Share News

ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా చెవిరెడ్డి!

ABN , Publish Date - Jan 13 , 2024 | 05:02 AM

సర్వేలన్నారు.. పనితీరన్నారు.. ప్రజాభిప్రాయం అన్నారు.. చివరకు సంబంధం లేని స్థానికేతరులను సీఎం జగన్‌ అభ్యర్థులుగా ఖరారు చేస్తున్నారు.

ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా చెవిరెడ్డి!

సీఎం జగన్‌ ప్రతిపాదన.. ఎమ్మెల్యే ఓకే

మాగుంట, బాలినేనికి చెక్‌ చెప్పడానికే!

హుటాహుటిన భాగ్యనగరికి భాస్కర్‌రెడ్డి

మద్దతివ్వాలని బాలినేనికి వినతి

అసెంబ్లీ బరిలో దిగాలని సూచన

ససేమిరా అన్న మాజీ మంత్రి

మాగుంటకు ఎంపీ టికెట్‌ ఇస్తేనే

పోటీ చేస్తానని స్పష్టీకరణ

(అమరావతి-ఆంధ్రజ్యోతి): సర్వేలన్నారు.. పనితీరన్నారు.. ప్రజాభిప్రాయం అన్నారు.. చివరకు సంబంధం లేని స్థానికేతరులను సీఎం జగన్‌ అభ్యర్థులుగా ఖరారు చేస్తున్నారు. ఒంగోలుతో ఏ మాత్రం సంబంధం లేని చంద్రగిరి వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని అక్కడ లోక్‌సభ అభ్యర్థిగా రంగంలో దింపాలని ప్రతిపాదించారు. దీనిని చెవిరెడ్డి కూడా ఆమోదించారు. అంతేకాదు.. ఒంగోలు ఎమ్మెల్యే, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అభిప్రాయం తెలుసుకునేందుకు, మద్దతు కోరడానికి హుటాహుటిన హైదరాబాద్‌ వెళ్లారు. ఆయన్ను కలిసి.. తాను ఒంగోలు లోక్‌సభకు పోటీ చేద్దామనుకుంటున్నానని.. ఇద్దరం కలిసి ఎంపీ, అసెంబ్లీ అభ్యర్థులుగా బరిలోకి దిగుదామని చెప్పారు. ఇందుకు ఆయన అంగీకరించలేదు. ఒంగోలు ఎంపీ టికెట్‌ ప్రస్తుత ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డికి ఇస్తేనే తాను మద్దతిస్తానని స్పష్టం చేశారు. టికెట్‌ కావాలంటే రూ.180 కోట్లు డిపాజిట్‌ చేయాలని.. విలేకరుల సమావేశం పెట్టి టీడీపీ అధినేతలు చంద్రబాబు, లోకేశ్‌, జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ను తిట్టిపోయాలని తాను విధించిన షరతులకు తలొగ్గని మాగుంటపై జగన్‌ మండిపడుతున్న సంగతి తెలిసిందే. ఆయనతో సంబంధాలు చెడడంతో జగన్‌ ఒంగోలులో ప్రత్యామ్నాయ అభ్యర్థి కోసం అన్వేషిస్తున్నారు. వైసీపీ తరఫున మాగుంట ఎంపీగా పోటీ చేస్తేనే తాను ఒంగోలు నుంచి అసెంబ్లీకి బరిలోకి దిగుతానని బాలినేని ఇప్పటికే సీఎంకు, ప్రాంతీయ సమన్వయకర్తలకు తేల్చిచెప్పారు. మధ్యలో ఎంపీ విజయసాయిరెడ్డి జోక్యం చేసుకుని.. మాగుంటకు సీటు కోసం కొంత ప్రయత్నం చేశారు. సీఎం మండిపడడంతో ఆయన జోలికి వెళ్లడం మానేశారు. ఇంకోవైపు.. ఒంగోలు ఎంపీగా పోటీచేసేందుకు వైసీపీకి సరైన అభ్యర్థి కనిపించడం లేదు. రూ.180 కోట్ల డిపాజిట్‌, విపక్ష నేతలను బూతులు తిట్టాలన్న నిబంధనలు పాటించేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. ఐప్యాక్‌ సర్వే నివేదికలేవీ.. టీడీపీని తట్టుకోగలిగిన గట్టి ప్రత్యర్థి పేరును సూచించడం లేదు. దీంతో మాగుంట, బాలినేనికి చెక్‌ పెట్టేందుకు.. తన సన్నిహితుడు చెవిరెడ్డిని ఒంగోలు బరిలో దింపాలని జగన్‌ యోచించారు.

