే దాదాపుగా పూర్తయిన ఇళ్ల నిర్మాణాలను కూడా అసంపూర్తిగా వదిలేశారు.

చంద్రబాబు మంజూరు చేశారన్న ఒకే ఒక్క కారణంతో పేదల ఆశలను అడియాసలు చేశారు. పట్టణ పేదలకు పక్కా ఇళ్లు అందించాలన్న లక్ష్యంతో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం టిడ్కో ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 8 లక్షల ఇళ్లు నిర్మించాలని తలపెట్టింది. దాదాపు 6 లక్షల ఇళ్ల నిర్మాణపు పనులు చేపట్టింది. గత ఎన్నికల సమయానికి టీడీపీ ప్రభుత్వ హయాంలోనే దాదాపు 2.70 లక్షల ఇళ్ల నిర్మాణం దాదాపుగా పూర్తయింది. కొన్ని ఇళ్ల నిర్మాణాలు పూర్తయినా ఎన్నికల ముందు పంపిణీ చేయలేకపోయారు.

జగన్‌ సర్కారు వచ్చాక టిడ్కో ఇళ్లకు గ్రహణం పట్టింది. ఎక్కడి నిర్మాణాలను అక్కడ ఆపేసింది. 90 శాతం పనులు జరిగిన నిర్మాణాలను కూడా పూర్తి చేయకుండా గాలికి వదిలేసింది. దీంతో చాలా చోట్ల టిడ్కో ఇళ్ల సముదాయాలు ముళ్ల చెట్ల పొదలతో నిండిపోయాయి. పలు ప్రాంతాల్లో జగన్‌ సర్కారు టిడ్కో ఇళ్లకు వైసీపీ రంగులు వేయించి మరీ లబ్ధిదారులకు ఇవ్వకుండా వదిలేసింది. తాగునీరు, రోడ్లు, విద్యుత్‌, డ్రెనేజీ వంటి కనీస మౌలిక సదుపాయాలను కల్పించలేదు.

తీవ్ర జాప్యం చేసి ఎన్నికల ముందు అక్కడక్కడ లబ్ధిదారులకు ఇళ్లు అప్పగించినా వారు నివాసం ఉండలేని పరిస్థితి. చంద్రబాబు హయాంలో మంజూరు చేసిన ఇళ్ల నిర్మాణాలను జగన్‌ విస్మరించారని, మళ్లీ చంద్రబాబు అధికారంలోకి వస్తే మిగిలిన పనులు పూర్తిచేసి ఇళ్లను అప్పగిస్తారని లబ్ధిదారులు ఆశిస్తున్నారు.

తాడేపల్లిలో ప్యాలెస్‌ కట్టుకున్నారు. లోట్‌సపాండ్‌లో మరో ప్యాలెస్‌ ఉంది. ఇతర నగరాల్లోనూ ప్యాలె్‌సలు ఉన్నాయి. దాదాపు 500 కోట్ల ప్రజాధనం ఖర్చు పెట్టి రుషికొండపై నిబంధనలు ఉల్లంఘించి మరీ ప్యాలెస్‌ నిర్మించుకున్నారు. పేదనని తనకు తాను చెప్పుకొనే ముఖ్యమంత్రి జగన్‌ ప్యాలెసుల్లో హాయిగా ఉంటూ.. పేదల పక్షపాతినని చెబుతూ... పేదలగూడుపై పగబట్టారు. చంద్రబాబు ప్రభుత్వంలో పట్టణ పేదలకు కట్టించిన టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు ఇవ్వకుండా ఐదేళ్లుగా పాడుబెట్టారు. 90 శాతం పూర్తయిన ఇళ్లను కూడా పూర్తి చేయకుండా వదిలేశారు. ఆయన చేసిన ఘనకార్యం ఏమిటంటే.. టిడ్కో ఇళ్లకు వైసీపీ రంగులు వేయడమే!

