Share News

Chandrababu: ఫ్యాన్‌ రెక్కల్ని ప్రజలే విరగ్గొట్టేస్తారు.. తీవ్రంగా హెచ్చరించిన బాబు

ABN , Publish Date - Jan 29 , 2024 | 03:01 AM

‘‘జగన్‌ రెడ్డి పురాణాల గురించి మాట్లాడుతున్నాడు. నేను అభిమన్యుడిని కాను, అర్జునుడిని అంటున్నాడు. జగన్‌రెడ్డీ నువ్వు అభిమన్యుడివి కావు, అర్జునుడివీ కావు.. నువ్వో భస్మాసురుడివి. నీకు ఓటు వేసిన వాళ్ల నెత్తినే చెయ్యిపెట్టిన వ్యక్తివి. నీకు వ్యతిరేకంగా ఓటేసి నిన్ను భస్మం చేసే

Chandrababu: ఫ్యాన్‌ రెక్కల్ని ప్రజలే విరగ్గొట్టేస్తారు.. తీవ్రంగా హెచ్చరించిన బాబు
కర్నూలు జిల్లా పత్తికొండ సభకు హాజరైన జనం, మాట్లాడుతున్న చంద్రబాబు

ఓటేసిన ప్రజల తలపై చెయ్యిపెట్టి జీవితాలను భస్మం చేస్తున్నాడు

‘జగనాసురుడి’ని ఓటుతో తరిమికొట్టండి

వైసీపీ ప్రభుత్వానికి మిగిలింది 73 రోజులే

‘పేద బిడ్డ’ లక్షల కోట్ల ఆస్తులు పోగేశాడు

ఫ్యాన్‌ రెక్కల్ని ప్రజలే విరగ్గొట్టేస్తారు

వైసీపీని ఓడించేందుకు జనం ‘సంసిద్ధం’

సీఎంపై టీడీపీ అధినేత చంద్రబాబు ఫైర్‌

నెల్లూరు, పత్తికొండల్లో ‘రా..కదలిరా’ సభలు

గెట్‌ రెడీ జగన్‌ రెడ్డీ. నీ ఫ్యాన్‌ బాదుడు రెక్కల్ని ఉత్తరాంధ్ర ప్రజలు విరిచేస్తారు. ఇన్‌ఫ్రా రాజకీయ రెక్కల్ని సీమ ప్రజలు తుంచేస్తారు. నీ విధ్వంస నిర్ణయాల రెక్కల్ని కోస్తా ప్రజలు పీకి పాతరేస్తారు. కడాన నిన్ను ఇంటికి పంపిస్తారు.

