Share News

case of skill : 17ఏ పై చెరోమాట!

ABN , Publish Date - Jan 17 , 2024 | 03:22 AM

టీడీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబుపై సీఐడీ దాఖలు చేసిన స్కిల్‌ డెవల్‌పమెంట్‌ కేసుకు అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్‌ 17ఏ వరిస్తుందా

case of skill : 17ఏ పై చెరోమాట!

స్కిల్‌ కేసులో చంద్రబాబుకు వర్తింపజేయడంపై

ద్విసభ్య ధర్మాసనంలో భిన్నాభిప్రాయాలు

విస్తృత ధర్మాసనానికి చంద్రబాబు కేసు!

చీఫ్‌ జస్టిస్‌కు నివేదిస్తూ నిర్ణయం

17ఏ వర్తిస్తుంది.. కేసు అక్రమం

ముందుగా అనుమతి తీసుకోవాల్సిందే: జస్టిస్‌ బోస్‌

పాత నేరాలకు వర్తింపజేయలేం: జస్టిస్‌ బేలా త్రివేది

న్యూఢిల్లీ, జనవరి 16 (ఆంధ్రజ్యోతి) టీడీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబుపై సీఐడీ దాఖలు చేసిన స్కిల్‌ డెవల్‌పమెంట్‌ కేసుకు అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్‌ 17ఏ వరిస్తుందా? లేదా?... ఆయనపై కేసు చెల్లుతుందా? లేదా? ఈ అంశంపై సుప్రీంకోర్టు ధర్మాసనంలోని ఇద్దరు న్యాయమూర్తులు భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తంచేశారు. దీనిపై తగిన నిర్ణయం తీసుకోవాలని సుప్రీం ప్రధాన న్యాయమూర్తికి నివేదించారు. వెరసి... దీనిపై విస్తృత ధర్మాసనం తదుపరి విచారణ జరిపే అవకాశముంది. సవరించిన అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్‌ 17ఏ ప్రకారం తనపై కేసు నమోదుకు సంబంధిత అథారిటీ నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలని... సీఐడీ దీనిని పట్టించుకోలేదని... కేసును కొట్టివేయాలని చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్‌ను అంతకుముందు హైకోర్టు తోసిపుచ్చింది. దీంతో... ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై జస్టిస్‌ అనిరుద్ధ బోస్‌, జస్టిస్‌ బేలా త్రివేదిలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. గత ఏడాది అక్టోబరు 17వ తేదీన రిజర్వు చేసిన తీర్పును... మంగళవారం వెలువరించింది. అయితే... దీనిపై ఇరువురు న్యాయమూర్తులు ఏకాభిప్రాయానికి రాలేకపోయారు. చంద్రబాబుపై దాఖలైన కేసుకు సెక్షన్‌ 17(ఏ)ను అన్వయించడంపై వేర్వేరుగా తీర్పులు వెలువరించారు.

17ఏ వర్తిస్తుంది, కేసు చెల్లదు: జస్టిస్‌ బోస్‌

1988 అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్‌ 13(1)(సి), 13(1)డి, 13(2) కింద చంద్రబాబుపై చర్యలు తీసుకోవడం సరైంది కాదని జస్టిస్‌ అనిరుద్ధ బోస్‌ స్పష్టం చేశారు. సవరించిన చట్టంలోని 17ఏ సెక్షన్‌ ప్రకారం ‘పబ్లిక్‌ సర్వెంట్లపై కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించేందుకు సంబంధిత ‘అథారిటీ’ అనుమతి అవసరం’ అని తెలిపారు. అలా అనుమతి లేకుండా విచారణ చేపడితే... అది అక్రమమే అవుతుందన్నారు. అదే సమయంలో... ఇప్పుడైనా రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తీసుకోవచ్చునని అభిప్రాయపడ్డారు.

