Share News

cm chandra babu అనంతను అగ్రస్థానంలో నిలుపుతా

ABN , Publish Date - Aug 01 , 2024 | 11:59 PM

హంద్రీనీవా ద్వారా ప్రతి ఎకరాకు నీరిచ్చి, తోడ్పాటునందించి, పంటలకు గిట్టుబాటు ధర కల్పించి దేశంలోనే ఉమ్మడి అనంత జిల్లా అగ్రస్థానంలో నిలుపుతానని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు.

cm chandra babu అనంతను అగ్రస్థానంలో నిలుపుతా
ప్రజావేదిక సభలో మాట్లాడుతున్న చంద్రబాబునాయుడు

రైతులందరికీ డ్రిప్‌ సౌకర్యం కల్పిస్తా

నేనే మీ వద్దకు వస్తా

పాలకులు, అధికారులు బాధ్యతగా పనిచేయాలి

పరిశ్రమలతో పెట్టుబడులు తీసుకొస్తా

వక్క క్రషింగ్‌ యూనిట్‌ ఏర్పాటు చేస్తాం

వలస వెళ్లిన వారిని వెనక్కు రప్పిస్తాం

సీఎం చంద్రబాబు నాయుడు ఉద్ఘాటన

గుండుమలలో పింఛన పంపిణీకి హాజరు

పుట్టపర్తి(ఆంధ్రజ్యోతి), ఆగస్టు 1: హంద్రీనీవా ద్వారా ప్రతి ఎకరాకు నీరిచ్చి, తోడ్పాటునందించి, పంటలకు గిట్టుబాటు ధర కల్పించి దేశంలోనే ఉమ్మడి అనంత జిల్లా అగ్రస్థానంలో నిలుపుతానని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. మడకశిర మండలం గుండుమలకు గురువారం విచ్చేసిన ముఖ్యమంత్రికి హెలీప్యాడ్‌ వద్ద రాష్ట్ర మంత్రులు సవిత, సత్యకుమార్‌, ఎంపీ బీకే పార్థసారథి, ఎమ్మెల్యేలు పరిటాల సునీత, కాలవ శ్రీనివాసులు, బండారు శ్రావణి, కందికుంట వెంకటప్రసాద్‌, దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్‌, టీడీపీ జిల్లా అధ్యక్షుడు కొల్లకుంట అంజినప్ప, కలెక్టర్‌, డీఐజీ, ఎస్పీ స్వాగతం తెలిపారు. మొదట మల్బరీ రైతు రంగనాథ్‌కు సంబంధించిన షెడ్డును పరిశీలించారు. పంట సాగులో లాభాలపై ఆరాతీశారు. అక్కడి నుంచి ఇళ్ల వద్దకే వెళ్లి పింఛన్లు పంపిణీ చేశారు. గుండుమలలోని కరియమ్మ ఆలయం ముందు మడకశిర ఎమ్మెల్యే ఎం.ఎస్‌ రాజు అధ్యక్షతన ఏర్పాటు చేసిన ప్రజావేదిక కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. జిల్లాలోని రైతులందరికీ డ్రిప్‌ సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ‘నేరుగా మీ వద్దకు వస్తాననీ, మీరు.. నావద్దకు రావాల్సిన అవసరం లేద’ని ఆయన పేర్కొన్నారు. తద్వారా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, అధికారులకు బాధ్యత పెరుగుతుందన్నారు. హంద్రీనీవా ప్రాజెక్టు కింద జిల్లాలో జీడిపల్లి, భైరవానతిప్ప, పేరూరు, గొల్లపల్లి ప్రాజెక్టులను ప్రారంభించింది తానేనన్నారు. రూ.12,500 కోట్లతో ప్రాజెక్టు పూర్తి చేశామన్నారు. తద్వారా ఉమ్మడి జిల్లాలో వేలాదిమంది రైతుల పొలాలకు నీరిచ్చామన్నారు. ఎడారి జిల్లాగా పేరుగాంచిన ఈ ప్రాంతంలో కియ పరిశ్రమకు నీరిచ్చింది కూడా హంద్రీనీవా ద్వారానేనన్నారు. జిల్లాలో 47 లక్షల ఎకరాల భూమి ఉండగా.. ఇందులో 