ఎప్పటిలాగే.. ఆలస్యంగా..!
ABN , Publish Date - Jun 17 , 2024 | 11:37 PM
పంట నష్టం జరిగి.. సీజన మారిత తరువాత కేంద్ర బృందం వస్తోంది. ఎప్పటిలాగే పాడైపోయిన పంటలు క్షేత్రస్థాయిలో లేని సమయంలో ‘పరిశీలన’కు వస్తోంది. ఉమ్మడి జిల్లాలో పర్యటించనున్న కేంద్ర బృందానికి జిల్లాలో పంట నష్టం వివరాలను తెలియజేసేందుకు యంత్రాంగం సిద్ధమైంది.

నేడు జిల్లాకు ఇంటర్ మినిస్టీరియల్ బృందం
రబీ పంట నష్టం వివరాలు తెలుసుకునేందుకు..
19న రొద్దం, 20న జిల్లాలో క్షేత్రస్థాయి పర్యటన
అనంతపురం అర్బన, జూన 17: పంట నష్టం జరిగి.. సీజన మారిత తరువాత కేంద్ర బృందం వస్తోంది. ఎప్పటిలాగే పాడైపోయిన పంటలు క్షేత్రస్థాయిలో లేని సమయంలో ‘పరిశీలన’కు వస్తోంది. ఉమ్మడి జిల్లాలో పర్యటించనున్న కేంద్ర బృందానికి జిల్లాలో పంట నష్టం వివరాలను తెలియజేసేందుకు యంత్రాంగం సిద్ధమైంది. కేంద్ర ప్రభుత్వ ఇంటర్ మినిస్టీరియల్ బృందం మంగళవారం సాయంత్రం జిల్లాకు చేరుకుంటుంది. ఒకటో బృందానికి కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ రితీష్ చౌహాన నేతృత్వం వహిస్తారు. ఇందులో సభ్యులుగా పొన్నుస్వామి, సునీల్ దూమే ఉన్నారు. రెండో బృందానికి ఖర్చుల విభాగం డైరెక్టర్ చిన్మయ్ గోట్‌మరే నేతృత్వం వహిస్తారు. ఈ బృందంలో సభ్యులుగా అశీ్‌షపాండే, వినోద్‌కుమార్ ఉన్నారు. కలెక్టరేట్ రెవెన్యూ భవనలో కలెక్టర్ వినోద్‌కుమార్ నేతృత్వంలో వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులతో రెండు బృందాల సభ్యులు ఈ నెల 19న సమావేశమౌతారు. ముందుగా 2023-24 రబీ సీజన పంటనష్టాన్ని తెలియజేసే ఫొటో ఎగ్జిబిషనను పరిశీలిస్తారు. సమావేశం ముగిసిన తర్వాత రెండో బృందం సభ్యులు కర్నూలు జిల్లాకు వెళతారు. ఒకటో బృందం సభ్యులు శ్రీసత్యసాయి జిల్లాలోని రొద్దం మండలంలో క్షేత్రస్థాయి పర్యటనకు వెళతారు. పర్యటన ముగించుకొని రాత్రికి అనంతపురం నగరానికి చేరుకుంటారు. ఈ నెల 20న పప్పుశనగ సాగు చేసిన విడపనకల్లు, వజ్రకరూరు, ఉరవకొండ, కణేకల్లు మండలాల్లో పర్యటిస్తారు. స్థానిక రైతులతో మాట్లాడి, పంటనష్టం వివరాలు తెలుసుకుంటారు.
ముందే రావాల్సింది..
గత ఏడాది రబీ సీజన ముగిసి ఈ ఏడాది ఖరీఫ్ సీజన ఆరంభమైంది. రబీలో దెబ్బతిన్న పంటల ఆనవాళ్లు క్షేత్రస్థాయిలో ఇప్పుడు కనిపించవు. పంటలు దెబ్బతిన్న సమయంలో కేంద్ర బృందాన్ని జిల్లాకు పంపించి ఉంటే వాస్తవ పరిస్థితులు వారికి కనిపించేవి. రబీ సీజన మార్చి నెలాఖరుతో ముగిసింది. రెండున్నర మాసాల తర్వాత కరువు బృందాన్ని పంపితే క్షేత్ర స్థాయిలో వారు దేన్ని పరిశీలిస్తారని రైతులు ప్రశ్నిస్తున్నారు. నష్టం జరిగిన ప్రతిసారీ ఇదే తంతు జరుగుతోంది. దెబ్బతిన్న పంటలను చూపించలేని పరిస్థితులలో ఫొటో ఎగ్జిబిషన ద్వారా జరిగిన నష్టాన్ని కేంద్ర బృందానికి వివరించేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధమైంది.
కరువు మండలాలు 14..
గత ఏడాది ఖరీ్‌పలో వర్షాభావం కారణంగా పంటలు దెబ్బతిన్నాయి. రబీ సీజనలోనూ పంటలను తీవ్రంగా నష్టపోయారు. రబీలో పప్పుశనగతోపాటు ఇతర రకాల పంటలకు నష్టం వాటిల్లింది. ఈ నేపథ్యంలో జిల్లాలోని 14 మండలాలను ప్రభుత్వం కరువు ప్రాంతాలుగా ప్రకటించింది. ఇందులో బెళుగుప్ప, బొమ్మనహాళ, డి.హీరేహాళ్, గుత్తి, గుంతకల్లు, కణేకల్లు, పెద్దపప్పూరు, పుట్లూరు, తాడిపత్రి, ఉరవకొండ, వజ్రకరూరు, విడపనకల్లు, యాడికి, యల్లనూరు మండలాలు ఉన్నాయి.
రూ.36.86 కోట్ల పంటనష్టం
గత ఏడాది రబీ సీజనలో 37,195 హెక్టార్లల్లో రూ.36.86 కోట్ల పంటనష్టం జరిగినట్లు వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఇందులో అత్యధికంగా 34,303 హెక్టార్లల్లో రూ.34.30 కోట్ల విలువైన పప్పుశనగ పంటనష్టం జరిగింది. మినుము 274 హెక్టార్లల్లో రూ.27.43 లక్షలు, పెసర 55.84 హెక్టార్లల్లో రూ.5.58 లక్షలు, ఉలవ 64.17 హెక్టార్లల్లో రూ.6.42 లక్షలు, జొన్న 2101 హెక్టార్లల్లో రూ.1.78 కోట్లు, నువ్వులు 46.38 హెక్టార్లల్లో రూ.3.94 లక్షలు, తెల్ల కుసుమ 49.39 హెక్టార్లల్లో రూ.4.20 లక్షలు, పొద్దుతిరుగుడు 296.94 హెక్టార్లల్లో రూ.29.69 లక్షల నష్టం వాటిల్లింది. మిగతా విస్తీర్ణంలో అలసంద, కొర్ర తదితర రకాల పంటలను రైతులు నష్టపోయారు.