-చంద్రబాబు

నెల్లూరు/కర్నూలు, జనవరి 28(ఆంధ్రజ్యోతి): ‘‘జగన్‌ రెడ్డి పురాణాల గురించి మాట్లాడుతున్నాడు. నేను అభిమన్యుడిని కాను, అర్జునుడిని అంటున్నాడు. జగన్‌రెడ్డీ నువ్వు అభిమన్యుడివి కావు, అర్జునుడివీ కావు.. నువ్వో భస్మాసురుడివి. నీకు ఓటు వేసిన వాళ్ల నెత్తినే చెయ్యిపెట్టిన వ్యక్తివి. నీకు వ్యతిరేకంగా ఓటేసి నిన్ను భస్మం చేసే బాధ్యత 5 కోట్ల మంది ఆంధ్రులు తీసుకున్నారు. ఖబడ్దార్‌!’’ అని చంద్రబాబు తీవ్రస్థాయిలో హెచ్చరించారు. ఆదివారం నెల్లూరు, కర్నూలు జిల్లాలోని పత్తికొండల్లో నిర్వహించిన ‘రా..కదలిరా’ సభల్లో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో కూల్చుడు, నొక్కుడు, బొక్కుడు, బొంకుడు ప్రభుత్వాన్ని కూల్చడానికి ప్రజలు సంసిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. ‘‘పేదల కడుపు కొట్టిన వ్యక్తి జగన్‌. చంద్రన్న బీమా, పండుగ కానుకలు, విదేశీ విద్య వంటి వంద పథకాలను రద్దు చేసిన వ్యక్తి పేద బిడ్డా!?. ఈ దేశంలో అందరు ముఖ్యమంత్రులకు కలిపి ఎన్ని ఆస్తులున్నాయో, ఒక్క జగన్‌కి అంతకన్నా ఎక్కువ ఆస్తులున్నాయి. మరోవైపు ఇల్లే లేదంటున్నారు. కానీ, తాడేపల్లిలో పెద్ద ప్యాలెస్‌, బెంగళూరులో మరో పెద్ద ప్యాలెస్‌, పులివెందులలో ఇంకో ప్యాలెస్‌, హైదరాబాద్‌ లోట్‌సపాండ్‌లో ఒక ప్యాలెస్‌ ఇవన్నీ చాలవన్నట్లు నిన్ననే రుషికొండను బోడికొట్టించి ఆక్కడ మరొక ప్యాలెస్‌ కడుతున్నాడు. ఈ పేద బిడ్డ బతకలేడని పాపం రూ.500 కోట్లు ఖర్చుపెట్టి అది కూడా సముద్రం వైపు ఫేసింగ్‌ పెట్టి ఆ పెద్ద ప్యాలస్‌ కడుతున్నారు’’ అని చంద్రబాబు అన్నారు. అందరికీ ఉద్యోగాలు ఇచ్చేశానని చెప్పుకొంటున్నారని ఎద్దేవా చేశారు. ‘‘ఏం తమ్ముళ్లూ ఉద్యోగాలు ఇచ్చాడా మీకు, జాబ్‌ క్యాలెండర్‌ వచ్చిందా, డీఎ్‌ససీ పెట్టాడా’’ అని సభకు హాజరైన యువతను చంద్రబాబు ప్రశ్నించగా అందరూ ‘లేదు.. లేదు’ అని సమాధానమిచ్చారు. ‘సచివాలయంలో వలంటీర్ల ఉద్యోగం, మటన్‌కొట్టు, బ్రాందీ షాపుల్లో కొలువులు ఇవీ ఈయన ఇచ్చిన ఉద్యోగాలు. వీటినీ ఉద్యోగాలంటారా? రాష్ట్రంలో 24 శాతం నిరుద్యోగులు ఉన్నారని, దేశంలోనే ఎక్కువ శాతం నిరుద్యోగులు ఉన్న రాష్ట్రం ఏపీనేనని నివేదిక ఇచ్చారు. అబద్ధాలు చెప్పడానికి సిగ్గనిపించలేదా’’ అని అన్నారు. ఇంకా ఏమన్నారంటే..

జనం రక్తం తాగుతున్నాడు

టీడీపీ ప్రభుత్వంలో క్వార్టర్‌ మద్యం బాటిల్‌ రూ.60. ఇప్పుడు రూ.200. అప్పుడు నాణ్యమైన మద్యం, ఇప్పుడు నాశిరకం. ప్రజల రక్తం తాగుతున్నాడు. మద్యం అమ్మకాల ద్వారా ప్రతి రోజు సాయంత్రానికి తాడేపల్లి కొంపకు డబ్బు అందకపోతే ఈ సీఎంకి నిద్ర పట్టదు. తొమ్మిదిసార్లు కరెంటు చార్జీలు పెంచి రూ.56 వేల కోట్లు దోచుకున్నాడు.

నేనేం చేశానో మీ నాన్నను అడుగు

జగన్‌ నువ్వు పుట్టకముందు నుంచీ నేను రాజకీయాలు చేస్తున్నా. నేనేం చేశానో మీ నాయన్ను అడుగు కలలోకి వచ్చి చెబుతాడు. హైదరాబాద్‌ నేను వేసిన ఫౌండేషన్‌. ఆ తర్వాత రాజశేఖర్‌రెడ్డితో సహా నలుగురు ముఖ్యమంత్రులు నేను అభివృద్ధి చేసిన హైదరాబాద్‌ ఫలితాలను అనుభవించారు. ఇప్పటికీ అనుభవిస్తున్నారు. నేనేం చేశానో ఊరూరికి వెళ్లి ఐటీ ప్రొఫెషనల్స్‌ను అడుగు వాళ్లే చెబుతారు. నీ విధ్వంస పాలన అంతమొందించడానికి ప్రజలు నిర్ణయించుకున్నారు. నీ ఫ్యానుకు మూడు రెక్కలున్నాయి. తొందర్లో ఆ రెక్కలను విరిచి పక్కన పడేస్తారు. గెట్‌ రెడీ జగన్‌ రెడ్డీ. నీ ఫ్యాన్‌ బాదుడు రెక్కలు ఉత్తరాంధ్ర ప్రజలు విరిచేస్తారు. ఇన్‌ఫ్రా రాజకీయ రెక్కలు సీమ ప్రజలు తుంచేస్తారు. నీ విధ్వంస నిర్ణయాల రెక్కలు కోస్తా ప్రజలు పీకి పాతరేస్తారు. కడాన మొండి ఫ్యానును నీ చేతిలో పెట్టి నిన్ను ఇంటికి పంపిస్తారు.

