కేంద్ర పథకాలను వినియోగించుకోవాలి
ABN , Publish Date - Sep 21 , 2024 | 11:33 PM
కేంద్ర ప్రభుత్వ పథకాలను జిల్లా అభివృద్ధికి వినియోగించుకోవాలని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత అన్నారు.
కర్నూలు(కలెక్టరేట్), సెప్టెంబరు 21: కేంద్ర ప్రభుత్వ పథకాలను జిల్లా అభివృద్ధికి వినియోగించుకోవాలని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత అన్నారు. శనివారం కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు అధ్యక్షతన దిశా సమావేశం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పరిశ్రమల శాఖలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మాదిరిగానే జిల్లాలో అన్ని శాఖల్లో అభివృద్ధి పనులు వేగంగా జరగాలని అన్నారు. అధికారులు జవాబుదారితనంతో, సమన్వయంతో పని చేయాలని కోరారు. కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ పథకాలు, నిధులను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. అంగనవాడీ కేంద్రాలు అద్దె గృహాల్లో ఉండడం వల్ల పిల్లలు చాలా ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వ భవనాల్లోకి మార్చాలని ఎంపీ స్త్రీ, శిశు సంక్షేమ అధికారిని ఆదేశించారు. పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత మాట్లాడుతూ ఈ-పంట నమోదు సక్రమంగా జరగడం లేదని అన్నారు. పంటను తప్పనిసరిగా నమోదు చేయాలని ఆదేశించారు. కలెక్టర్ పి.రంజిత బాషా మాట్లాడుతూ ఆలూరులో ఎపీ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల ఏర్పాటుకు ఐదు ఎకరాలు ఇస్తామని ఓ వ్యక్తి ముందుకు వచ్చారని అన్నారు. అందుకు సంబంధించి వెరిఫై చేయాలని సంబంధిత అధికారిని ఆదేశించారు. పాఠశాల భవనాల స్థితిగతులను వెరిఫై చేసేందుకు పంచాయతీ రాజ్, ఆర్‌అండ్‌బీ అధికారులను వినియోగించుకోవాలని సూచించారు. కోడుమూరు ఎమ్మెల్యే దస్తగిరి మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లు, కేజీబీవీ పాఠశాలలో సీట్లు పెంచే దిశగా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ చల్లా కళ్యాణి, జడ్పీ సీఈవో నాసరరెడ్డి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.