11 లక్షల ఎకరాలు మాత్రమే సాగుభూమి అన్నారు. పంటలు సాగుచేస్తుంది మాత్రం 2 లక్షల ఎకరాల్లో మాత్రమేనన్నారు. మడకశిర ప్రాంతంలో వక్క రైతులు అధికంగా ఉన్నారన్నారు. ఇక్కడ రైతులందరూ కలిసి వక్క క్రషింగ్‌ యూనిట్‌ ఏర్పాటు చేసుకుందామంటే భూమి, యూనిట్‌ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సాయంతో ఏర్పాటు చేస్తామని సీఎం ప్రకటించారు. అలా కాదంటే ప్రైవేటు వ్యక్తులకు అప్పగించి, ఇక్కడ వక్క క్రషింగ్‌ యూనిట్‌ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. దేశంలో ఏ ముఖ్యమంత్రీ చేయనివిధంగా మారుమూల ప్రాంతం గుండుమలకు వచ్చి పింఛన ఇచ్చానన్నారు. గత సీఎం జగన్మోహనరెడ్డి వస్తే పరదాలు కట్టేవారనీ, చెట్లు నరికేవారనీ, అరెస్టులు చేసేవారన్నారు. తాను మాత్రం జనంలో ఒకడిగా గ్రామానికి వచ్చానన్నారు. జిల్లాలో చాలామంది గత ఐదేళ్లలో వలస వెళ్లారన్నారు. హంద్రీనీవా ద్వారా ప్రతి చెరువుకు నీరందించి, ప్రతి ఎకరాకు నీరిస్తామన్నారు. తద్వారా వలస వెళ్లినవారిని తిరిగి రప్పించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. గ్రామానికి అవసరమైన సదుపాయాలన్నీ కల్పిస్తామన్నారు. మల్బరీ రైతులకు అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. జిల్లాలో అధికంగా వాణిజ్య పంటలు సాగుచేసేలా ప్రోత్సహించి, ఆదుకుంటామన్నారు. ఉమ్మడి జిల్లాలో 14 ఎమ్మెల్యే, రెండు ఎంపీస్థానాలు గెలిపించినందుకు రుణపడి ఉంటానన్నారు. అనంతను సస్యశ్యామలం చేసి, అన్నివిఽధాలా అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటానని చంద్రబాబు ఉద్ఘాటించారు. ప్రభుత్వం జవాబుదారీగా పనిచేస్తుందన్నారు. రూ.35 పింఛనను ప్రారంభించింది ఎన్టీఆర్‌ అనీ, దానిని రూ.70కి, తరువాత రూ.1000, రూ.2వేలు, రూ.4వేలు చేసింది ఎన్డీఏ ప్రభుత్వమన్నారు. ఏప్రిల్‌ నుంచి రూ.4వేలు పింఛన ఇస్తామని చెప్పి మాట నిలబె ట్టుకున్న ఘనత ఈ ప్రభుత్వానికే దక్కిందన్నారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమశాఖ మంత్రి సవిత, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌యాదవ్‌, ఎంపీ బీకే పార్థసారథి, మాజీ ఎమ్మెల్యే గుండుమల తిప్పేస్వామి, ఈరన్న, ఎమ్మెల్యేలు కాలవ శ్రీనివాసులు, పరిటాల సునీత, బండారు శ్రావణి, కందికుంట వెంకటప్రసాద్‌, పల్లె సింధూరారెడ్డి, అమిలినేని సురేంద్రబాబు, దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్‌, టీడీపీ ధర్మవరం ఇనచార్జి పరిటాల శ్రీరామ్‌, శ్రీసత్యసాయి, అనంత జిల్లాల అధ్యక్షులు కొల్లకుంట అంజినప్ప, వెంకటశివుడుయాదవ్‌, మాజీ మంత్రి పల్లె రఘునాథ రెడ్డి, కలెక్టర్లు చేతన, వినోద్‌కుమార్‌, సబ్‌ కలెక్టర్‌ అపూర్వభరత, ఎస్పీలు రత్న, మురళీకృష్ణ పాల్గొన్నారు.

