Share News

Chandrababu : నేటి నుంచే ప్రజాపాలన

ABN , Publish Date - Jun 12 , 2024 | 03:26 AM

‘మూడు రాజధానులంటూ రాష్ట్ర భవిష్యత్‌తో ఆటలాడుకోవడం ఉండదు. అమరావతే మన రాజధాని, విశాఖను ఆర్థిక రాజధానిగా, ప్రత్యేకమైన సిటీగా తయారుచేసుకుందాం.

Chandrababu : నేటి నుంచే ప్రజాపాలన

ప్రతి అడుగూ ప్రజల కోసమే.. కూల్చివేతలు, నరికివేతలు ఉండవు.. తెలుగు జాతిని నంబర్‌ వన్‌ చేద్దాం!

3 రాజధానుల ఆటలుండవ్‌

అమరావతే రాష్ట్ర రాజధాని

పవన్‌ కల్యాణ్‌ స్ఫూర్తి భేష్‌

ప్రజాప్రయోజనాల కోసం బీజేపీతో కలిసి పనిచేశాం

టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యలు

అమరావతి, జూన్‌ 11 (ఆంధ్రజ్యోతి): ‘మూడు రాజధానులంటూ రాష్ట్ర భవిష్యత్‌తో ఆటలాడుకోవడం ఉండదు. అమరావతే మన రాజధాని, విశాఖను ఆర్థిక రాజధానిగా, ప్రత్యేకమైన సిటీగా తయారుచేసుకుందాం. కర్నూలును అభివృద్ధి చేస్తాం’ అని టీడీపీ అధినేత చంద్రబాబు ఉద్ఘాటించారు. మంగళవారం విజయవాడలో టీడీపీ, జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలు తనను కూటమి శాసనసభా పక్ష నేతగా ఎన్నుకున్న తర్వాత ఆయన వారినుద్దేశించి ప్రసంగించారు. వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో బుధవారం నుంచే ప్రజా పరిపాలన సాగుతుందన్నారు. ప్రతి అడుగూ ప్రజల కోసమేనని స్పష్టం చేశారు. తాను చాలా ఎన్నికలు చూశానని.. ప్రజలు ఈ సారి రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ చూడని తీర్పు ఇచ్చారని.. ఈ తీర్పును నిలబెట్టుకునే బాధ్యత మనపై ఉందని తెలిపారు. ‘ఈ ఎన్నికల్లో ప్రజలు గెలిచారు, రాష్ట్రాన్ని నిలబెట్టే బాధ్యత ఇక్కడుండే శాసనసభ్యులమైన మనందరిపై ఉందన్నారు. అరాచక పాలన, విధ్వంసకర పాలనకు వ్యతిరేకంగా ఈ మూడు పార్టీల కలయిక అద్భుతం. ఎన్నికల తర్వాత సాధారణంగా ఒకరిపై మరొకరు ఫిర్యాదులు చేసుకునేవారు. ఈ సారి కార్యకర్తలు, నాయకులు సమష్టిగా పనిచేశారు. ప్రజల మనోభావాలకు అనుగుణంగా ప్రవర్తించారు’ అని కొనియాడారు. ధన్యవాదాలు తెలిపారు. ఏ అహంకారంతో విర్రవీగిపోయారో ఆ అహంకారం కూలిపోయిందని వైసీపీ నేతలనుద్దేశించి అన్నారు. ఇంకా ఏమన్నారంటే..

అరుదైన అనుభవం..

1994లో ఏకపక్షంగా ఎన్నికలు జరిగాయి. కానీ ఇప్పుడు 175 సీట్లలో 164 చోట్ల గెలిచి 93 శాతం సీట్లు సాధించాం. దేశ చరిత్రలోనే ఇది అరుదైన అనుభవం. 50 శాతం ఓట్లు అంటేనే ఎక్కువ.. అలాంటిది 57 శాతం వేశారంటే మనపై జనం ఎన్ని ఆశలు పెట్టుకున్నారో అర్థమవుతోంది. చరిత్రలో ఎప్పుడూ గెలవని విధంగా కడప జిల్లాలో 7 సీట్లలో ఐదు సీట్లు గెలిచాం. బీజేపీ పది సీట్లు తీసుకుంటే 8 గెలిచింది. జనసేన 21కి 21 సీట్లూ గెలిచింది. ఇదో చరిత్ర. మీ గెలుపుతో ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్‌ ప్రతిష్ఠ, గౌరవం పెరిగాయి. ఎంపిక చేసినప్పుడు ఏ సీటు ఏ పార్టీ, ఏ అభ్యర్థి తీసుకుంటే గెలుస్తారో ఆలోచించాం. సీట్ల ఎంపికలో ఈసారి పెద్దగా సమస్యలు రాలేదు. సీట్లు ఇచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ గౌరవించి గెలిపించారు. వేరే రాష్ట్రాలకు కూలి పనుల కోసం వెళ్లిన వారు సైతం వారి సొంత డబ్బులు పెట్టుకుని వచ్చి ఓటు వేశారు. ఇతర దేశాల్లో ఉండే ఎన్నారైలు లక్షలు ఖర్చు పెట్టుకుని వచ్చి మరీ ఓటేశారు.


