Share News

ఆ మసాలాల్లో క్యాన్సర్‌ కారకాలు!

ABN , Publish Date - Apr 22 , 2024 | 03:42 AM

భారతదేశంలో ప్రసిద్ధి చెందిన మసాలా ఉత్పత్తుల తయారీ సంస్థలు.. ఎవరెస్ట్‌, ఎండీహెచ్‌ (మహాషియాన్‌ డి హట్టి ప్రైవేట్‌ లిమిటెడ్‌)! ఈ రెండు సంస్థలకు చెందిన నాలుగు ఉత్పత్తుల్లో క్యాన్సర్‌ కారకాలు ఉన్నాయని హాంకాంగ్‌ ఆహార నియంత్రణ ప్రాధికార సంస్థ ‘సెంటర్‌ ఫర్‌ ఫుడ్‌ సేఫ్టీ’ వెల్లడించింది.

ఆ మసాలాల్లో  క్యాన్సర్‌ కారకాలు!

ఎవరెస్ట్‌, ఎండీహెచ్‌ స్పైసెస్‌కు చెందిన నాలుగు ఉత్పత్తుల్లో ఇథిలీన్‌ ఆక్సైడ్‌

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 21 (ఆంధ్రజ్యోతి): భారతదేశంలో ప్రసిద్ధి చెందిన మసాలా ఉత్పత్తుల తయారీ సంస్థలు.. ఎవరెస్ట్‌, ఎండీహెచ్‌ (మహాషియాన్‌ డి హట్టి ప్రైవేట్‌ లిమిటెడ్‌)! ఈ రెండు సంస్థలకు చెందిన నాలుగు ఉత్పత్తుల్లో క్యాన్సర్‌ కారకాలు ఉన్నాయని హాంకాంగ్‌ ఆహార నియంత్రణ ప్రాధికార సంస్థ ‘సెంటర్‌ ఫర్‌ ఫుడ్‌ సేఫ్టీ’ వెల్లడించింది. సాధారణ పరీక్షల్లో భాగంగా ఈ రెండు కంపెనీలకు చెందిన నాలుగు ఉత్పత్తుల నమూనాలను పరీక్షించామని.. వాటిలో మానవ వినియోగానికి పనికిరాని ఇథిలీన్‌ ఆక్సైడ్‌ (పురుగుమందుల్లో ఉండే రసాయనం) ఉన్నట్టు వెల్లడైందని వివరించింది. ఆ నాలుగు ఉత్పత్తుల్లో ఒకటి ఎవరెస్ట్‌ కంపెనీకి చెందిన ఫిష్‌ కర్రీ మసాలా కాగా.. మిగతా మూడూ ఎండీహెచ్‌ స్పైసె్‌సకు చెందిన మద్రాస్‌ కర్రీ పౌడర్‌ (స్పైస్‌ బ్లెండ్‌ ఫర్‌ మద్రాస్‌ కర్రీ), మిక్స్‌డ్‌ మసాలా పౌడర్‌, సాంబార్‌ మసాలా. వీటిలో తాము గుర్తించిన ఇథిలీన్‌ ఆక్సైడ్‌ను.. ‘ఇంటర్నేషనల్‌ ఏజెన్సీ ఫర్‌ రిసెర్చ్‌ ఆన్‌ క్యాన్సర్‌’ సంస్థ గ్రూప్‌ 1 క్యాన్సర్‌ కారకంగా వర్గీకరించిందని తెలిపింది. ఈ నేపథ్యంలో ఈ నాలుగు ఉత్పత్తుల విక్రయాన్ని నిలిపివేయాలని, ఇప్పటికే దుకాణాల్లో విక్రయానికి సిద్ధంగా ఉంచినవాటిని తొలగించాల్సిందిగా విక్రేతలను ఆదేశించినట్టు వెల్లడించింది. హాంకాంగ్‌ సెంటర్‌ ఫర్‌ ఫుడ్‌ సేఫ్టీ ప్రకటన నేపథ్యంలో.. భారతదేశం నుంచి దిగుమతి చేసుకున్న ఎవరెస్ట్‌ ఫిష్‌ కర్రీ మసాలను సింగపూర్‌ తన మార్కెట్ల నుంచి ఉపసంహరించింది. రొమ్ము క్యాన్సర్‌, లింఫోమా (లింప్‌ గ్రంధుల్లో క్యాన్సర్‌)కు కారణమయ్యే ఇథిలీన్‌ ఆక్సైడ్‌ ఆనవాళ్లు అందులో ఉండడమే తమ నిర్ణయానికి కారణంగా పేర్కొంది.

Updated Date - Apr 22 , 2024 | 03:42 AM