Share News

చంద్రబాబు మాస్టర్‌ స్ట్రోక్‌

ABN , Publish Date - Feb 25 , 2024 | 03:58 AM

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఆకస్మిక సంచలనానికి తెరదీశారు. తమ పార్టీకి చెందిన 94 మంది అభ్యర్థుల జాబితాను శనివారం ఒకేసారి విడుదల చేశారు.

చంద్రబాబు మాస్టర్‌ స్ట్రోక్‌

ఒకేసారి 94 మంది అభ్యర్థుల ప్రకటన

ఎన్నికల షెడ్యూల్‌కు ముందే భారీ జాబితా

టీడీపీ రాజకీయ చరిత్రలోనే అసాధారణం

ఇంకా ఇన్‌చార్జులను మార్చే దగ్గరే వైసీపీ..

అభ్యర్థుల ప్రకటనతో టీడీపీ సంచలనం

బీజేపీ కోసం ఆగిన టీడీపీ, సేన ఎంపీ జాబితా

పొత్తుపై క్లారిటీ రాగానే విడుదలకు వీలు

అమరావతి, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఆకస్మిక సంచలనానికి తెరదీశారు. తమ పార్టీకి చెందిన 94 మంది అభ్యర్థుల జాబితాను శనివారం ఒకేసారి విడుదల చేశారు. జనసేనతో కలిపి మొత్తం తొంభై తొమ్మిది మంది అభ్యర్థులతో జాబితా విడుదల అయింది. చంద్రబాబు తెలుగుదేశం పార్టీ అధ్యక్షునిగా బాధ్యతలు తీసుకొన్న తర్వాత గత 29 ఏళ్లలో ఎన్నికల షెడ్యూల్‌ విడుదల కావడానికి ముందే ఇంతమంది అభ్యర్థుల పేర్లు ప్రకటించడం ఇదే ప్రఽథమం. గతంలో ఎన్టీఆర్‌ పార్టీ అధ్యక్షునిగా ఉన్నప్పుడు ఎన్నికలకు 3 నెలల ముందు 40 మంది అభ్యర్థుల పేర్లు ప్రకటించారు. ఆ తర్వాత ఇంత భారీగా జాబితా ప్రకటించడం ఇదే మొదలు. ‘‘చంద్రబా బు తన రాజకీయ ప్రత్యర్థులకు మాస్టర్‌ స్ట్రోక్‌ ఇచ్చారు. అధికా ర పార్టీ వైసీపీ ఇంతవరకూ అధికారికంగా తన అభ్యర్థులను ఎవరినీ ప్రకటించలేదు. ఇప్పటికి ప్రకటించిన వారంతా కేవ లం ఇన్‌చార్జులు మాత్రమేనని.. ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. అభ్యర్థుల అసలు జాబితా తర్వాత ఎప్పుడో వస్తుందని ఆ పార్టీ చెబుతోంది. దాంతో పోలిస్తే చంద్రబాబు నేరుగా అభ్యర్థులను ప్రకటించేశారు. ఆయన ఇంత త్వరగా నిర్ణయం తీసుకొంటారని ప్రత్యర్థులు ఊహించలేదు’’ అని టీడీపీ ము ఖ్యుడు ఒకరన్నారు. రాష్ట్రంలో మొత్తం 175 సీట్లు ఉండగా, అందులో 60 శాతం సీట్లకు అభ్యర్థులను చంద్రబాబు ప్రకటించారు. ఆయన పార్టీ అంతర్గత సమాచారం ప్రకారం, ఈ జాబితా పదిరోజుల క్రితమే ఖరారైంది. విడుదలకు ముందు మరోసారి తనిఖీ చేసి ఒకటి రెండు మార్పుచేర్పులు చేశారు. ఉదాహరణకు ఉమ్మడి నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు జిల్లాలకు సంబంధించి తమ జాబితాలో ఒక్క మహిళ పేరు కూడా లేకపోవడం గమనించి ఆఖరు క్షణంలో నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో డాక్టర్‌ నెలవల విజయశ్రీ పేరు చేర్చారు. ఆమె తండ్రి నెలవల సుబ్రమణ్యం ప్రస్తుతం ఆ నియోజకవర్గానికి టీడీపీ ఇన్‌చార్జిగా ఉన్నారు. మహిళా అభ్యర్థి కోసం చేసిన అన్వేషణలో ఆయన కుమార్తెకు అవకాశం దక్కింది. రాజమండ్రి రూరల్‌ సిటింగ్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేరును జాబితాలో చేర్చాలా వద్దా అన్నదానిపై ముందురోజు అర్ధరాత్రి వరకూ తర్జనభర్జనలు జరిగాయి. ఇదే సీటును జనసేనలో ప్రముఖ నేత కందుల దుర్గేశ్‌ కూడా ఆశిస్తుండటంతో చివరకు పెండింగ్‌లో పడింది. అభ్యర్థుల ప్రకటన ముగిసిన తర్వాత చంద్రబాబు మీడియా ప్రతినిధులతో పిచ్చాపాటీగా మాట్లాడినప్పుడు గోరంట్ల ప్రస్తావన వచ్చింది. ‘‘బుచ్చయ్యను, దుర్గేశ్‌ను ఇద్దరినీ పిలిచి మాట్లాడాలని ఆపాం. ఆ ఇద్దరికీ చోటు లభిస్తుంది. బుచ్చయ్య సీనియర్‌ నాయకుడు. ఆయనకు ఉన్నచోటే అవకాశం లభిస్తుంది’’ అని చంద్రబాబు చెప్పారు.