రంగులేసి వదిలేశారు

శ్రీకాకుళం జిల్లాలో కొన్ని చోట్ల టిడ్కో ఇళ్లకు వైసీపీ రంగులేసి మరీ లబ్ధిదారులకు ఇవ్వకుండా వదిలేశారు. పాత్రునివలస-2లో 624 ఇళ్ల నిర్మాణం ఇంకా కొంత చేయాల్సి ఉంది. ఆమదాలవలసలో 528 ఇళ్ల నిర్మాణం పూర్తయినా.. లబ్ధిదారులకు ఇళ్లను అప్పగించలేదు. ఎన్నికల కోడ్‌కు ముందు స్పీకర్‌ తమ్మినేని సీతారాం హడావుడిగా శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. పలాస పట్టణ ప్రజలకు బొడ్డపాడు వద్ద 912 ఇళ్లను నిర్మించినా లబ్ధిదారులకు అప్పగించలేదు. పాత్రునివలస-1లో నిర్మించిన ఇళ్లను మాత్రమే పది నెలల కిందట లబ్ధిదారులకు అందజేశారు.


పశ్చిమలో పడకేసిన టిడ్కో

పశ్చిమగోదావరి జిల్లాలో తొలి విడతగా భీమవరం, తాడేపల్లిగూడెం, పాలకొల్లు పట్టణాల్లో 19,872 ఇళ్ల నిర్మాణం చేపట్టారు. మూడు పట్టణాల్లో 5,512 ఇళ్లు టీడీపీ హయాంలోనే పూర్తిగా అందుబాటులోకి తెచ్చారు. మిగిలిన ఇళ్లకు రంగులు, అంతర్గత పనులు మిగిలాయి. వాటిని కూడా వైసీపీ ప్రభుత్వం పూర్తి చేయలేకపోయింది. గతంలో నిర్మించి, రంగులేసిన ఇళ్లకు వైసీపీ రంగులు వేసుకుంది. గత ప్రభుత్వంలో పూర్తి చేసిన ఇళ్లను రెండేళ్ల కిందట లబ్ధిదారులకు ఇచ్చారు. ఎన్నికల కోడ్‌కు ముందు మరో మూడు వేల ఇళ్లు అందజేశారు. పూర్తిస్థాయిలో మౌలిక వసతులు కల్పించలేదు. మున్సిపాలిటీ నుంచి మంచినీళ్లు కూడా ఇవ్వలేదు. డ్రైనేజీ వ్యవస్థలేదు. తణుకులో రెండో విడతలో చేపట్టిన 1200 ఇళ్ల నిర్మాణ పనులను వైసీపీ సర్కారు పూర్తిగా పక్కన పెట్టేసింది.

అసంపూర్తిగా నిర్మాణం

తిరుపతి జిల్లాలో తిరుపతి మున్సిపల్‌ కార్పొ రేషన్‌, వెంకటగిరి, గూడూరు, సూళ్లూరుపేట, నాయుడుపేట, శ్రీకాళహస్తి, పుత్తూరు మున్సిపాలిటీలలో ఎక్కడా పూర్తిస్థాయిలో టిడ్కో ఇళ్ల నిర్మాణం పూర్తి కాలేదు. ఒకటి రెండు చోట్ల దాదాపు పూర్తయినా లబ్ధిదారులకు ఇళ్లు కేటాయించలేదు. అక్కడక్కడా ఇళ్లలో చేరిన లబ్ధిదారులు సైతం మౌలిక సదుపాయాలు లేక ఖాళీ చేస్తున్నారు.

పాడైపోతున్న ప్లాట్లు

కాకినాడ జిల్లాలో చాలాచోట్ల టిడ్కో ఇళ్ల పరిస్థితి అస్తవ్యస్తంగా మారింది. నిర్వహణ లేకపోవడంతో ప్లాట్లు పాడైపోయాయి. కాకినాడ నగరంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో 4,608 ఇళ్లు మంజూరు కాగా మొదటి దశలో 1152 ఇళ్లు పూర్తి చేసి రంగులు వేసి సిద్ధం చేశారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక మూడేళ్లు వీటిని పట్టించుకోలేదు. పిఠాపురం పట్టణంలోని టిడ్కో ఇళ్లు గృహప్రవేశ సమయానికే పగుళ్లిస్తున్నాయి. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 864 ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసి లాటరీ వేసి లబ్ధిదారులకు ప్లాట్లు కేటాయించారు. వైసీపీ ప్రభుత్వం వాటిని రద్దు చేసి నాలుగేళ్ల కాలయాపన తర్వాత 350 మంది లబ్ధిదారులకు పాట్లు అప్పగించింది. తాగునీటి సౌకర్యం లేక తీవ్ర అవస్థలు పడుతున్నారు. పెద్దాపురం పట్టణంలో టిడ్కో గృహసముదాయాల్లో మౌలిక వసతులను విస్మరించారు.