  • మల్బరీ రైతుకు సీఎం అభినందన

మడకశిర/మడకశిరరూరల్‌, ఆగస్టు 1: మల్బరీ సాగులో ఆదర్శంగా నిలిచిన రైతు రంగనాథ్‌ను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అభినందించారు. గురువారం మడకశిర మండలం గుండుమల గ్రామంలో పింఛన్ల పంపిణీ అనంతరం మల్బరీ సాగు చేస్తున్న షెడ్డును సీఎం సందర్శించారు. మల్బరీ సాగుకు సంబంధించిన వివరాలను రైతుతో అడిగి తెలుసుకున్నారు. 15 సంవత్సరాలుగా మల్బరీ సాగు చేస్తున్నామని రంగనాథ్‌ సీఎంకు తెలిపారు. ప్రస్తుతం ప్రతి పంటకు రూ. 90 వేల వరకు ఆదాయం పొందుతున్నామని, ఇందులో రూ. 60 వేల వరకు లాభం వస్తోందన్నారు. పట్టుగూళ్లకు ప్రభుత్వం కిలోకు రూ. 50 రాయితీ ఇచ్చిందని, ఇందుకు సీఎంకు రైతు కృతజ్ఞతలు తెలిపారు. గత మూడు సంవత్సరాలుగా తాము పొందుతున్న సబ్సిడీ నిలిచిపోయిందని వెంటనే ఇవ్వాలని పట్టు రీలర్స్‌ ఈ సందర్భంగా సీఎం దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం చంద్రబాబునాయుడు మాట్లాడుతూ మల్బరీ సాగులో మరింత ఆర్థిక అభివృద్ధి సాధించి ఆదర్శంగా నిలవాలన్నారు. కాగా పట్టుపురుగుల షెడ్డును ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సందర్శించడం తనకెంతో సంతోషాన్ని ఇచ్చిందని రంగనాథ్‌ పేర్కొన్నాడు. సీఎం వెంట మంత్రి సవిత, హిందూపురం ఎంపీ బీకే పార్థసారథి, ఎమ్మెల్యేలు ఎం.ఎ్‌స.రాజు, కాలవ శ్రీనివాసులు, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి, కలెక్టర్‌ చేతన, సబ్‌కలెక్టర్‌ అపూర్వభరత, పుట్టపర్తి ఆర్డీఓ సౌభాగ్యలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.

పల్లెలో కలయతిరిగిన సీఎం

హిందూపురం, ఆగస్టు 1: ఎన్టీఆర్‌ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనేందుకు మడకశిర మండలంలోని గుండుమల గ్రామానికి వచ్చిన ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడు గ్రామంలో కలియ తిరిగారు. గురువారం సాయంత్రం 4.40 గంటలకు హెలిక్యాఫ్టర్‌ ద్వారా గ్రామానికి చేరుకున్న సీఎంకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీ, కలెక్టర్‌, డీఐజీ, ఎస్పీ స్వాగతం పలికారు. ఆయన అక్కడి నుంచి గ్రామంలోకి వెళ్లి మల్బరీ షెడ్డును పరిశీలించారు. ఈ సందర్భంగా గుండుమల గ్రామంలో వీధులవెంట ముఖ్యమంత్రి సామాన్యుడిలా ప్రజల మధ్యన కలియతిరిగారు. గ్రామంలోని రైతులు, వృద్ధులను ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకు కదిలారు. ఏమమ్మా బాగున్నారా? అంటూ మహిళలను పలుకరించారు. పొలాల్లో ఏ పంటలు పెడుతున్నారు? ఎంతమంది పిల్లలు ఉన్నారు? ఎక్కడ చదువుతున్నారు? ఏం పనిచేస్తున్నారని అందరినీ కుటుంబ సభ్యుడిలా మాట్లాడుతూ ముందుకు కదిలారు.

జోరువానలో బాబు ప్రసంగం

హిందూపురం, ఆగస్టు 1: మడకశిర మండలం గుండుమల గ్రామానికి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజావేదిక వద్ద ప్రసంగించే సమయంలో మొదట మూడు నిమిషాల పాటు తేలికపాటి వర్షం పడింది. ఆ తరువాత 15నిమిషాల పాటు జోరువాన కురిసింది. అయినా చంద్రబాబు ప్రసంగం ఆపలేదు. జోరువానలోనే అక్కడి జనం కుర్చీలు తలపై పెట్టుకుని సీఎం ప్రసంగాన్ని విన్నారు. అంత వర్షం కురుస్తున్నా ఒక్కరూ పక్కకు వెళ్లకుండా ప్రసంగం వినడం పట్ల సీఎం ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అంతేకాకుండా చంద్రబాబు తమ గ్రామానికి రావడంతో వర్షం కురిసిందని గ్రామస్థులు సంబరపడ్డారు. మారుమూల ప్రాంతమైన తమ గ్రామానికి చంద్రబాబు రావడం అదృష్టంగా భావిస్తున్నామని ఆనందం వ్యక్తం చేశారు.

తడిసిన జిల్లా అధికారులు

ముఖ్యమంత్రి ప్రసంగిస్తున్న సమయంలో జోరువాన కురుస్తుండగా కలెక్టర్‌, సబ్‌ కలెక్టర్‌, డీఐజీ, ఎస్పీ అక్కడే ఉన్నారు. జోరువానలో వారు తడిసి ముద్దయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ తడిసిపోగా జిల్లా ఎస్పీ రత్న డీఐజీకి గొడుగుపట్టి జోరువానలోనే ఉండిపోయారు.

Updated Date - Aug 02 , 2024 | 02:40 PM