Share News

Chandrababu : రా.. కదలిరా!

ABN , Publish Date - Jan 06 , 2024 | 03:04 AM

రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అన్నది లేకుండా చేసిన నియంత ప్రభుత్వాన్ని ఇంటికి పంపించి.. మళ్లీ మంచి రోజులు రావాలని రాష్ట్ర ప్రజలంతా సంకల్పం తీసుకోవాలని టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు పిలుపిచ్చారు.

Chandrababu : రా.. కదలిరా!

నియంతను సాగనంపుదాం..

ప్రజలకు చంద్రబాబు పిలుపు

ప్రజల్లో వ్యతిరేకత మూటగట్టుకున్న ఎమ్మెల్యేలు, మంత్రులను జగన్‌ ఇతర నియోజకవర్గాలకు మార్చుతున్నాడు. ఈ ఇంట్లో పనికిరాని చెత్త ఆ ఇంట్లో పనికొస్తుందా?అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లు. అయితే ఈ సీఎం అప్పులు తెచ్చి బటన్‌ నొక్కడం తప్ప అభివృద్ధి పట్టించుకోలేదు.

- చంద్రబాబు

జగన్‌ ఒక్క చాన్స్‌ అంటూ వచ్చాడు

రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు

13 లక్షల కోట్ల అప్పులు చేశాడు

ఒక్కరికీ ఉపాధి కల్పించలేదు

జాబ్‌ కేలెండర్‌ అన్నాడు.. ఎవరికి ఉద్యోగాలిచ్చాడు?

జగన్‌ను రాజకీయాల నుంచి శాశ్వతంగా లేకుండా చేయాలి

మళ్లీ సైకిల్‌ పాలన తేవాలి

మన భవిష్యత్‌ మన చేతుల్లోనే

కనిగిరి బహిరంగ సభ నుంచి టీడీపీ అధినేత పిలుపు

ఒంగోలు, జనవరి 5 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అన్నది లేకుండా చేసిన నియంత ప్రభుత్వాన్ని ఇంటికి పంపించి.. మళ్లీ మంచి రోజులు రావాలని రాష్ట్ర ప్రజలంతా సంకల్పం తీసుకోవాలని టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు పిలుపిచ్చారు. అక్రమ కేసులు, దాడులతో తెలుగు సమాజాన్ని భయపెడుతున్న సైకో పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవడం టీడీపీ, జనసేన నాయకులది మాత్రమే కాదని.. ప్రజలందరి సమష్టి బాధ్యత అని స్పష్టం చేశారు. ‘రా.. కదలిరా’ పేరుతో చేపట్టిన ఎన్నికల శంఖారావ కార్యక్రమాన్ని శుక్రవారం ప్రకాశం జిల్లా కనిగిరి నుంచి చంద్రబాబు ప్రారంభించారు. పట్టణ సమీపంలో వెలిగొండ సాధన ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఒంగోలు పార్లమెంటు స్థాయి బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. జగన్‌ పాలనపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ‘మన భవిష్యత్‌ మన చేతుల్లోనే ఉందన్నది ప్రజలంతా గుర్తించాలి. సైకో పాలన పోవాలి, సైకిల్‌ పాలన రావాలనే నినాదంతో రానున్న వంద రోజులు రోడ్డెక్కి ప్రచారం నిర్వహించాలి. అందుకు నాడు ‘టీడీపీ పిలుస్తోంది రా.. కదలిరా..’ అన్న ఎన్టీఆర్‌ నినాదానికి ప్రభంజనంలా కదలి వచ్చినట్లుగానే నేడు టీడీపీ, జనసేన ఇస్తున్న ‘రా.. కదలిరా’ పిలుపునకు అంతకు మించి రావాలి’ అని విజ్ఞప్తి చేశారు. 2024వ సంవత్సరం తెలుగు జాతికి స్వర్ణయుగం కావాలన్నారు. ఇందుకోసం బ్రిటిష్‌ వాడికి ఎదురొడ్డిన ప్రకాశం పంతులు స్ఫూర్తితో ఒంగోలు గిత్తల్లా ప్రజానీకం ముందుకు రావాలని చెప్పారు. ఇంకా ఏమన్నారంటే..