17ఏ వర్తించదు: జస్టిస్‌ బేలా త్రివేది

స్కిల్‌ డెవల్‌పమెంట్‌ అంశంలో చంద్రబాబుపై కేసు నమోదుకు 17ఏ సెక్షన్‌ వర్తించదని జస్టిస్‌ బేలా త్రివేది తన తీర్పులో పేర్కొన్నారు. 17ఏ సెక్షన్‌ అమలులోకి వచ్చిన తర్వాత చోటు చేసుకున్న నేరాలకు మాత్రమే ఇది వర్తిస్తుందని, అంతకుముందు జరిగిన వాటికి (రెట్రాస్పెక్టివ్‌) కాదని, చట్టం ఉద్దేశం అదేనని అభిప్రాయపడ్డారు. అవినీతి నిరోధక చట్టానికి 2019లో సవరణలు జరిగిన విషయాన్ని గుర్తు చేశారు. 17ఏ సెక్షన్‌ను పాత కేసులకు కూడా వర్తింపచేస్తే పెండింగ్‌లో ఉన్న ఎన్నో దర్యాప్తులకు నష్టం జరుగుతుందని ఆమె చెప్పారు. అలాగే... ఐపీసీలోని ఇతర సెక్షన్ల కింద కూడా కేసు నమోదైనట్లయితే, కేవలం 17ఏ కింద అనుమతి తీసుకోనంత మాత్రాన కేసు కొట్టివేయడం కుదరదని తెలిపారు. ఈ కేసులో చంద్రబాబు తరఫున హరీష్‌ సాల్వే, సిద్దార్థ లూథ్రా వాదనలు వినిపించారు. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్‌ 17ఏ ప్రకారం పోలీసులు సంబంధిత అథారిటీ అనుమతి లేకుండా చంద్రబాబును నిందితుడిగా చేర్చడం సరైంది కాదని తెలిపారు. అయితే... అవినీతి నిరోధక చట్టానికి 2018లో జరిగిన సవరణలో సెక్షన్‌ 17ఏ చేర్చారని... స్కిల్‌ డెవల్‌పమెంట్‌ స్కామ్‌ అంతకుముందే చోటు చేసుకుందని ఏపీ ప్రభుత్వం తరఫున ముకుల్‌ రోహత్గీ వాదించారు. అందువల్ల ఈ కేసుకు 17ఏ వర్తించదని తెలిపారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఇద్దరిలో ఒకరు చంద్రబాబు తరఫు న్యాయవాది వాదనను సమర్థించగా, మరొకరు రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది వాదనను అంగీకరించడం గమనార్హం.

విషయం సీజే ముందుకు...

‘‘ఈ సెక్షన్‌కు అన్వయం, పిటిషనర్‌ (చంద్రబాబు)కు దీనిని వర్తింపచేయడంపై మా మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనందున... దీనిపై తగిన నిర్ణయం తీసుకోవాలని ఈ అంశాన్ని ప్రధాన న్యాయమూర్తికి నివేదిస్తున్నాం’’ అని జస్టిస్‌ అనిరుద్ధ బోస్‌ తెలిపారు. ఈ కేసులో చంద్రబాబుకు 52 రోజుల రిమాండ్‌ అనంతరం బెయిల్‌ లభించిన సంగతి తెలిసిందే. రిమాండ్‌ ఆర్డర్‌ జోలికి పోకూడదని న్యాయమూర్తులు నిర్ణయించారు. అవినీతి నిరోధక చట్టంతో పాటు ఐపీసీలోని సెక్షన్ల కింద కూడా కేసు నమోదు చేసినందున... రిమాండ్‌ ఆర్డర్‌లో లోపాలు లేవని వారు భావించారు. అవినీతి నిరోధక చట్టంలోని 17ఏ సెక్షన్‌కు భాష్యం చెప్పడంలో ఇరువురు న్యాయమూర్తుల మధ్య భిన్నాభిప్రాయం వ్యక్తం కావడంతో... ఈ అంశాన్ని విస్తృత ధర్మాసనానికి నివేదించే అవకాశముంది. దీంతో మొత్తం కేసు విచారణ మళ్లీ మొదటి నుంచి జరగవచ్చని, అది తేలేందుకు సమయం పట్టవచ్చునని న్యాయ నిపుణులు భావిస్తున్నారు. బుధవారం జరగాల్సిన ఫైబర్‌ నెట్‌ కేసు విచారణపైనా ఈ తీర్పు ప్రభావం చూపించవచ్చునని అభిప్రాయపడుతున్నారు.

Updated Date - Jan 17 , 2024 | 03:22 AM