వ్యతిరేక ఓటు చీలకూడదన్న పవన్‌..

పవన్‌ కల్యాణ్‌ స్ఫూర్తిని మరచిపోలేను. నేను జైలులో ఉన్నప్పడు పరామర్శించారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని చెబుతూ వచ్చిన పవన్‌.. ఆ రోజు జైలు నుంచి బయటకు వచ్చి టీడీపీతో జనసేన పొత్తు ఉంటుందని మొట్టమొదటసారిగా చెప్పారు. రాష్ట్ర ప్రజల ప్రయోజనాల దృష్ట్యా ఇద్దరం బీజేపీతో పొత్తు పెట్టుకున్నాం. ఆ రోజు నుంచి ఎలాంటి పొరపొచ్చాలు లేకుండా పనిచేశాం. ఎందుకు పొత్తు పెట్టుకున్నామో ధర్మవరం నియోజకవర్గ సభలో అమిత్‌షా స్పష్టత ఇవ్వడంతో రాష్ట్ర ప్రజలకు ఈ కూటమిపై నమ్మకం ఏర్పడింది. అనంతరం కూటమి తరఫున ప్రధాని మోదీ రాజమండ్రిలో స్పష్టత ఇచ్చారు. విజయవాడ రోడ్‌షో బ్రహ్మాండంగా జరిగిందని ప్రశంసించారు. ప్రతి ఒక్కరూ మనసు పెట్టి పనిచేయబట్టే ఇంత గెలుపు వచ్చింది. రాష్ట్రానికి కేంద్ర సహకారం అవసరం. కేంద్ర నాయకత్వాన్ని స్పష్టంగా కోరాను. పూర్తిగా సహకరిస్తామని మోదీ, అమిత్‌ షా, జేపీ నడ్డా హామీ ఇచ్చారు. ఈ రోజు రాష్ట్రంలో చాలా సమస్యలున్నాయి. నా అనుభవంతో మీ అందరి సహకారంతో పవన్‌ కల్యాణ్‌ సహకారంతో పేద ప్రజల జీవితాలను మార్చి కృతజ్ఞత చాటుకుందాం.

చట్టపరంగా శిక్షించాలి..

పదవి వస్తే వినయం అవసరం. రేపు అనేది లేకుండా వ్యవహరిస్తే ఇదే జరుగుతుంది. ఇదంతా ఒక కేసు స్టడీగా తీసుకోవాలి. ప్రజలు బూతులు మాట్లాడే నేతలను, అరాచక శక్తులను చూశారు. గత ఐదేళ్లు పరిపాలన చేసిన వ్యక్తిని చూసిన తర్వాత ఇలాంటి వ్యక్తి పాలనకు పనికిరాడని తీర్పు ఇచ్చారు. మనం కూడా కక్ష తీర్చుకోవాలనుకుంటే సమస్యలొస్తాయి. అలాగని తప్పుచేసిన వాడిని క్షమిస్తే కూడా అలవాటుగా మారుతుంది. తప్పు చేసిన వారిని చట్టపరంగా శిక్షించాల్సిన అవసరముంది.

