బస్సుల కోసం బడులకు మోసం!
ABN , Publish Date - Jan 18 , 2024 | 04:05 AM
‘సంక్రాంతి సెలవులు పొడిగించాలని ఉపాధ్యాయులు, తల్లిందండ్రులు కోరారు. అందుకే ఈ నెల 21వ తేదీ వరకు పాఠశాలలకు సంక్రాంతి సెలవులు పొడిగిస్తున్నాం’’-
21 వరకు సంక్రాంతి సెలవులు పొడిగింపు
అంబేడ్కర్ కార్యక్రమానికి జనం తరలింపునకు
పాఠశాల బస్సులను వినియోగించే ప్లాన్
టీచర్లు, తల్లిదండ్రులు కోరినట్లు వివరణ
ఎవరూ కోరలేదంటున్న ఉపాధ్యాయులు
అమరావతి, జనవరి 17(ఆంధ్రజ్యోతి): ‘‘సంక్రాంతి సెలవులు పొడిగించాలని ఉపాధ్యాయులు, తల్లిందండ్రులు కోరారు. అందుకే ఈ నెల 21వ తేదీ వరకు పాఠశాలలకు సంక్రాంతి సెలవులు పొడిగిస్తున్నాం’’- ఇదీ తాజాగా ప్రభుత్వం చేసిన ప్రకటన. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేశ్ కుమార్ బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. కానీ, దీనిని కొంత లోతుగా పరిశీలిస్తే.. ఇప్పటికే ఈ నెల 9 నుంచి విద్యార్థులు సంక్రాంతి సెలవుల్లోనే ఉన్నారు. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 19 నుంచి పాఠశాలలు ప్రారంభించాల్సి ఉంది. పైగా పరీక్షల సమయం కావడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు కూడా స్కూళ్లు ఎప్పుడెప్పుడు తెరుస్తారా? అని ఎదురు చూస్తున్నారు. కానీ, సర్కారు మాత్రం పైవిధంగా సెలవిచ్చింది. మరి దీని వెనుక ఏముందంటే.. విజయవాడలో నిర్మించిన రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం. ఎన్నికలకు ముందు ఈ నెల 19న(శుక్రవారం) నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని వైసీపీ ప్రభుత్వం బలప్రదర్శనకు వేదికగా మార్చుకోవాలని భావిస్తోంది. పలు జిల్లాల నుంచి ప్రజలను రప్పించే ప్రయత్నం చేస్తోంది. దీనికి స్కూల్ బస్సులు కూడా కావాల్సి ఉండడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారంటూ.. బడులకు సెలవులు ప్రకటించేసింది. వాస్తవానికి ఏటా బడులకు పది రోజులపాటు సంక్రాంతి సెలవులు ఇస్తారు. ఈ ఏడాది కూడా 9 నుంచి 18 వరకు సెలవులు ప్రకటించారు. సెలవులు ముగుస్తున్నందున బడులకు వెళ్లాలని టీచర్లు, విద్యార్థులు సన్నద్ధమవుతున్న సమయంలో అనూహ్యంగా ప్రభుత్వం సెలవులు పొడిగిస్తూ ప్రకటన జారీ చేసింది. వాస్తవానికి ఉపాధ్యాయ సంఘాలేవీ సెలవులు పొడిగించాలని కోరలేదు. ఇక తల్లిదండ్రులు అడిగినట్టుగా కూడా సమాచారం లేదు. అడిగిన సెలవులు ఇవ్వని ప్రభుత్వం అడగకుండానే పొడిగించడం చూసి టీచర్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. తొలుత దీనిపై పాఠశాల విద్యాశాఖ ప్రకటన విడుదల చేయగానే అది ‘ఫేక్’ అని ఉపాధ్యాయ సంఘాల వాట్సాప్ గ్రూపుల్లో ప్రచారం జరిగింది. చివరికి ఉత్తర్వులు వెలువడ్డాయి. అసలు ఎవరూ అడగకుండానే ఎందుకు పొడిగించారనే చర్చ జరిగింది. ఎన్నికల్లో లబ్ధి కోసం సెలవులు ఇస్తున్నారని కొందరు, ట్యాబ్‌లు ఇవ్వకపోవడం వల్లే సెలవులిచ్చారని కొందరు అభిప్రాయాలు వ్యక్తం చేశారు. 19న ఒక్కరోజే సెలవు ఇస్తే విగ్రహావిష్కరణే అసలు కారణమనే అర్థమవుతుందని, అందుకే మరొక రోజు పెంచారని టీచర్లు అంటున్నారు. పైగా ఇప్పుడిచ్చిన రెండు రోజులు సెలవులకు బదులుగా తర్వాత జనరల్ హాలిడే్‌సలో బడులు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ స్పష్టం చేసింది. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో అంబేడ్కర్ విగ్రహావిష్కరణను వైసీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. తద్వారా రాజకీయ లబ్ధి పొందాలనే ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగానే జిల్లాల నుంచి సైతం ప్రజలను తరలించేందుకు స్కూల్ బస్సులను వినియోగించే వ్యూహం పన్నినట్టు తెలుస్తోంది.