డైపర్లు వేసుకుని...

ఎప్పుడైతే టీడీపీ, జనసేన పార్టీలు కలిశాయో అప్పుడే వైసీపీకి కాలం చెల్లిందని ఆ పార్టీ నేతలకు అర్థమైంది. సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటు చారిత్రక అవసరమని ప్రజలు గుర్తించారు. ఈ విషయం వైసీపీ నేతలకు కూడా అర్థమైంది. మమ్మల్ని బయటకు విమర్శిస్తున్నారు కానీ, భయంతో డైపర్లు వేసుకొని తిరుగుతున్నారు. కలలో కూడా నేను, పవన్‌ కల్యాణే కనిపిస్తున్నాం. రాష్ట్రాన్ని నెంబర్‌ 1 చేసే బాధ్యత నేను తీసుకున్నా. టీడీపీ, జనసేనలను ఆశీర్వదించండి. సైకో పాలనలో రాష్ట్రం అతలాకుతలమైంది. ఈ పరిస్థితుల నుంచి రాష్ట్రాన్ని రక్షించుకోవడం కోసమే రా...కదిలిరా! అంటూ జనం మధ్యకు వస్తున్నా. జగన్‌ కూడా సిద్ధం అంటున్నాడు. ఆయన సిద్ధం అని పిలుపునిస్తే వైసీపీ నేతలు ఇక సెలవు అంటున్నారు. టికెట్లు ఇస్తామంటే పారిపోతున్నారు. అందుకే రాష్ట్ర భవిష్యత్తు కోసం టీడీపీ, జనసేనలతో కలిసి పనిచేయాలనుకునే వైసీపీ నేతలు, కార్యకర్తలను కూడా రా... కదలిరా! అని పిలుపునిస్తున్నా. రద్దులు, కూల్చివేతలు, దాడులు, అక్రమ కేసులు తప్ప ఈ సైకో జగన్‌కు ఏమీ తెలియవు. రాష్ట్రమంతటా టీడీపీ, జనసేన కూటమి గాలి బలంగా వీస్తోంది. విజయాన్ని ఆపడం ఎవరి తరమూ కాదు. పత్తికొండకు తరలివచ్చిన జనసందోహాన్ని చూస్తే సైకో జగన్‌కు రాత్రి నిద్రపట్టదు. తాడేపల్లి ప్యాలె్‌సలో టీవీలు పగిలిపోతాయి. ఒక ప్రభుత్వంపై ప్రజల్లో ఇంతటి కోపం మునుపెన్నడూ చూడలేదు. ఈ దెబ్బతో వైసీపీ ప్రభుత్వం ఫినిష్‌ అవడం ఖాయం. తాను ప్రజల బిడ్డనని చెప్పుకొంటున్న జగన్‌.. ప్రజల బిడ్డ కాదు.. క్యాన్సర్‌ గడ్డ.

బీసీలకు టీడీపీలోనే సముచిత స్థానం

టీడీపీ అంటే బీసీల పార్టీ. ఎందరో బడుగు, బలహీనవర్గాల నేతలను రాష్ట్రానికి, దేశానికి అందించిన పార్టీ. బీసీ సామాజిక వర్గానికి చెందిన కేఈ కృష్ణమూర్తిని డిప్యూటీ సీఎం చేశాం. యనమల రామకృష్ణుడిని ఆర్థిక మంత్రిని చేశాం. జగన్‌ ప్రభుత్వం వచ్చాక బీసీలకు న్యాయం చేశారా? ఆదరణ సహా వివిధ బీసీ పథకాలు రద్దు చేసిన ఘనత జగన్‌దే. ఆయన వచ్చాక బీసీలపై దాడులు పెరిగాయి. ఈ రోజు కోడికత్తి శ్రీను జైల్లో ఉన్నాడు. బాబాయిని హత్య చేసిన వ్యక్తులు బయట తిరుగుతున్నారు. ఇదీ జగన్‌ నైజం.