అప్పులు, తాకట్టుపై అధ్యయనం

రాష్ట్రం పూర్తిగా శిథిలమైపోయింది. ప్రభుత్వంలో ఏముందో తెలియదు.. ఎంత అప్పు ఉందో, ఎక్కడెక్కడ తెచ్చారో తెలియదు.. ఏదేది తాకట్టు పెట్టారో అధ్యయనం చేయాలి. ఇరిగేషన్‌ రంగాన్ని నిర్వీర్యం చేశారు. పోలవరం ముఖ్యమైన ప్రాజెక్టు. మనం ఉన్నప్పుడు కేంద్రం పూర్తిగా సహకారం అందించింది. దానిని పూర్తి చేసే కార్యక్రమం మన ముందు ఉంది. వ్యవసాయ రంగం పూర్తిగా సంక్షోభంలో పడింది. ఐదేళ్లలో 9 సార్లు విద్యుత్‌ చార్జీలు పెంచారు. పదేళ్ల తర్వాత మన రాజధాని ఏది అంటే చెప్పలేని దుస్థితిలో ఉన్నాం. కక్షపూరిత రాజకీయాలు కాకుండా నిర్మాణాత్మక రాజకీయాలు చేయాలి. ఏ ఒక్కరి ఆత్మగౌరవానికి భంగం కలగకూడదు. ప్రజాహితం కోసం పనిచేస్తాం. ప్రతి నిర్ణయం, ప్రతి అడుగు దీరా కోసమే. రాష్ట్రమే మొదట అనే నినాదంతో ముందుకెళ్తాం. ఏవైనా తప్పులు జరిగితే సలహాలు ఇచ్చే విధానాన్ని నెలకొల్పుతాం. రాష్ట్ర పునర్నిర్మాణానికి అందరూ కలిసికట్టుగా సాగాలి. ప్రపంచ దేశాల్లో భారత్‌ నంబర్‌వన్‌గా తయారుకావాలి. 2047 నాటికి భారత్‌ మొదట స్థానంలో ఉంటుంద. ప్రపంచంలో భారతీయులు నంబర్‌ వన్‌గా ఉండాలి. తెలుగుజాతి ప్రపంచంలో నంబర్‌వన్‌గా ఉండాలి. శాసనసభాపక్ష నేతగా హామీ ఇస్తున్నా. ప్రజా పరిపాలన దిశగా ముందుకెళ్తా.

మనది ప్రజా ప్రభుత్వం. కూల్చివేతలుండవు. గతంలో సీఎం వస్తే చెట్లు కొట్టివేత, షాపుల బంద్‌ జరిగేవి. పరదాలు కట్టేవారు. నేను మామూలు మనిషిగానే వస్తా. అందరితో కలిసి ఉంటా. మేమందరం సామాన్య వ్యక్తులుగానే ప్రజల ముందుకు వస్తాం. హోదా అనేది సేవ కోసం తప్ప పెత్తనం కోసం కాదు. సీఎం వస్తే ప్రజలకు ఇబ్బంది కలగకూడదని ఆదేశాలిచ్చాను.

నా కుటుంబానికి జరిగిన అవమానంతో.. శాసనసభను కౌరవసభ చేశారని, ఈ సభను గౌరవ సభను చేసి అడుగుపెడతానని శపఽథం చేసి వచ్చాను. ఆ శపథాన్ని ప్రజలు గౌరవించారు. ఆ గౌరవాన్ని నిలబెట్టుకోవలసిన అవసరముంది.

గతంలో ఎన్నికలైన తర్వాత పలు దఫాలు సమీక్ష చేశాను. కానీ ఇలాంటి విజయం, సంతృప్తి ఎప్పుడూ లేవు. ఈ సారి కొన్ని చోట్ల 95 వేల మెజారిటీతో గెలిచారు.

- చంద్రబాబు

అందరితో సమానంగానే... పెద్ద కుర్చీ వద్దన్న బాబు..

మూడు పార్టీల ఎమ్మెల్యేల సమావేశ వేదికపై పవన్‌ కల్యాణ్‌, అచ్చెన్నాయుడు, చంద్రబాబు, పురందేశ్వరి కోసం కుర్చీలు వేశారు. శాసనసభాపక్ష నేతగా చంద్రబాబు కోసం ప్రత్యేకంగా పెద్ద కుర్చీ ఏర్పాటు చేశారు. సమావేశం మందిరంలోకి ప్రవేశించిన తర్వాత చంద్రబాబు పెద్ద కుర్చీ చూసి తనకు కూడా అందరితో సమానంగా ఉన్న కుర్చీ వేయాలని, పెద్దది వద్దని సూచించారు. దీంతో సిబ్బంది కుర్చీని మార్చారు.

Updated Date - Jun 12 , 2024 | 03:27 AM