చొక్కాలు చించుకుంటున్నారట!

వైసీపీలో టికెట్లకు భారీ డిమాండ్‌ ఉందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెబుతున్నారు. టికెట్ల కోసం కొట్టుకుంటున్నారని.. చొక్కాలు చించుకుంటున్నారని అంటున్నారు. ఆయనది బిల్డప్‌ మాత్రమేనని.. క్షేత్రస్థాయిలో అలాంటి వాతావరణమే లేదని రాజకీయ వర్గాలు అంటున్నాయి. వైసీపీలో అభ్యర్థుల కొరత తీవ్రంగా ఉందని, అందుకే ఇతర జిల్లాల నుంచి నేతలను దిగుమతి చేసుకుంటున్నారని చెబుతున్నాయి. ఎమ్మెల్యే అభ్యర్థి అయితే రూ.20-30 కోట్లు, ఎంపీ అభ్యర్థులైతే రూ.180 కోట్ల దాకా డిపాజిట్‌ చేయాలని షరతు పెట్టడంతో.. వైసీపీలో అత్యధిక నేతలు చేతులెత్తేశారు. టికెట్‌ రాదన్న ఆందోళన సిటింగ్‌లలో కనిపించడం లేదు. రాకపోవడమే మహద్భాగ్యమని ఇంట్లో కూర్చుంటున్నారు.

అభ్యర్థుల మార్పు..

కొందరు ఎమ్మెల్యేలను వేరే నియోజకవర్గాలకు ఇన్‌చార్జులుగా పంపడం వైసీపీ నేతలనూ కలవరపెడుతోంది. జగన్‌కు సన్నిహితుడని ముద్రపడిన మంత్రి ఆదిమూలపు సురేశ్‌ను యర్రగొండపాలెం నుంచి కొండపికి పంపారు. మరో మంత్రి మేరుగ నాగార్జునను వేమూరు నుంచి సంతనూతలపాడుకు, ఆరోగ్య మంత్రి విడదల రజనిని చిలకలూరిపేట నుంచి గుంటూరు పశ్చిమకు బదిలీచేశారు. మాజీ మంత్రి, ప్రత్తిపాడు ఎమ్మెల్యే మేకతోటి సుచరితను తాడికొండకు మార్చి.. అక్కడ బాలసాని కిరణ్‌కుమార్‌ను ఇన్‌చార్జిగా నియమించారు. పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావును తప్పించి.. ఎక్కడో రాజాం ఎమ్మెల్యేగా ఉన్న కంబాల జోగులును అక్కడకు బదిలీచేశారు. విజయనగరం జిల్లాకు చెందిన మంత్రి బొత్స సత్యనారాయణ భార్య, మాజీ ఎంపీ బొత్స ఝాన్సీని విశాఖ లోక్‌సభ బరిలో నిలుపుతున్నారు. మంత్రి జోగి రమేశ్‌ను పెడన నుంచి పెనమలూరుకు మార్చారు. స్థానికంగా దీటైన అభ్యర్ధులు లేకపోవడం వల్లే ఇలా మార్పులు చేస్తున్నారు. పైగా .. అప్పటికప్పుడు వైసీపీ కండువా కప్పుకొన్న కర్ణాటక మాజీ మంత్రి శ్రీరాములు సోదరి శాంతను బళ్లారి నుంచి తీసుకొచ్చి హిందూపురం ఎంపీ టికెట్‌ కేటాయించారు. పార్టీలో ఇంకా చేరని విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నానికి అదే టికెట్‌ ప్రకటించారు. దీనినిబట్టి వైసీపీలో అభ్యర్థుల కొరత ఎంత ఉందో అర్థమవుతోందని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి.

Updated Date - Jan 13 , 2024 | 05:02 AM