Share News

Chandrababu : చరిత్రలో ఎన్నడూ లేనన్ని దొంగ ఓట్లు

ABN , Publish Date - Jan 17 , 2024 | 03:24 AM

రాష్ట్రంలో అడ్డూ అదుపూ లేకుండా ఓటరు జాబితాలను మార్చేస్తున్నారు. దేశ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఓట్ల తారుమారు జరుగుతోంది.

Chandrababu : చరిత్రలో ఎన్నడూ లేనన్ని దొంగ ఓట్లు

వైసీపీ నేతల చేతుల్లోకి ఆర్వోల లాగిన్‌, పాస్‌వర్డ్‌

ఇష్టానుసారంగా ఓటరు జాబితాల తారుమారు

ఈసీకి కేస్‌ స్టడీగా చంద్రగిరి ఓటర్ల వివరాలు

వైసీపీ నేతలకు డబ్బులు ఎలా వస్తున్నాయో?

ఓడిపోతామన్న భయంతో కుప్పంలో అరాచకాలు: బాబు

తిరుపతి, జనవరి 16(ఆంధ్రజ్యోతి): ‘‘రాష్ట్రంలో అడ్డూ అదుపూ లేకుండా ఓటరు జాబితాలను మార్చేస్తున్నారు. దేశ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఓట్ల తారుమారు జరుగుతోంది. వైసీపీ నాయకులు ఓటమి భయంతో టీడీపీ సానుభూతిపరుల ఓట్లను తీసేస్తున్నారు. దొంగ ఓట్లను నమోదు చేస్తున్నారు’’ అని టీడీపీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని స్వగ్రామమైన చంద్రగిరి మండలం నారావారిపల్లెకు వచ్చిన ఆయన సోమవారం తిరుగు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో చంద్రగిరి నియోజకవర్గం టీడీపీ ఇన్‌చార్జి పులివర్తి నానిని మార్గమధ్యంలో చంద్రబాబు పరామర్శించారు. అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ ఓటర్ల జాబితాల తారుమారు విషయం లో వైసీపీ నేతలు అనుసరిస్తున్న వైఖరిపై నిప్పులు చెరిగారు. ‘‘ఎక్కడ చూసినా వైసీపీ నేతలు దుర్మార్గం గా దొంగ ఓట్లు చేరుస్తున్నారు. ఇటీవలే తిరుపతి కలెక్టర్‌, ఎస్పీలను ఎన్నికల కమిషన్‌ సీరియస్ గా హెచ్చరించింది. పారదర్శకంగా పనిచేయలేకపోతే రాజీనా మా చేయండి, లేదంటే సెలవు పెట్టి వెళ్లమంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది’’ అని అన్నారు.

స్వగ్రామంలో నారా వారి సందడి

సంక్రాంతి పండుగ కోసం స్వగ్రామమైన చంద్రగిరి నియోజకవర్గంలోని నారావారి పల్లెకు వచ్చిన చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులు సందడి చేశారు. సోమవారం ఉదయం 10.30 గంటలకు సంప్రదాయ పంచెకట్టు ధరించి తన సతీమణి భువనేశ్వరి, కుమారుడు లోకేశ్‌, మనవడు నారా దేవాన్ష్‌లతో కలిసి గ్రామ దేవత దొడ్డి గంగమ్మకు, కులదైవం నాగాలమ్మకు చంద్రబాబు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తన తల్లిదండ్రులు నారా ఖర్జూర నాయుడు, అమ్మణ్ణమ్మల సమాధుల వద్ద నివాళులర్పించారు. అదేవిధంగా ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నందమూరి కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు.

భారీ తప్పిదాలు

చంద్రగిరి మాదిరిగానే మరో ఎనిమిది నియోజకవర్గాల్లో కూడా ఓటర్ల జాబితాల్లో భారీ తప్పిదాలు జరిగినట్టు గమనించామని చంద్రబాబు అన్నారు. ఎన్నికల సమయంలో అధికారుల బదిలీలు కూడా పారదర్శకంగా లేవన్నారు. ‘‘వలంటీర్లు పార్టీలకు కొమ్ముకాయకూడదు. తిరుపతి ఉప ఎన్నిక సమయంలో పెట్టిన కేసులను అధికారులు వదిలేశారు. తుది ఓటరు జాబితా వస్తేగానీ మేమిచ్చిన ఫిర్యాదులపై స్పష్టత రాదు. పోలీస్‌ వ్యవస్థ భ్రష్టుపట్టింది. వారు సరిగ్గా వ్యవహరించివుంటే సమస్య వచ్చేదికాదు. రాష్ట్రంలో అత్యధిక మెజారిటీతో నన్ను గెలిపించే కుప్పంలో కూడా నేరాలు, ఘోరాలు పెచ్చుమీరాయి. ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేస్తున్నారు’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తున్న అంగన్వాడీల న్యాయమైన సమస్యలను పరిష్కరిస్తామని చంద్రబాబు చెప్పారు. వారిపట్ల వైసీపీ ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోందని అన్నారు.

రేపు అనేది లేదనుకున్నారు!

‘‘వైసీపీ నాయకులకు డబ్బులు ఎక్కడ నుంచి వస్తున్నాయో అర్థం కావడంలేదు. ఎప్పడూ చూడని విధంగా మనీ పవర్‌, భూకబ్జాలు, దోచుకోవడాలు, ఆ డబ్బులతో ప్రజల్ని మభ్యపెట్టే విధంగా కానుకలు పంపిణీ చేయడం వంటివి చేస్తున్నారు. ఇవి అవినీతికి, అక్రమాలకు, దౌర్జన్యాలకు పరాకాష్ఠ. అధికారుల లాగిన్‌, పాస్‌వర్డ్‌ వైసీపీ నేతల చేతుల్లోకి వెళ్లిపోవడంతో ఓటర్ల జాబితాలను తారుమారు చేస్తున్నారు. పోలింగ్‌ బూత్‌లు, నియోజకవర్గాలు మార్చారు. కరుడుకట్టిన నేరస్తులు, ఉగ్రవాదుల కంటే దారుణంగా వ్యవహరిస్తున్నారు. రేపు అనేది లేదనుకుని బరితెగిస్తున్నారు. అవకతవకలపై అధికారులకు స్పష్టంగా తెలియజేశాం. చంద్రగిరిని కేస్‌ స్టడీగా తీసుకోమన్నాం. ఎన్నికల విధులు బాధ్యతాయుతమైనవి. తప్పులు చేస్తే జైలుకుపోతారు. టీచర్లు, సీనియర్‌ ఉద్యోగులను ఎన్నికల విధుల్లోకి తీసుకోకుండా వైసీపీకి కావాల్సిన సచివాలయ సిబ్బందిని తీసుకుని అక్రమాలకు తలుపులు తెరిచా రు. ఇవన్నీ ఇకపై జరగవు. వారిని ఇంటికి పంపించాలని ప్రజలు నిర్ణయించుకున్నారు’’ అనితెలిపారు.

Updated Date - Jan 17 , 2024 | 10:58 AM