చంద్రబాబు లౌకికవాది: ఎంఏ షరీఫ్
ABN , Publish Date - May 12 , 2024 | 03:57 AM
లౌకికవాది చంద్రబాబు మత సామరస్యాన్ని కాపాడతారు. రాష్ట్రంలో ముస్లిం, మైనార్టీలకు అండగా ఉంటారు’ అని టీడీపీ నేతలు పునరుద్ఘాటించారు.

అమరావతి, మే 11(ఆంధ్రజ్యోతి): ‘లౌకికవాది చంద్రబాబు మత సామరస్యాన్ని కాపాడతారు. రాష్ట్రంలో ముస్లిం, మైనార్టీలకు అండగా ఉంటారు’ అని టీడీపీ నేతలు పునరుద్ఘాటించారు. ముస్లింలకు 4శాతం రిజర్వేషన్‌కు కట్టుబడి ఉన్నామని చంద్రబాబు స్పష్టంగా చెప్పారని గుర్తుచేశారు. జాతీయ స్థాయి ముస్లిం మత పెద్దలు చంద్రబాబును బలపర్చి, కూటమికి మద్దతు తెలిపారని వెల్లడించారు. శనివారం టీడీపీ జాతీయ కార్యాలయంలో ఎమ్మెల్సీలు పర్చూరి అశోక్‌బాబు, పంచుమర్తి అనురాధతో కలసి శాసనమండలి మాజీ చైర్మన్ ఎంఏ షరీఫ్ మీడియాతో మాట్లాడారు. ‘ఓటమి భయంతో తప్పుడు ప్రచారం చేస్తున్న వైసీపీ.. ముస్లిం 4ు రిజర్వేషన్‌ను రద్దు చేస్తారంటూ అసత్యప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు, అచ్చెన్నాయుడు పేరుమీద ఫేక్ లెటర్స్ సృష్టించి, సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ముస్లింల రిజర్వేషన్ రద్దు చేస్తారని పురందేశ్వరి ఎప్పుడూ అనలేదు. చంద్రబాబు వైసీపీ పాలనలో మైనార్టీ కార్పొరేషన్ ద్వారా ముస్లింలకు చేసిన సాయం శూన్యం’ అని అన్నారు.