పోలవరం నిర్మాణ బాధ్యత చేపట్టాలని రాష్ట్రాన్ని కేంద్రమే కోరింది
ABN , Publish Date - Dec 28 , 2024 | 04:53 AM
పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను చూసుకోవాలని రాష్ట్రప్రభుత్వాన్ని కేంద్రమే కోరింది.

ఆర్థిక శాఖ 2016లో లేఖ రాసింది
సత్వర లబ్ధి కోసం 41.15 మీటర్ల ఎత్తున తొలి దశలో పూర్తికి ఏపీ ప్రతిపాదన
‘ఆర్‌టీఐ’ ప్రశ్నకు జలశక్తి శాఖ జవాబు
అమరావతి, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను చూసుకోవాలని రాష్ట్రప్రభుత్వాన్ని కేంద్రమే కోరింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ 2016 సెప్టెంబరు 30వ తేదీన లేఖ రాసింది. అలాగే ప్రాజెక్టు ప్రయోజనాలు సత్వరమే అందేందుకు వీలుగా తొలి దశలో 41.15 మీటర్ల ఎత్తున పనులు చేపడతామని.. భూసేకరణ కూడా చేస్తామని రాష్ట్రప్రభుత్వమే కోరిందని వెల్లడించింది. క్రమంగా 45.72 మీటర్ల ఎత్తున నిర్మాణం పూర్తిచేస్తామని చెప్పిందని తెలిపింది. 41.15 మీటర్ల కాంటూరులో పనులు చేపట్టడంపై సమాచార హక్కు చట్టం (ఆర్‌టీఐ) కింద సీనియర్ జర్నలిస్టు ఇనగంటి రవికుమార్ వేసిన ప్రశ్నకు కేంద్ర జలశక్తి శాఖ పై సమాధానాలిచ్చింది. అయితే ఈ జవాబులు అస్పష్టంగా ఉన్నాయి. ఎవరు సీఎంగా ఉండగా తొలి దశలో పూర్తిచేస్తామని రాష్ట్రప్రభుత్వం చెప్పిందో ఆ శాఖ వెల్లడించలేదు. దాటవేత ధోరణితో వ్యవహరించింది. వాస్తవానికి 2019లో సీఎం చంద్రబాబు దిగిపోయేంతవరకు దశలవారీ నిర్మాణమన్న ఊసే రాలేదు.
పనులన్నీ 45.72 మీటర్ల ఎత్తున పూర్తిచేసే దిశగానే జరిగాయి. పోలవరం ఎత్తు 150 అడుగులు.. డిశ్చార్జి 50 లక్షల క్యూసెక్కులు ఉండేలా డిజైన్ చేశారు. కానీ జగన్ గద్దెనెక్కాక.. రెండు దశల్లో నిర్మాణమని మొదలుపెట్టారు. 2020 తర్వాత.. 41.15 మీటర్ల కాంటూరులో 115 టీఎంసీల నీటి నిల్వకే పరిమితం చేసేలా కార్యాచరణ సిద్ధం చేశారు. రెండోదశలో 45.72 మీటర్ల కాంటూరులో పనులు పూర్తిచేసి గరిష్ఠంగా 194.6 టీఎంసీలు నిల్వ చేస్తామని కేంద్రానికి తెలియజేశారు. ఆర్‌టీఐ కింద అడిగిన ప్రశ్నకు.. జలశక్తి శాఖ పొడిపొడిగా జవాబులిచ్చింది. సమాధానాన్ని ఇంతటితో ముగిస్తున్నట్లు పేర్కొనడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.