ఇక 73 రోజులే

అరాచక పాలనను అంతమొందించేందుకు జగన్‌ను ఇంటికి పంపేందుకు మిగిలినది 73 రోజులే. రాబోయే కురుక్షేత్ర సంగ్రామంలో టీడీపీ, జనసేన ప్రభుత్వం కొలువుదీరుతుంది. ఎవరూ నిర్లక్ష్యంగా ఉండవద్దు. ఈ 73 రోజులు సైకిలెక్కండి.. టీడీపీ, జనసేన జెండాలు పట్టుకోండి.. కష్టపడి పని చేసి మన ప్రభుత్వాన్ని తీసుకురావడం మీరు బాధ్యతగా తీసుకుంటే.. మీ భవిష్యత్తును అందంగా తీర్చేదిద్దే బాధ్యత నేను తీసుకుంటా. ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను తీసుకురావడం వల్ల ఎందరో మాదిగలకు విద్య, ఉద్యోగాల్లో న్యాయం జరిగింది. ఇప్పటికీ ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నాం. కర్నూలు జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యేలు భూకబ్జాలు, ఇసుక దోపిడీ, మద్యం మాఫియాను పెంచి పోషిస్తున్నారు. పత్తికొండ ఎమ్మెల్యే ఫ్యామిలీ మాఫియాకు లీడర్‌గా మారారు. ఆదోని ఎమ్మెల్యే భూకబ్జాలకు కేరాఫ్‌గా మారారు. ఎమ్మిగనూరు ఎమ్మెల్యే తన సొంతూరు పక్కనే వందెకరాలు కాజేశారు. కర్నూలు ఎమ్మెల్యే అవినీతిలో కింగ్‌కాంగ్‌.

పులివెందులలో గెలువు చూస్తాం

  • ‘వైనాట్‌ 175’.. అంటూ ఈ జగన్‌ పదే పదే చెబుతున్నాడు. నేను ఈ పత్తికొండ సభ నుంచి సవాల్‌ విసురుతున్నా.. ముందు పులివెందులలో గెలువు చూస్తా. ఎన్నికలకు ముందే పారిపోయిన పార్టీ వైసీపీ. 69 మంది అభ్యర్థులను మార్చారు. అందులో 29 మంది బీసీ, ఎస్సీలే ఉన్నారు. మీరు మీ ఎమ్మెల్యేలను నమ్మడం లేదు.. ప్రజలు మిమ్మల్ని నమ్మడం లేదు.

  • మాకు ప్రతి ఉద్యోగీ ఒక స్టార్‌ క్యాంపెయినర్‌, ప్రతి పేదవాడు ఒక స్టార్‌ క్యాంపెయినర్‌.. ఐదు కోట్ల మంది ప్రజలు స్టార్‌ క్యాంపెయినర్లుగా మమ్మల్ని నడిపిస్తున్నారు. అఖండ మెజారిటీతో గెలిపించనున్నారు. జగన్‌ పతనం ప్రారంభమైంది. దేవుడు కూడా కాపాడలేడు.

  • జగన్‌.. నువ్వు పుట్టకముందు నుంచీ నేను రాజకీయాలు చేస్తున్నా. నేనేం చేశానో మీ నాయన్ను అడుగు కలలోకి వచ్చి చెబుతాడు. నేనేం చేశానో ఊరూరికీ వెళ్లి ఐటీ ప్రొఫెషనల్స్‌ను అడుగు వాళ్లూ చెబుతారు. మొన్న నాకు కష్టం వస్తే 80 దేశాల్లో ఐటీ ప్రొఫెషనల్స్‌ మద్దతుగా నిలబడ్డారు.

  • ‘వైనాట్‌ 175’.. అంటూ జగన్‌ పదే పదే చెబుతున్నాడు. నేను ఈ పత్తికొండ సభ నుంచి సవాల్‌ విసురుతున్నా.. ముందు పులివెందులలో గెలువు చూస్తా!

-చంద్రబాబు

Updated Date - Jan 29 , 2024 | 07:05 AM