Share News

Chandrababu : నవ శకానికి నాంది!

ABN , Publish Date - Jun 12 , 2024 | 03:35 AM

‘కూటమి’ కొలువు తీరేందుకు సర్వం సిద్ధమైంది. నవ్యాంధ్ర నూతన ముఖ్యమంత్రిగా చంద్రబాబు, ఆయన కొత్త మంత్రివర్గ సభ్యులు బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

Chandrababu : నవ శకానికి నాంది!

‘కూటమి’ కొలువు తీరేది నేడే

మరో శకానికి నాంది నేడే!

నవ్యాంధ్ర చరిత్ర మేలి మలుపు తిరిగేది నేడే!

ఐదేళ్ల విధ్వంస పాలన స్థానంలో... అమరావతి, పోలవరం, సంక్షేమం, సమగ్రాభివృద్ధే మంత్రాలుగా పని చేస్తామంటున్న కొత్త ప్రభుత్వం కొలువు తీరేది నేడే!

సార్వత్రిక ఎన్నికల్లో కనీవినీ ఎరుగని రీతిలో..

164 స్థానాల్లో విజయ దుందుభి మోగించిన

టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి సర్కారు

అధికారికంగా ఏర్పడేది నేడే!

ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకార

ముహూర్తం.. బుధవారం ఉదయం 11.27 గంటలు! వేదిక.. గన్నవరం విమానాశ్రయం సమీపంలోని కేసరపల్లి!

అతిథులు, ఆహ్వానితులు.. అతిరథ మహారథుల నుంచి సామాన్య కార్యకర్తలు, అభిమానుల దాకా!

ఉదయం 11.27 గంటలకు చంద్రబాబు ప్రమాణ స్వీకారం

మంత్రివర్గ సహచరులు కూడా!

గన్నవరం సమీపంలో వేదిక సిద్ధం

విజయవాడ చేరుకున్న అమిత్‌షా, నడ్డా

నేడు ప్రధాని నరేంద్ర మోదీ రాక

దేశ, విదేశీ ప్రముఖులకు ఆహ్వానం

ప్రమాణ స్వీకారాలకే కార్యక్రమం పరిమితం

(అమరావతి - ఆంధ్రజ్యోతి)

‘కూటమి’ కొలువు తీరేందుకు సర్వం సిద్ధమైంది. నవ్యాంధ్ర నూతన ముఖ్యమంత్రిగా చంద్రబాబు, ఆయన కొత్త మంత్రివర్గ సభ్యులు బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గన్నవరం విమానాశ్రయానికి సమీపంలో ఎంపిక చేసిన మైదానంలో భారీ జన సందోహం నడుమ ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే, కొందరు కేంద్ర మంత్రులు, దేశ విదేశాలకు చెందిన ప్రత్యేక ఆహ్వానితులు, కొత్తగా ఎంపికైన శాసనసభ్యులు, ఇతర ప్రజా ప్రతినిధులు, తెలుగు తమ్ముళ్లు, అభిమాన సందోహం నడుమ అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు.


సభాపక్ష నేతగా...

కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన రాజ్యాంగ ప్రక్రియను మంగళవారం పూర్తి చేశారు. మంగళవారం ఉదయం విజయవాడలోని ఏ-కన్వెన్షన్‌ సమావేశ మందిరంలో కూటమిలోని మూడు పార్టీల ఎమ్మెల్యేల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మొదట టీడీపీ శాసనసభాపక్ష నేతగా చంద్రబాబు నాయుడును ఎన్నుకొన్నారు. ఆ తర్వాత కూటమి తరఫున శాసన సభాపక్ష నేతగా చంద్రబాబు పేరును జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ స్వయంగా ప్రతిపాదించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి బలపర్చారు. సమావేశానికి హాజరైన మూడు పార్టీల ఎమ్మెల్యేలు హర్షధ్వానాలతో ఈ నిర్ణయాన్ని ఆమోదించారు. ఈ సందర్భంగా మూడు పార్టీల సారథులు ఎమ్మెల్యేలను ఉద్దేశించి ప్రసంగించారు. సుమారు రెండు గంటలపాటు ఈ సమావేశం జరిగింది.

గవర్నర్‌ నుంచి ఆహ్వానం...

ఈ భేటీ ముగిసిన తర్వాత టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి, జనసేన పీఏసీ చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ కలిసి గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ను కలిశారు. సభా నేతగా చంద్రబాబుకు మద్దతు ఇస్తున్నట్లు మూడు పార్టీల తరఫున విడివిడిగా లేఖలు సమర్పించారు. ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించాలని గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు. అనంతరం ప్రభుత్వ ఏర్పాటుకు చంద్రబాబును ఆహ్వానిస్తూ గవర్నర్‌ ఒక లేఖ పంపారు. ఆ తర్వాత మంగళవారం సాయంత్రం చంద్రబాబు రాజ్‌ భవన్‌కు వెళ్లి గవర్నర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఆ తర్వాత చంద్రబాబు నివాసంలో కొందరు ఉన్నతాధికారులు ఆయనను కలిసి ప్రమాణ స్వీకార కార్యక్రమ ఏర్పాట్లపై చర్చించారు.

నేతల రాక...

చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనడానికి కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జేపీ నడ్డా మంగళవారం రాత్రి విజయవాడకు చేరుకున్నారు. గన్నవరం విమానాశ్రయం నుంచి వారు నేరుగా అమరావతిలోని చంద్రబాబు నివాసానికి వెళ్లారు. ఆయనతో కలిసి రాత్రి భోజనం తర్వాత నోవాటెల్‌ హోటల్‌కు చేరుకొని అక్కడ రాత్రి బస చేశారు. మంగళవారం సాయంత్రం కొంత విరామం తీసుకొని చంద్రబాబు తన మంత్రివర్గ కూర్పుపై కసరత్తు చేశారు.

నేడు ప్రధాని రాక

ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రధాని మోదీ బుధవారం విజయవాడ రానున్నారు. ప్రమాణ స్వీకార ముహూర్తానికి కొంత ముందు ఆయన రానున్నారు. ఇక్కడ చంద్రబాబు ప్రమాణ స్వీకారం తర్వాత ఆయన భువనేశ్వర్‌ వెళ్లి ఒడిసా నూతన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొంటారని సమాచారం. కాగా... చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ప్రసంగాలు ఏవీ ఉండవని నిర్వాహకులు పేర్కొన్నారు. ప్రధాని ప్రసంగం కూడా ఉండబోదని అంటున్నారు. ప్రమాణ స్వీకారం తర్వాత అదే ప్రాంగణంలో కొత్త మంత్రులతో అల్పాహార విందు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీనికి ప్రధానిని కూడా ఆహ్వానించారు.

Updated Date - Jun 12 , 2024 | 03:35 AM