సీఎం సొంత జిల్లాలోనూ..

ముఖ్యమంత్రి జగన్‌ సొంత జిల్లాలోనూ టిడ్కో ఇళ్లపై తన మార్కు నిర్లక్ష్యం చూపారు. చంద్రబాబు హయాంలో మొదటి విడతలో కడప నగర శివారులోని ఇండస్ట్రియల్‌ ఎస్టేట్‌ వద్ద లక్ష్మినగర్‌లో 992, జమ్మలమడుగు వద్ద 1440 టిడ్కో ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. 2019 జనవరి నాటికే దాదాపు 90 శాతం నిర్మాణాలు పూర్తయ్యాయి. డ్రైనేజీ, రోడ్లు, విద్యుత్‌ వంటి మౌలిక వసతుల పనులు మాత్రమే చేపట్టాల్సి ఉంది. రెండో విడతలో కడప నగర శివారులోని చలమారెడ్డిపల్లె వద్ద 1442 ఇళ్లు, ఎర్రగుంట్ల, ప్రొద్దుటూరు, బద్వేలులో టిడ్కో ఇళ్ల నిర్మాణం మొదలు పెట్టారు. ఇవి వివిధ దశల్లో ఉన్నాయి. జగన్‌ ముఖ్యమంత్రి అయ్యాక ఎక్కడి పనులు అక్కడ ఆగిపోయాయి.

సాలెగూళ్లుగా..

ప్రకాశం జిల్లా ఒంగోలులో మొదటి దశలో 90 శాతం నిర్మాణాలు పూర్తయ్యాయి. మరో పది శాతం పనులను పూర్తి చేసుంటే లబ్ధిదారులు ఎప్పుడో గృహప్రవేశాలు చేసేవారు. వైసీపీ సర్కారు వచ్చాక అర్ధంతరంగా ఆగిపోవడంతో అవి సాలెగూళ్లుగా మారాయి. రెండేళ్ల క్రితం టీడీపీ, సీపీఐ వేర్వేరుగా టిడ్కో ఇళ్ల వద్ద ఆందోళనలు చేపట్టగా త్వరలో ఇస్తామని ప్రభుత్వ పెద్దలు ప్రకటనలు చేశారు. ఆ తర్వాత పట్టించుకోలేదు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మొత్తం 9,568 టిడ్కో ఇళ్ల నిర్మాణాలకు శ్రీకారం చుట్టారు. వైసీపీ సర్కారు వచ్చాక ఎక్కడి పనులు అక్కడ నిలిచిపోయాయి.

నిండా నిర్లక్ష్యం

ఉమ్మడి అనంతపురం జిల్లాలో అనంతపురం, గుత్తి, పామిడి, గుంతకల్లు, రాయదుర్గం, ధర్మవరం, కదిరి, పుట్టపర్తి, హిందూపురం ప్రాంతాల్లో టిడ్కో ఇళ్ల పరిస్థితి దయనీయాంగా మారింది. టీడీపీ హయాంలో 80 శాతానికి పైగా నిర్మాణాలు పూర్తి కాగా.. వైసీపీ సర్కారు మిగిలిన 20 శాతం పనులను చేపట్టలేదు. కాంట్రాక్టర్లకు రూ.70 కోట్ల బకాయిలు చెల్లించలేదు.

గుత్తి పట్టణవాసులకు నేమతాబాదు వద్ద చేపట్టిన ఇళ్ల నిర్మాణ సముదాయంలో ముళ్ల పొదలు పెరిగిపోయాయి. అనంతపురం నగర శివారులో టిడ్కో ఇళ్లకు వైసీపీ రంగులు వేసి, లబ్ధిదారులకు ఇవ్వకుండా వదిలేశారు. తాడిపత్రిలో మాత్రం మూడు నెలల క్రితం కొన్నింటించి ప్రారంభించారు. అక్కడ 5,184 టిడ్కో ఇళ్లు ఉండగా.. వెయ్యి ఇళ్లకు పైపై పనులు చేసి, రంగులు వేయించారు. ఇందులో కూడా లబ్ధిదారులకు 370 ఇళ్లను మాత్రమే అప్పగించారు.

Updated Date - May 07 , 2024 | 04:57 AM