ఐదేళ్ల నుంచి ఒక్కరూ సంతోషంగా లేరు

వైసీపీ పాలనలో ఐదేళ్లుగా రాష్ట్రంలో ఏ ఒక్క వ్యక్తి కూడా సంతోషంగా లేరు. ఎవరికీ న్యాయం జరుగలేదు. సంక్షేమం పేరుతో జగన్‌ రూ.10 ప్రజలకు ఇచ్చి వారి నుంచి రూ.100 దోచుకుంటున్నాడు. ఒక్క చాన్స్‌ పేరుతో అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. రూ.13 లక్షల కోట్ల అప్పులు చేసిన ఈ సీఎం ఒక్కరికైనా ఉపాధి కల్పించలేదు. జాబ్‌ కేలెండర్‌ అని చెప్పి అధికారంలోకి వచ్చి ఎవరికి ఉద్యోగాలు ఇచ్చాడు? టీడీపీ పాలనలో దేశంలో అధికంగా ఉద్యోగాలిచ్చే జాబితాలో రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉంటే.. నేడు నిరుద్యోగుల జాబితాలో ముందుంది. ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపికలో వారి సేవా గుణానికి ప్రాధాన్యం ఇవ్వడం రాజకీయ పార్టీల కర్తవ్యం. అందుకు భిన్నంగా జగన్‌ నీచ సంస్కృతి తెచ్చా డు. నన్ను, పవన్‌ కల్యాణ్‌ను, లోకేశ్‌ను తిట్టే వారికే సీట్లు ఇస్తానని చెబుతున్నాడు. ఇలాంటి వారికి అసలు రాజకీయాల్లో ఉండే అర్హతే లేదు. జగన్‌ను శాశ్వతంగా రాజకీయాల్లో లేకుండా చేయాలి. సీటు కావాలంటే మమ్మల్ని తిట్టాలన్న షరతులను వ్యతిరేకిస్తున్న వైసీపీలోని ఎంపీ, ఎమ్మెల్యేలను అభినందిస్తున్నా. అలాగే జగన్‌ తాజాగా తెచ్చిన భూ చట్టం వల్ల ప్రజల చేతుల్లో భూమి ఉండే అవకాశం లేదు. ప్రకాశం జిల్లాలో జరిగిన భూదందాల పై సిట్‌ వేసి తేలుస్తాం.

సంకల్పం ఉంటే..

రాష్ట్రాన్ని జగన్‌ అప్పులకుప్పగా మార్చాడు.. మీరొచ్చాక ఎలా నడుపుతున్నారని కొంద రు నన్ను అడుగుతున్నారు. సంకల్పం ఉంటే ఏదైనా సాధ్యమే. సంపదను పెంచి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడి లో పెడతాం. సూపర్‌ సిక్స్‌ పథకాలను కచ్ఛితంగా అమ లు చేస్తాం. అదే సమయంలో ప్రాజెక్టులు, ఇతర అభివృద్ధి పనులనూ పూర్తి చేస్తాం. మార్కాపురం కేంద్రంగా పశ్చిమ ప్రకాశంను ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేస్తాం. క్లెమోర్‌మైన్స్‌ ఘటనలో కూడా బాధపడని నేను.. అసెంబ్లీలో నా భార్యను నిందించిన రోజు ఎంతో బాధపడ్డాను. ఈ కౌరవ సభకు ఇక రానని గౌరవ సభ ఏర్పడ్డాక వస్తానని ప్రకటించాను. త్వరలో జరిగే ఎన్నికల్లో గౌరవ సభ ఏర్పడేలా ప్రజలు సహకరించాలని అన్నారు. కాగా, ప్రతి లోక్‌సభ స్థానంలో ‘రా.. కదలిరా’ పేరిట 25 బహిరంగ సభలు నిర్వహించాలన్న లక్ష్యంలో భాగంగా చంద్రబాబు తొలుత కనిగిరిని ఎంచుకున్నారు. శుక్రవారం సాయం త్రం జరిగిన బహిరంగ సభకు జనం తండోపతండాలు గా తరలివచ్చారు. కనిగిరి నియోజకవర్గంతోపాటు ఒంగో లు పార్లమెంటు పరిధిలోని ఇతర నియోజకవర్గాల నుం చి కూడా నేతల అంచనాలకు మించి టీడీపీ శ్రేణులు, జనసేన కార్యకర్తలు తరలివచ్చారు. ఇటీవల విశాఖ వద్ద యువగళం పాదయాత్ర ముగింపు సభకు హాజరైన జనంతో సమానంగా కనిగిరి సభకు వచ్చారని బాబు నేతలను అభినందించారు. ఇదే ఉత్సాహంతో ఎన్నికల్లో టీడీపీ, జనసేన గెలుపునకు పనిచేయాలని కోరారు. రాత్రికి ఆయన కనిగిరిలోనే బస చేశారు. శనివారం ఉద యం ఉమ్మడి జిల్లా నేతలతో భేటీ అవుతారు. అనంత రం హైదరాబాద్‌ బయల్దేరతారు. సభలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, ఉమ్మడి ప్రకాశం జిల్లా టీడీపీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

Updated Date - Jan 06 , 2024 | 03:04 AM