ముహూర్తం ప్రకారం...

తొలి జాబితాను చంద్రబాబు సరిగ్గా ముహూర్తం ప్రకారం విడుదల చేశారు. శనివారం మాఘ పౌర్ణమి సందర్భంగా ఉదయం పదకొండు గంటల నలభై నిమషాలకు మంచి ఘడియలు ప్రారంభం అవుతుండటంతో, ఆ సమయంలో జాబితా ప్రకటన చేశారు. దీనికి ముందు జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌, ఆయన సోదరుడు నాగబాబు...టీడీపీ అధినేత నివాసానికి తమ పార్టీ నేతలతో కలిసి వచ్చారు. జాబితా విడుదల కోసం చంద్రబాబు నివాసం ఆవరణలో ఒక వేదిక ఏర్పాటుచేసి, దాని వద్దకు మీడియా ప్రతినిధులను ఆహ్వానించారు. కొందరు టీడీపీ సీనియర్లు కూడా చంద్రబాబు ఆహ్వానంతో సమావేశానికి హాజరయ్యారు. టీడీపీ, జనసేన ఎన్నికల గుర్తులు సైకిల్‌, గాజుగ్లాస్‌ కలిసి వచ్చేలా ఒక లోగో డిజైన్‌ చేసి ప్రదర్శించారు.

తాడేపల్లి గూడెం సభ తర్వాత ఎంపీ జాబితా!

శనివారం టీడీపీ, జనసేనకు సంబంధించి కేవలం అసెంబ్లీ అభ్యర్థుల జాబితా మాత్రమే విడుదలైంది. ఎంపీ సీట్లకు కూడా ఈ రెండు పార్టీలు తమ అభ్యర్థులను చాలావరకు ఖరారు చేసుకొన్నా, ఆ పేర్లు విడుదల చేయలేదు. బీజేపీతో పొత్తు చర్చలు ఇంకా ఒక కొలిక్కి రాకపోవడంతో ఎంపీ అభ్యర్థుల ప్రకటన వాయిదా వేశారు. ఈ నెల 28వ తేదీన టీడీపీ, జనసేన పార్టీల ఉమ్మడి బహిరంగ సభ తాడేపల్లి గూడెంలో జరగనుంది. ఆ సభ తర్వాత ఎంపీ అభ్యర్థుల పేర్లు, మరికొందరు అసెంబ్లీ అభ్యర్థుల పేర్లు విడుదలయ్యే అవకాశం ఉంది.

Updated Date - Feb 25 , 2024 | 03:58 AM